"హీరోల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అలా ఉంటే ఈ పరిశ్రమలో ఎలాంటి వివాదాలు ఉండవు. తాత్కాలికమైన పదవుల కోసం మాటలు అనడం.. అనిపించుకోవడం వల్ల బయట వాళ్లకి లోకువైపోతామ"న్నారు కథానాయకుడు చిరంజీవి. ఆయన ఆదివారం(అక్టోబర్ 10) హైదరాబాద్‌లో జరిగిన 'పెళ్లి సందడి'(Pellisandadi movie pre release event) విడుదల ముందస్తు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోషన్, శ్రీలీల జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వ(Raghavendra Rao Pelli Sandadi) పర్యవేక్షణలో రూపొందిన చిత్రమిది. గౌరీ రోణంకి తెరకెక్కించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ వేడుకకు చిరంజీవి, వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి(chiranjeevi latest movie) మాట్లాడుతూ.. "బెజవాడలో 'పెళ్లి సందడి' 175రోజుల వేడుకకు నేనే ముఖ్య అతిథిగా హాజరయ్యా. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఇప్పుడీ 'పెళ్లి సందడి' వేడుకకు నన్ను ముఖ్య అతిథిగా పిలవడం ఆనందంగా ఉంది. వెంకటేష్ నా చిరకాల మిత్రుడు. తన సినిమా బాగుంటే నేను.. నా చిత్రం నచ్చితే తను ఒకరినొకరం అభినందించుకుంటాం. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం అందరి హీరోల మధ్య ఉండాలి. మన ఆధిపత్యం చూపించుకోవడానికి అవతలి వాళ్లను కించపరచాల్సిన అవసరం లేదు. అసలు వివాదానికి మూలం ఎవరో గుర్తించి.. అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టగలిగితే మనదే వసుధైక కుటుంబం" అన్నారు.