'మోసగాళ్లు' లాంటి సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఇటీవల ప్రేక్షకుల్ని అలరించిన నటుడు మంచు విష్ణు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి స్పందించారు. అంతేకాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యాక్షన్ మూవీగా మంచు విష్ణు 'భక్త కన్నప్ప'! - మంచు విష్ణు భక్తకన్నప్ప సినిమా
ఇటీవల 'మోసగాళ్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో మంచు విష్ణు.. తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. ప్రస్తుతం 'ఢీ అండ్ ఢీ', 'భక్త కన్నప్ప' సినిమాల కోసం సిద్ధమవుతున్నారని తెలిపారు. తన దృష్టిలో 'భక్త కన్నప్ప' యాక్షన్ మూవీ అని వెల్లడించారు.
"ప్రస్తుతం నేను శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న 'ఢీ అండ్ ఢీ' కోసం సిద్ధమవుతున్నా. నిజం చెప్పాలంటే ఇది 'ఢీ'కి సీక్వెల్ కాదు. ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్.. అన్నీ డబుల్ డోస్‌లో ఉంటాయి. ప్రస్తుతానికి నటీనటుల ఎంపికలు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత నా డ్రీమ్ ప్రాజెక్ట్ 'భక్తకన్నప్ప' పట్టాలెక్కించాలనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల అంతా సక్రమంగా జరిగితే ఆ సినిమా ప్రారంభించేస్తా. ఆ సినిమా కోసం ఇప్పటికే సీనియర్ నటుడు తనికెళ్లభరణితో ఒక వెర్షన్ కథ రాయించాను. అదే కథకు అమెరికాలో మరో వెర్షన్ సిద్ధం చేయించాం. ఆ తర్వాత నేను ఒక వెర్షన్ రాశా. నేను రాసిన వెర్షన్ తీసుకుని బుర్రా సాయిమాధవ్ కీలక కథను సిద్ధం చేస్తున్నారు. నా దృష్టిలో ఇది ఒక పెద్ద యాక్షన్ మూవీ. భారీ బడ్జెట్‌తో కూడుకున్నది. దానిపై రీసెర్చ్ చేస్తున్నాం" అని విష్ణు తెలిపారు.
ఇదీ చూడండి: 'మంచి కథ దొరికితే రిస్క్ తీసుకోక తప్పదు'