బాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోయిన్లు నటనతో పాటు ఇతర రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు. తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి చాలా పేరు తెచ్చుకుంటున్నారు. దీంతో పాటే రచనా శైలితోనూ గొప్ప రచయిత్రులుగా పేరు సంపాదిస్తున్నారు. ఇంతకీ వారెవరు? ఏయే పుస్తకాలు రాశారు?
శిల్పాశెట్టి
నటిగా, ఫిట్నెస్-యోగా కోచ్‌గా, బిజినెస్ ఉమెన్‌గా శిల్పా శెట్టి మంచి పేరు సంపాదించుకుంది. వీటితో పాటు ఈమె ఓ పుస్తకమూ రాసింది. 2015లో మార్కెట్లోకి వచ్చిన ఈ బుక్ పేరు 'ది గ్రేట్ ఇండియన్ డైట్'. తన లైఫ్‌స్టైల్ కోచ్ లూక్ కౌటిన్హోతో కలిసి దీనిని పూర్తి చేసింది శిల్ప. మంచి ఆహారం, రెగ్యులర్‌గా డైట్ పాటించడం లాంటి అంశాలను ఇందులో ప్రస్తావించింది.
దివ్య దత్తా
తన తల్లిపై ప్రేమను అక్షర రూపంలో పెట్టి 'మీ అండ్ మా' పుస్తకాన్ని రూపొందించి, రచయిత్రిగా మారింది నటి దివ్య దత్తా. 2017 పిభ్రవరిలో విడుదలైన ఈ పుస్తకంలో.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి ఎలా సహాయం చేసిన సందర్భాలను వివరించింది.
అను అగర్వాల్
ఆషికీ సినిమాతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న అను అగర్వాల్.. తన జీవితంలో ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొంది. 'అను యూజువల్: 2015లో మృత్యువును జయించిన ఓ బాలిక కథ' పుస్తకాన్ని రాసింది. జీవితంలో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లను ఇందులో పొందుపరిచింది. ఉత్తరాఖండ్‌లోని యోగా ఆశ్రమంలో తను గడిపిన రోజులు, ముంబయికి వచ్చి నటిగా ఎదగడం, ఘోర రోడ్డు ప్రమాదంలో 29 రోజుల పాటు కోమాలోకి వెళ్లడం లాంటి అనుభవాలు ఇందులో పంచుకుంది.
సోహా అలీ ఖాన్
ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత చదువులు చదివి, నటిగా జీవితం సాగిస్తున్న సోహా అలీ ఖాన్‌కు పుస్తకాలంటే పిచ్చి. 2017లో 'పెరిల్స్ ఆఫ్ బీయింగ్ మోడరేట్లీ ఫేమస్' బుక్‌ను స్వయంగా రాసింది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ కుటుంబాల నుంచి వచ్చి.. ప్రత్యేకంగా ఎదగడం ఎంత కష్టమో కాస్త నిరాశ కనబరుస్తూ హాస్యాస్పదంగా వివరించింది. పాఠకుల నుంచి ఈ పుస్తకానికి మంచి స్పందన రావడం విశేషం.