ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు కీరవాణి కుమారుడిగా కాకుండా తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్నాడు శ్రీసింహ. ఈ యువ కథానాయకుడు హీరోగా నటించిన చిత్రం 'మత్తువదలరా'. ఈ సినిమా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించాడీ నటుడు.
"చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే చాలా ఇష్టం. డిగ్రీ అయ్యాక జాబ్ చేయాలి అనుకున్నా. అలా కొంతకాలం పాటు 'రంగస్థలం' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. అయితే మూడేళ్ల క్రితమే రితేశ్ 'మత్తు వదలరా' కథను మైత్రి మూవీ మేకర్స్‌కు చెప్పాడు. అది వాళ్లకు బాగా నచ్చింది. కాకపోతే ఆ సమయంలో వారు కొన్ని పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రితేశ్ కూడా స్ర్కిప్ట్‌లో మార్పులకు కొంత సమయం అడిగాడు. అప్పుడే మైత్రి మూవీ మేకర్స్ వారు అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా పని చూసి నేనైతే ఆ చిత్రానికి సరిపోతానని భావించారు. అలా నా వరకు కథ వచ్చింది."
"యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ చిన్ననాటి పాత్ర పోషించింది నేనే. అలాగే 'మర్యాదరామన్న' చిత్రంలో కనిపించేదీ నేనే. తారక్ అన్న అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం. 'మత్తు వదలరా' ఫస్ట్‌లుక్‌ను తారక్ అన్న విడుదల చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమా టీజర్‌ను చెర్రీ, ట్రైలర్‌ను రానా రిలీజ్ చేశారు. 'రంగస్థలం' సినిమా నుంచి చెర్రీ నాకు క్లోజ్. ఈ సినిమా ట్రైలర్ చూశాక డైరెక్టర్ సుకుమార్ నాకు ఫోన్ చేశారు. ట్రైలర్ బాగుందని ప్రశంసించారు."
"ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. నిద్రమత్తులో ఉండే హీరో చాలీచాలని జీతంతో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. అలాంటివాడికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన కథతో ఈ సినిమా తెరకెక్కించాం. కథ మొత్తం రెండు, మూడు రోజుల్లోనే అయిపోతుంది. 70 శాతం కథ కేవలం ఒక్క రోజులోనే అయిపోతుంది. ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాలో నటించా. ఈ చిత్రంలో పాటలు ఉండవు. అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది."
"అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసినప్పటికీ నాకు నటన అంటే చాలా ఇష్టం. నటుడిగానే ఉండాలని అనుకుంటున్నా. ప్రస్తుతం డైరెక్షన్ వైపు వెళ్లాలని అనుకోవడం లేదు. హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే సహాయ నటుడిగా కూడా నటిస్తా. రాజమౌళి సినిమాలో అయితే ఒక్క ఫ్రేమ్‌లో కనిపించినా చాలు. కొన్ని కథలు విన్నా. ఈ సినిమా ఫలితం బట్టి ఏ కథ ఎంపిక చేసుకోవాలో తర్వాత నిర్ణయిస్తా."
కుటుంబపరంగా మంచి గుర్తింపు ఉన్నా తండ్రీ పేరు వాడకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోరుకుంటూ ఆ దిశగా ముందుకు వెళ్తున్నాడు శ్రీసింహ. బుధవారం విడుదలవుతున్న తన సినిమాపై ప్రేక్షకుల స్పందన ప్రకారం రానున్న రోజుల్లో కథలు ఎంపిక చేసుకుని నటిస్తానని చెబుతున్నాడు.
ఇవీ చూడండి.. ధనుష్ సెంటిమెంట్ రీపీట్ అవుతుందా..!