తనలో హీరోను గుర్తించింది పెదన్నాన్న చిరంజీవేనని మెగాహీరో వరుణ్ తేజ్ చెప్పారు. దీనితోపాటే తన జీవితానికి సంబంధించిన చాలా విషయాల్ని గతంలో 'ఈనాడు' ఇంటర్వ్యూలో పంచుకున్నారు. వరుణ్ 31వ పుట్టినరోజు సందర్భంగా అవన్నీ మీకోసం మరోసారి.
అమ్మ అర్థం చేసుకుంటుంది
నన్ను అమ్మ బాగా అర్థం చేసుకుంటుంది. నాకేం కావాలో చెప్పకుండానే తెలుసుకుంటుంది. అమ్మంటే అంతే కదా! నేనే హీరోను కావాలని బలంగా కోరుకుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా సినిమాలన్నీ చూస్తుంది. మెచ్చుకుంటుంది.
ఐదుసార్లు కాళ్లు విరిగాయి
నాకు చిన్నప్పటి నుంచి ఐదారుసార్లు కాళ్లు, చేతులు విరిగాయి. ఎప్పుడూ నా కుటుంబం నాతో ఉండి నన్ను నడిపించింది. స్నేహితులు అన్ని సమాయాల్లో నాతో ఉంటూ ప్రోత్సాహించారు.
నాలో హీరోను గుర్తించింది చిరంజీవే
ఒకసారి 'మగధీర' షూటింగ్ సమయంలో నేను పెదనాన్నతో కలిసి రాజస్థాన్ వెళ్లాను. ఆయనకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఎక్కువగా ఫొటోలు తీస్తుంటారు. అలా అక్కడ నా ఫొటోలు కొన్ని తీశారు. తర్వాత ఇంటికొచ్చాక వాటిని చూస్తూ.. 'రే నీలో మంచి ఫీచర్లున్నాయి. సినిమాల్లో ట్రై చేయొచ్చు' అని చెప్పారు. అప్పటికే సినిమాల్లోకి రావాలని నా మనసులో ఉండేది. పెదనాన్న చెప్పడం వల్ల ఆలస్యం చేయకుండా ఇంట్లో విషయం చెప్పేశాను.
పెదనాన్న చిరంజీవితో వరుణ్ తేజ్ చిరంజీవితో ఎప్పుడో నటించేశాను
'మగధీర'లో రామ్‌చరణ్‌తో కలిసి పెదనాన్న నటించారు. చరణ్ అన్న చాలా సంతోషపడ్డాడు. 'అన్న ఇప్పుడు చేశాడు, నేను ఎప్పుడో చేసేశాను' అని గర్వంగా చెప్పేవాడ్ని. 'హ్యాండ్స్ అప్' సినిమాలో పెదనాన్నతో కలిసి అతిథి పాత్ర చేశాను. దీని చిత్రీకరణ నిఫ్ట్‌లో జరిగింది. నేను అక్కడికి బాగా రెడీ అయి వెళ్లాను. దర్శకుడు అడిగారు. అనుకోకుండా నటించేశాను. అది నా అదృష్టం.
రియల్ లైఫ్‌లో తొలి ప్రేమ?
ప్రేమ అని అనలేం కానీ.. ఇష్టం. సినిమాల ప్రభావంతో స్కూల్లో చదివేటప్పుడు ఓ అమ్మాయి నచ్చింది. వన్‌సైడ్ లవ్‌స్టోరీ. ఆ అమ్మాయికి నా మనసులో మాట చెప్పలేదు. నా ఫ్రెండ్స్‌తో అన్నాను అంతే. ఆ తర్వాత ఆ అమ్మాయి ఫోన్ నంబర్ తెలుసుకోవడానికి స్లామ్ బుక్ ఉపయోగించాను. ఒకటి రెండుసార్లు ఫ్రెండ్లీగా మాట్లాడాను. తను చదువులో టాపర్. విదేశాలకు వెళ్లిపోయింది. నేను సినిమాల్లోకి వచ్చేశాను. అంతే తర్వాత దాని గురించి ఆలోచించలేదు.
చిరంజీవి నుంచి స్ఫూర్తి పొందిన ఘటన?
చిన్నప్పటి నుంచి నాకు రామ్‌చరణ్ కంటే పెదనాన్నతోనే చనువు ఎక్కువ. ఎందుకంటే చెన్నై నుచి ముందు మా కుటుంబమే హైదరాబాద్ వచ్చింది. అప్పుడు పెదనాన్న ఇక్కడ షూటింగ్ ఉన్నన్ని రోజులు మా ఇంట్లోనే ఉండేవారు. నేను, చెల్లి ఆయనతో ఎక్కువ గడిపేవాళ్లం. ఇంద్ర 75 రోజుల ఫంక్షన్లో నేను ఆయనను చూసి స్ఫూర్తి పొందాను. ఆ వేడుకకు కనుచూపమేరలో అభిమానులు వచ్చారు. చివర్లో ఉన్న జనాన్ని చూసి నాకు అనిపించింది.. వారికి ఎందుకు అంత అభిమానమని. అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆయనంత కాకపోయినా కొంతైనా నేను సాధించాలని.
బాబాయ్ పవన్ కల్యాణ్‌తో మీ అనుబంధం?
బాబాయ్ సాధారణంగా తక్కువ మాట్లాడుతారు. ఇంట్లోనే ఆయనను ఎక్కువగా కలుస్తాను. మాతో సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. ఒకసారి నేను సాయిధరమ్ తేజ నైట్ టైం బయటికి వెళ్లి ఆలస్యంగా వచ్చాం. అప్పుడు బాబాయ్ పిలిచి బాధ్యతను గుర్తుచేశారు. మీరు చిరంజీవి అనే పెద్ద చెట్టు నుంచి వచ్చారు. అది మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడదు. జీవితం అంటే సీరియస్‌గా తీసుకోండి. మీ గుర్తింపు మీదే. చిరంజీవి తమ్ముడి కొడుకని నీ సినిమాకు రారు. మీ ప్రయాణం మీదే. జాగ్రత్త అని కొంచెం గట్టిగా చెప్పారు. అప్పటి నుంచి నాలో, తేజులో మంచి మార్పు వచ్చింది.
చిరు, పవన్, తండ్రి నాగబాబుతో వరుణ్ తేజ్ నచ్చేవి
- చిరంజీవి 'రుద్రవీణ', చరణ్ 'మగధీర', అల్లు అర్జున్ 'ఆర్య', 'వేదం'
- రామ్‌చరణ్ డ్యాన్స్, అల్లు అర్జున్ అకుంఠిత శ్రమ, సాయి ధరమ్ తేజ్ కామెడీ
- అమ్మ చేసే బిర్యానీ, ఫిక్షన్ పుస్తకాలు
- పర్యాటకంగా లండన్(అక్కడి చల్లని వాతావరణం, ఆర్కిటెక్చర్)
- సౌందర్య, రమ్యకృష్ణల అభినయం
తండ్రి నాగబాబుతో వరుణ్ తేజ్