మూడేళ్ల తర్వాత మళ్లీ పవన్‌కల్యాణ్ అదే వేడి, వాడి, పవర్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. శుక్రవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి 'వకీల్‌సాబ్' చిత్రాన్ని వీక్షించిన చిరు.. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మరోవైపు నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్‌తేజ్, సుస్మిత సైతం సోషల్‌మీడియా వేదికగా పవన్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.
"మూడేళ్ల తర్వాత మళ్లీ పవన్‌కల్యాణ్ అదే వేడి, వాడి, పవర్‌తో వచ్చాడు. ప్రకాశ్‌రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం! నివేదా థామస్, అంజలి, అనన్య వాళ్ల పాత్రల్లో జీవించారు. సంగీతంతో తమన్, కెమెరా పనితనంతో వినోద్ సినిమాకు ప్రాణం పోశారు. దిల్‌రాజు, బోనీకపూర్, వేణుశ్రీరామ్‌తోపాటు మిగతా టీమ్‌కు నా శుభాకాంక్షలు. అన్నింటినీ మించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యద్భుతమైన చిత్రమిది. ఈ వకీల్‌సాబ్ కేసుల్నే కాదు అందరి మనసుల్నీ గెలుస్తాడు!"
- చిరంజీవి, కథానాయకుడు
"మూడేళ్ల ఆకలికి 'వకీల్‌సాబ్'తో జీవితకాలానికి సరిపడా విందు అందించాడు. ఈ సినిమాకు రివ్యూ రాయమని చాలామంది నన్ను అడిగారు. కానీ, నేను నో అని చెప్పాను. ప్రస్తుతం ఎదురవుతున్న ఓ క్లిష్టమైన సమస్యతో వచ్చిన ఈ సినిమా సమాజంలో ఉన్న ప్రతిఒక్కర్నీ ఆకర్షించింది."
- నాగబాబు, నటుడు, నిర్మాత
"అబ్జక్షన్!! అబ్జక్షన్!! అబ్జక్షన్!! వాట్ ఏ పవర్‌ప్యాక్డ్ పెర్ఫామెన్స్. కల్యాణ్ మామ నటన అద్భుతంగా ఉంది. సరైన సమయంలో వచ్చిన సరైన సినిమాలో సరైన వ్యక్తి నటించారు. బ్లాక్‌బస్టర్ వకీల్‌సాబ్"
- సాయిధరమ్ తేజ్, కథానాయకుడు