మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో(MAA Elections 2021) అధ్యక్షుడిగా ఓటమి అనంతరం 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash Raj panel) ప్రకటించారు. ఇది బాధతో చేస్తున్న రాజీనామా కాదని, 'అతిథిగా వచ్చాను.. అతిథిగా ఉండాలి' అనే ఉద్దేశంతో చేస్తున్నానని అన్నారు. ఈ మేరకు 'మా' ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు(Manchu Vishnu panel)కు సందేశం పంపారు. దీనిపై మంచు విష్ణు రిప్లై ఇచ్చి, ఆ స్క్రీన్‌షాట్‌ను అభిమానులతో పంచుకున్నారు.
'మా'కు ప్రకాశ్ రాజ్ రాజీనామా.. 'లవ్ యూ' చెప్పిన విష్ణు - ప్రకాశ్ రాజ్ రాజీనామా
'మా' ఎన్నికల్లో (MAA Elections 2021) ఓటమి అనంతరం తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు 'మా' అధ్యక్ష పదవికి పోటీపడిన ప్రకాశ్ రాజ్. ఈ విషయాన్ని కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ మంచు విష్ణు(manchu vishnu panel)కు తెలియజేశారు. దీనిపై స్పందిస్తూ తొందర పడొద్దు అంటూ రిప్లై ఇచ్చారు విష్ణు.
ప్రకాశ్‌రాజ్: "డియర్ విష్ణు, 'మా' ఎన్నికల్లో నీవు సాధించిన అద్భుత విజయానికి అభినందనలు. 'మా'ను నడిపించేందుకు అవసరమైన శక్తినంత పొందాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి. నాన్-మెంబర్‌గా నీకు అన్ని విధాలా సాయం చేస్తా.. థ్యాంక్యూ ప్రకాశ్‌రాజ్" అని మెస్సేజ్ పంపగా, అందుకు విష్ణు సమాధానం ఇచ్చారు.
మంచు విష్ణు: "మీరు తీసుకున్న నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను. మీరు నాకంటే పెద్ద వారు. జీవితంలో గెలుపోటములనేవి ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. మీరు భావోద్వేగానికి లోనుకావొద్దు. మా కుటుంబలో మీరూ భాగమే. కలిసి పనిచేయడానికి మీ ఆలోచనలకు మాకు అవసరం. మీరు ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వొద్దు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. అన్ని విషయాలపై చర్చించుకుందాం. లవ్ యు అంకుల్. దయచేసి తొందరపడొద్దు" అని పేర్కొన్నారు.