తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సిరివెన్నెల మృతిపై మోదీ, చిరు విచారం - సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం

Sirivennela sitaramasastry died: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తమను ఎంతో బాధించిందని అన్నారు ప్రధానమంత్రి మోదీ, సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, మెగాస్టార్​ చిరంజీవి, పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

modi  Condolences to Sirivennela sitaramasastri
సిరివెన్నెల మృతిపై మోదీ, చిరు విచారం

By

Published : Nov 30, 2021, 7:16 PM IST

Updated : Nov 30, 2021, 8:00 PM IST

Sirivennela sitaramasastry died: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో తెలుగు చిత్రసీమ గొప్ప గేయ రచయితను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆయన్ను గుర్తుచేసుకుంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి మోదీ కూడా సిరివెన్నెల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపం తెలియజేస్తూ తెలుగులో ట్వీట్​ చేశారు.

"అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి" అని మోదీ అన్నారు.

సిరివెన్నెల మృతిపై విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి మోదీ

అన్యాయం చేశారు

మెగాస్టార్​ చిరంజీవి కూడా సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సిరివెన్నెల మరణంతో తన గుండె తరుక్కుపోతోందని, బరువెక్కిపోతోందని చిరు అన్నారు. తెలుగు సినీపరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీచేయలేరని చెప్పారు. ఎంతో మందిని శోక సముద్రంలో ముంచి దూరమైపోయిన ఆయన నిజంగా మనందరికీ, ఈ సాహిత్య లోకానికి అన్యాయం చేశారని చెప్పుకొచ్చారు. భౌతికంగా సిరివెన్నెల దూరమైన కానీ తన పాటలతో ఇంకా ఆయన బతికే ఉన్నారని వెల్లడించారు.

సిరివెన్నెల మృతిపై విచారం వ్యక్తం చేసిన చిరంజీవి
సిరివెన్నెల మృతిపై విచారం వ్యక్తం చేసిన చిరంజీవి
సిరివెన్నెల మృతిపై విచారం వ్యక్తం చేసిన చిరంజీవి
సిరివెన్నెల మృతిపై విచారం వ్యక్తం చేసిన చిరంజీవి
సిరివెన్నెల మృతిపై విచారం వ్యక్తం చేసిన చిరంజీవి

చాలా బాధపడ్డా

"సిరివెన్నెల లేరని తెలిసి ఎంతో బాధపడ్డా. ఆయన రాక.. తెలుగుపాటకు ఊపిరిలూదింది. నలుగురి నోటా పదికాలాలు పలికే పాటలు రాశారు. సాహితీ విరించి సిరివెన్నెల కుటుంబసభ్యులకు సానుభూతి" అని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.

తీరని లోటు

హీరో పవన్​కల్యాణ్​ కూడా సిరివెన్నెల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన లేరన్న వార్త జీర్ణించుకోలేనిదని అన్నారు. సీతారామశాస్త్రి మరణం సినీ పరిశ్రమకే కాదు.. తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని చెప్పారు.

సిరివెన్నెల మృతిపై విచారం వ్యక్తం చేసిన పవన్​కల్యాణ్​

ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు

సిరివెన్నెల మరణం తనకు తీరని లోటు అని అన్నారు విశ్వనాథ్​. "ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మృతి నాకు తీరని లోటు. బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం పోయిందనుకున్నా. సిరివెన్నెల మృతితో ఇప్పుడు నా ఎడమ భుజం కోల్పోయినట్లు అయింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను." అనివిశ్వనాథ్ అన్నారు.

మాది 35 ఏళ్ల అనుబంధం.. నాది మాటలకు అందని బాధ

నిర్మాతగా తన తొలి సినిమా 'లేడీస్ టైలర్' నుంచి లేటెస్ట్ 'రెడ్' వరకూ... తమ సంస్థలో సుమారు 80 పాటల వరకూ 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రాశారని నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ అన్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకెంతో లోటు అని, ఏం చెప్పాలో తెలియడం లేదని, తనకు మాటలు రావడం లేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన పెద్దన్నయ్యను కోల్పోయినట్టు ఉందని రవికిశోర్ అన్నారు.

"ఏం చెప్పాలో తెలియడం లేదు. మాటలకు అందని బాధ ఇది. అన్నయ్యతో అనుబంధం ఈనాటిది కాదు. నిర్మాతగా నా తొలి సినిమా 'లేడీస్ టైలర్'లో అన్ని పాటలూ ఆయనే రాశారు. అప్పటి నుంచి సీతారామశాస్త్రి గారితో పరిచయం ఉంది. అప్పటి నుంచి మా ప్రయాణం కంటిన్యూ అవుతోంది. బహుశా... ఏ నిర్మాతకూ రాయనన్ని పాటలు మా సినిమాకు రాశారని చెప్పవచ్చు. 'మహర్షి', 'ఏప్రిల్ 1 విడుదల', 'మావిచిగురు', 'ఎగిరే పావురమా', 'నువ్వు నాకు నచ్చావ్', 'నువ్వే కావాలి', 'నువ్వే నువ్వే', 'ఎలా చెప్పను', 'గౌరీ', 'నేను శైలజ', 'రెడ్'... దాదాపుగా నేను నిర్మించిన అన్ని సినిమాల్లోనూ ఆయన పాటలు రాశారు. ఎక్కడో ఒకటి అరా పాటలు వేరేవాళ్లు రాశారు తప్పితే... ఎక్కువ సినిమాలకు ఆయనదే సింగిల్ కార్డ్. స్రవంతి మూవీస్ సంస్థలో సుమారు 80 పాటల వరకూ రాసి ఉంటారు. ఆయనతో మ్యూజిక్ సిట్టింగ్స్, రైటింగ్ సిట్టింగ్స్​కు కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కో పాట రాయడానికి ఐదారు రాత్రులు కూర్చునే వాళ్ళం. ఇంకా ఏదో రాయాలని ఆయన పరితపించేవారు. ఇది వరకు పాట అంటే నాలుగైదు సన్నివేశాల్లో చెప్పాల్సిన సారాన్ని చెప్పేవాళ్లం. అందులో ఆయన మేటి. రామ్ హీరోగా నిర్మించిన 'రెడ్'లో ఆయన పాటలు రాశారు. అప్పుడు డిసెంబర్ 2019లో ఆ పాటల కోసం రాత్రుళ్లు కూర్చున్నాం. ఆ తర్వాత కరోనా వచ్చాక కలవడం కుదరలేదు. నాకంటే ఆయన రెండు నెలలు పెద్దవారు. అందుకని, నన్ను 'కుర్రకుంక' అని సరదాగా అనేవారు. నేను రాముడు అని పిలిచేవాడిని. సాయంత్రం మా ఆఫీసుకు వస్తే సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకొనేవాళ్లం. ఆయన ఆరోగ్యం గురించి మొన్న ఒకరితో మాట్లాడితే... త్వరలో ఆరోగ్యంగా తిరిగి వస్తారని అన్నారు. ఇంతలో ఇటువంటి విషాద వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు" అని అన్నారు.

'రెడ్' సినిమా పాటలు రాసేటప్పుడు జరిగిన సంఘటన గురించి 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ "వారం రోజుల్లో 'రెడ్' సినిమాలో సాంగ్ షూటింగ్ అనగా... పాట రెండు రోజుల్లో రాసి ఇచ్చేస్తానని అన్నారు. కథ మొత్తం విని... 'ఈ కథకు ఈ పాట కరెక్ట్ కాదు. నేను రాసినా, మీరు చిత్రీకరించినా... ఆ తర్వాత తీసేస్తారు' అని చెప్పారు. దాంతో మేం ఆ పాటను తీసేశాం. అలా ఎవరు చెబుతారు చెప్పండి? డబ్బులు చూసుకుంటారు తప్ప, పాట వద్దని ఎవరంటారు? ఇటువంటి సంఘటనలు మా మధ్య చాలా జరిగాయి. మా మధ్య సుమారు 400 రాత్రులు సాహిత్య చర్చలు జరిగాయి" అని రవికిశోర్ చెప్పారు.

ఇదీ చూడండి:'సిరివెన్నెల' అస్తమయం.. సినీప్రముఖుల నివాళులు

Last Updated : Nov 30, 2021, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details