మాస్ అనే మాటకు పర్యాయపదంలా కనిపిస్తుంటారు... రవితేజ. ఇక ఆయన పోలీస్ పాత్రతో చేసిన సినిమా అంటే ఆ లెక్క మరోలా ఉంటుంది. అంచనాలు పెరిగిపోతుంటాయి. రవితేజ మరోసారి పోలీసుగా నటించిన 'క్రాక్' ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో మంగళవారం ముచ్చటించారు. ఆ విషయాలివీ...
నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సంక్రాంతికి పోటీ గట్టిగానే ఉంది కదా...
ఉండాలి, ఇలా ఎన్నోసార్లు జరిగింది. బాగున్నాయంటే సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడతాయి. నాలుగు కాదు, ఐదు సినిమాలు ఆడిన రోజులు కూడా ఉన్నాయి. పండగ ప్రత్యేకత కూడా అదే. ఈ సినిమా చూశాను కాబట్టి, ఇది చూడననే పరిస్థితి ఉండదు. పండగంటే అన్ని సినిమాలూ చూసేస్తారు. పండగ సీజన్‌లో ప్రేక్షకుల ఉత్సాహం వేరుగా ఉంటుంది. మిగతా సమయాల్లో సినిమాలు విడుదల కావడానికి, పండగ సందర్భంలో ప్రేక్షకుల ముందుకొచ్చే సినిమాలకూ చిన్న తేడా ఉంటుంది. నేను కూడా అలా సినిమాలు చూసి వచ్చినవాణ్నే.
కొవిడ్ జాగ్రత్తల వల్ల యాభై శాతం ప్రేక్షకులతోనే ప్రదర్శనలు నిర్వహించాల్సి ఉంటుంది. తమిళనాడులో వంద శాతం ప్రేక్షకుల్ని అనుమతించారు. మీవైపు నుంచి ఆ ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?
మనకూ వంద శాతం అనుమతులు వస్తే బాగుంటుంది. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. యాభై శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు నిర్వహించినా సినిమా ఫలితం బాగుంటుందని నా నమ్మకం. ఆ విషయంలో నాకైతే ఎలాంటి భయాలు లేవు. థియేటర్లో సినిమా చూసేవాళ్లను నేను కోరుకునేది ఒక్కటే. దయచేసి మాస్క్‌లు, చిన్నసైజ్ శానిటైజర్లు చేతిలో పెట్టుకుని వెళితే చాలా బాగుంటుంది. చాలా సురక్షితంగా ఉంటాం. అభిమానులంటే ఇక అరుపులు ఉంటాయి కదా, వాళ్లని మాస్క్‌లు వేసుకునే అరవండని చెబుతున్నాం.
'క్రాక్' ఎలా ఉండబోతోంది?
పక్కా వాణిజ్య చిత్రం. మాసీగా, ఫుల్ మీల్స్‌లా ఉంటుందనుకోండి. ప్రేక్షకులు సంతోషంగా చూస్తారు. వాళ్లకు కచ్చితంగా నచ్చుతుంది. సినిమా చాలా బాగొచ్చింది. నా పాత్రను కూడా చాలా బాగా ఆస్వాదించా. గోపీచంద్ మలినేనికీ, నాకూ బాగా సెట్ అయింది. అలా అని మేం ముందుగా అనుకుని ఈ సినిమా చేయలేదు. అలా కుదిరిందంతే. హ్యాట్రిక్ కొడతామని మేం నమ్ముతున్నాం. నా సినిమాలకు ఎలాంటి సంగీతం ఇవ్వాలో తమన్‌కు బాగా తెలుసు. తనకు నేనే కాదు, ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రఖని నేను బాగా ఇష్టపడే అతి కొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు. ఇదివరకు తన దర్శకత్వంలో పని చేయడాన్ని ఎంతగా ఆస్వాదించానో, తనతో కలిసి ఈ సినిమాలో నటించడాన్నీ ఆస్వాదించాను. శ్రుతి హాసన్ పాత్ర చాలా బాగుంటుంది.