కరోనా వైరస్ మహమ్మారిపై ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఈ వైరస్ నియంత్రణ చర్యల కోసం తమ వంతు సాయం చేస్తున్నారు. టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి, సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం రూ.కోటి ఇవ్వనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
'కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత విషమ పరిస్థితులను అధిగమించాలంటే లాక్‌డౌన్ ఒక్కటే మార్గం. ఇది దినసరి కూలీలు, అల్ప ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులో తెలుగు చిత్ర పరిశ్రమ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఫిల్మ్ వర్కర్స్ సంక్షేమ నిధికి రూ. కోటి విరాళం ఇస్తున్నా' అని ట్వీట్ చేశాడు చిరు.
మహేశ్‌బాబు రూ.కోటి విరాళం
కరోనాపై పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భారీ విరాళం ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు చెరో రూ.50 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు చెప్పాడు.
'కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఈ పోరాటంలో నేనూ భాగస్వామిని కావాలనుకుంటున్నాను. ఇందులో భాగంగా నా వంతు కృషిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. నిబంధనలు పాటించి, లాక్‌డౌన్‌కు సహకరించండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒకరికొకరు అండగా నిలబడుతూ మనల్ని మనం సంరక్షించుకోవాలి. మానవత్వంతో ఈ యుద్ధంలో గెలుద్దాం. అప్పటివరకూ ఇళ్లలో భద్రంగా ఉండండి' అని మహేశ్ పేర్కొన్నాడు.
విరాళాలిచ్చిన మరికొందరు తారలు
అగ్రహీరో ప్రభాస్, కరోనాపై పోరాటంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. రూ. కోటి విరాళం ప్రకటించాడు. వీరితో పాటు పవన్‌కళ్యాణ్- రూ. 2 కోట్లు, నితిన్- రూ. 20 లక్షలు, రామ్ చరణ్- రూ. 70 లక్షలు, త్రివిక్రమ్- రూ.20 లక్షలు, అనిల్ రావిపూడి- రూ. 10 లక్షలు, కొరటాల శివ- రూ.10 లక్షలు, దిల్ రాజు, శిరీష్‌లు- రూ. 20 లక్షలు, సాయి తేజ్- రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించగా, తన సినిమా కోసం పనిచేస్తున్న 50 మంది కార్మికులకు అల్లరి నరేశ్ ఒక్కొక్కరికి రూ.10 వేలు సాయం చేశాడు.
ఇదీచదవండి:బాబాయ్ దారిలో అబ్బాయి.. రూ.70 లక్షలు విరాళం