"రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రం 'మోసగాళ్లు'. ప్రేక్షకులకు కచ్చితంగా ఓ కొత్త అనుభూతిని పంచిస్తుంద"న్నారు మంచు విష్ణు. ఆయన హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందించిన పాన్ ఇండియా చిత్రమిది. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ప్రధానపాత్రలు పోషించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు విష్ణు.
కథపై పరిశోధన
"ముంబయిలోని ఓ బస్తీలో ఉండే అక్కాతమ్ముడు అమెరికాలోని ప్రజల నుంచి రూ.2800 కోట్లు దోచుకున్నారు. వాళ్ల ఉద్దేశం ఏంటంటే.. తెల్లవాళ్ల దగ్గర డబ్బుంటుంది కాబట్టి వాళ్లను మోసం చేసినా తప్పులేదని. అయితే ఈ స్కామ్ వల్ల ఎక్కువగా అమాయకులు, రోజువారీ వేతనంపై ఆధారపడే శ్రమజీవులే నష్టపోయారు. మరి ఇంతటి భారీ కుంభకోణానికి కారణమైన వీరు ఎలా తప్పించుకున్నారన్నది కథాంశం. దీనిపై చాలా పరిశోధన చేశాం. ఈ స్కామ్‌ను ఇన్విస్టిగేట్ చేసిన డీసీపీని కలిసి.. ఈ కేసు పూర్వపరాలు తెలుసుకున్నా. ఆయన పాత్రనే సునీల్ శెట్టి పోషించారు".
మరింత షాకవుతారు
"ఈ కథ ఫస్ట్ డ్రాప్ట్ నేనే రాశా. దాంట్లో కాస్త స్వేచ్ఛ తీసుకున్నా. నిజంగా జరిగిన కథ వింటే మాత్రం.. అందరూ ఇంకా షాకవుతారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కోసం డైమండ్ రత్నబాబు సహాయం తీసుకున్నా. ఈ స్క్రిప్ట్‌లో 90శాతం యదార్థంగా జరిగిన కథే ఉంటుంది. ఓ 10శాతమే సినిమాకు తగ్గట్లుగా రాసుకున్నాం. క్లైమాక్స్‌లో చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది".
- "తెలుగు వెర్షన్ కోసం కొన్ని ప్రత్యేక సన్నివేశాలు చిత్రీకరించి జత చేశాం. ఈ సినిమా ఇండియన్ వెర్షన్ 2.10గంటల నిడివి ఉంటే.. ఇంటర్నేషనల్ వెర్షన్ 1:15 గంటలు ఉంటుంది".
- "నాకు పెద్ద సపోర్ట్ మా నాన్నే. ఈ సినిమా విషయంలో నా కన్నా.. మా ఇంట్లో వాళ్లకే ఎక్కువ టెన్షన్ ఉంది. ఒకొక్కసారి వాళ్లను అనవసరంగా ఒత్తిడిలోకి నెట్టేశానేమోనని నాపై నాకు కోపం వస్తుంటుంది. కథ నచ్చినప్పుడు రిస్క్ తీసుకోక తప్పదు".
- "ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఢీ అండ్ ఢీ' సినిమా చేయనున్నా. మరో మూడు ప్రాజెక్ట్‌లు చేయనున్నా. వచ్చే నెలలో వాటి గురించి ప్రకటిస్తాం".
అందుకే ఈ సాహసం..
"దాదాపు రూ.50కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. నాకున్నదంతా ఊడ్చి మరీ.. నా మార్కెట్ కన్నా రెట్టింపు ఖర్చు పెట్టి ఈ సినిమా తీశా. అందుకే కాస్త ఒత్తిడిగా ఉంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే విశ్వజనీనమైన కథ ఇది. అందుకే దీన్ని పాన్ ఇండియా మూవీలా ముస్తాబు చేశాం. నిర్మాతనైనా.. సెట్లో నటుడిగానే ఉంటా."
ఇదీ చూడండి:అర్థం, పరమార్థం ఉన్న సినిమా ఇది: మోహన్‌బాబు