తన 152వ సినిమా పేరును స్వయంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రముఖ నటుడు బ్రహ్మజీ కుమారుడు సంజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఓ పిట్ట కథ'. దీని ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ హాజరై మాట్లాడాడు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం గురించి చెప్పే క్రమంలో చిత్రం పేరును 'ఆచార్య'గా చెప్పేశాడు. దీంతో అక్కడున్న అభిమానులు కేరింతలతో హోరెత్తించారు.
అనుకోకుండా సినిమా టైటిల్ చెప్పేసిన మెగాస్టార్
ఆదివారం జరిగిన 'ఓ పిట్టకథ' ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరు.. తన కొత్త సినిమా టైటిల్ను చెప్పేశాడు. ఆపై దర్శకుడు కొరటాల శివకు క్షమాపణలు చెప్పాడు.
'ఎక్కడ మిస్సయ్యానో తెలియడం లేదు. కొరటాల శివ ఓ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చిత్రం టైటిల్ను లాంచ్ చేద్దామనుకున్నారు. కానీ నా నోటి ద్వారా లాంచ్ అయిపోయింది. సారీ శివ ఏమనుకోవద్దు. మంచి మంచి వార్తలు ఆపుకోలేం. వాటిని ఆపడం కూడా కరెక్టు కాదు' -మెగాస్టార్ చిరంజీవి, హీరో
సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.