రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించి దేశ చరిత్రలో సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ వీపీ సింధును మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సింధును ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జునతోపాటు సీనియర్ కథానాయికలు రాధిక, సుహాసిని సహా చిరంజీవి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
సింధును చూసి దేశం మురిసిపోతుంటే.. ఆమె తన బిడ్డే అనే భావన కలిగిందని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. చిరు కుటుంబం తనపై చూపించిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్న సింధు.. వచ్చే ఒలింపిక్స్‌లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తానని వెల్లడించింది.