తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నవ్వుల నవాబు.. ఈ మెగా బ్రదర్​ నాగబాబు - నాగబాబు వార్తలు

'నాకూ.. అభిమానులకీ మధ్య వారధి నాగబాబు' అని అంటుంటారు మెగాస్టార్​ చిరంజీవి. నటుడిగా, నిర్మాతగా రాణించడమే కాకుండా.. అన్న చిరంజీవికి సంబంధించిన పలు వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తూ చేదోడు వాదోడుగా ఉంటారు నాగబాబు. నేడు (అక్టోబరు 29) నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Mega-Brother Nagababu birthday special story
నవ్వుల నవాబు ఈ మెగా బ్రదర్​

By

Published : Oct 29, 2020, 5:26 AM IST

మెగా బ్రదర్‌.. టాలీవుడ్‌లో ఈ ఇమేజ్‌ కేవలం ఒక్కరికే సొంతం. ఓ అన్నకు, ఓ తమ్ముడికి మధ్య పుట్టి.. ఆ అన్నదమ్ములు ఇండస్ట్రీలో నటులుగా దమ్ము చూపిస్తుంటే.. సంతోషించడమే కాకుండా.. అభిమానులకు, తన సోదరులకూ మధ్య వారధి, సారధిలా కీలక బాధ్యతలు చేపట్టిన మెగా బ్రదర్‌ ఆయన. అంతే కాదు. తానూ స్వయంగా నటుడిగా అందివచ్చిన పాత్రలు చేసుకుంటూ, కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ, టీవీల్లో సీరియల్స్‌తో పాటు జనాదరణ పొందిన కొన్ని కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ సత్తా చాటుకుంటున్నారు. అందుకే.. మెగాబ్రదర్‌ అనగానే వినోద ప్రపంచంతో అంతో ఇంతో పరిచయమున్న ప్రతి ఒక్కరూ ఆయన ఎవరో ఠక్కున చెప్పేస్తారు. బుల్లితెరపై 'జబర్దస్త్‌' జడ్జిగానూ ప్రేక్షకుల మనసులను దోచేసుకున్న ఆయనే.. నాగబాబు. అన్న చిరంజీవి, తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయినప్పటికీ, వాళ్ల ప్రేమ కాకుండా ప్రత్యేకంగా తనకంటూ గుర్తింపును తెచ్చుకోగలిగారు నాగబాబు. నేడు (అక్టోబరు 29) ఆయన పుట్టినరోజు సందర్భంగా నాగబాబు గురించి కొన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.

నాగబాబు

కుటుంబ నేపథ్యం

నాగబాబు పూర్తి పేరు కొణిదెల నాగేంద్ర బాబు. 1961 అక్టోబర్‌ 29న ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 1986 నుంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు. నాగబాబు తల్లిదండ్రుల పేర్లు కొణిదెల వెంకటరావు, అంజనా దేవి. నాగబాబు భార్య పేరు పద్మజ కొణిదెల. హీరో వరుణ్​ తేజ్​, నిహారిక వీరికి సంతానం.

కుటుంబంతో నాగబాబు

సహాయ పాత్రల్లో మెరిసి..

అన్న చిరంజీవికి మెగాస్టార్‌ అనే బిరుదు ఉంది. దశాబ్దాల తరబడి మెగాస్టార్‌గా చిరంజీవి సృష్టిస్తున్న సంచలనాలు అనేకం. ఆ స్ఫూర్తిని తానూ స్వీకరించిన నాగబాబు మొదట సినిమా పరిశ్రమలో సహాయక పాత్రల్లో నటిస్తూ ఉండేవారు. కొన్ని సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లోనూ నటించారు. నాగబాబు ప్రధాన పాత్రలు పోషించిన సినిమాలూ ఉన్నాయి. '143', 'అంజి', 'షాక్‌', 'శ్రీరామదాసు', 'చందమామ', 'ఆరెంజ్‌' వంటి ఎన్నో సినిమాలలో వివిధ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై సోదరులు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లతో అనేక చిత్రాలు నిర్మించారు.

నటుడిగా నాగబాబు

దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, రాధా, సుహాసిని నటించిన 'రాక్షసుడు' సినిమాలో 'సింహం' అనే పాత్రలో నటించారు నాగబాబు. ఆ తర్వాత 'మరణమృదంగం'లో 'బిల్లు'గా, 'త్రినేత్రుడు'లో సీబీఐ అధికారిగా, 'లంకేశ్వరుడు'లో ఓ అతిథి పాత్రలో.. ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు.

నిర్మాతగా

'రుద్రవీణ' సినిమాతో మొదటిసారి నిర్మాత అవతారం ఎత్తారు నాగబాబు. ఈ సినిమాను అంజనా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. బాలచందర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి, శోభన హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం వచ్చింది. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన 'త్రినేత్రుడు' చిత్రాన్ని నిర్మించిందీ నాగబాబే. ఆ తర్వాత 'ముగ్గురు మొనగాళ్లు', 'బావగారు బాగున్నారా', 'కౌరవుడు', 'గుడుంబా శంకర్‌', 'స్టాలిన్‌', 'ఆరెంజ్‌', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలను నిర్మించారు. 'ఆరెంజ్‌' చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడం వల్ల.. ఆపై ఆయన సినీ నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.

బుల్లితెరపై

బుల్లితెరపైనా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాగబాబు. 'అపరంజి', 'శిఖరం', 'సీతామహాలక్ష్మి' ధారావాహికలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్​', 'ఎక్స్​ట్రా జబర్దస్త్​' కామెడీ షోలకు జడ్జ్​గా వ్యవహరించారు.

ABOUT THE AUTHOR

...view details