మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో 2021-23 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న మంచు విష్ణు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మి నివాసం నుంచి తన ప్యానల్ సభ్యులు, అభిమానులతో కలిసి మా కార్యాలయానికి ర్యాలీ తీశారు. సోదరి మంచు లక్ష్మి తన నివాసం వద్ద విష్ణుకు తిలకం దిద్ది హారతిపట్టారు. ఎన్నికల్లో గెలవాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం ర్యాలీగా ఫిల్మ్ చాంబర్ కార్యాలయానికి చేరుకున్న విష్ణు.. చాంబర్ ఆవరణలో ఉన్న దాసరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
రఘుబాబు, సంపూర్ణేశ్ బాబు, అర్చన మినహా మిగతా సభ్యులతో కలిసి 'మా' కార్యాలయానికి చేరుకున్న విష్ణు.. ఈసీ సభ్యులుగా పోటీ చేస్తున్న వారితో ఒక్కొక్కరిగా నామినేషన్లు వేయించారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వారి నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. ముందుగా నిర్ణయించుకున్న ముహుర్తం ప్రకారం మధ్యాహ్నాం 1 గంట 19 నిమిషాలకు మంచు విష్ణు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు.
నామినేషన్ల దాఖలు పూర్తైన అనంతరం గెలుపుపై తన ధీమా వ్యక్తం చేసిన మంచు విష్ణు.. మా ఎన్నికలు తెలుగు నటీనటుల ఆత్మగౌరవానికి సంబంధించినవిగా పేర్కొన్నారు. 900 మంది సభ్యుల మద్దతు తనకే ఉందన్న విష్ణు.. తన మ్యానిఫెస్టో చూసి చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
చలన చిత్ర పరిశ్రమపై ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. పవన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా పవన్ మాటలను తప్పుపట్టిందన్న విష్ణు.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చలు కొనసాగుతున్నాయన్నారు. పవన్ వ్యాఖ్యలపై అక్టోబర్ 10 తర్వాత మోహన్ బాబే సమాధానం చెబుతారని వివరించారు. అయితే నటీనటలకు జీవనాధారమైన సినీ పరిశ్రమపై 'మా' అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ తన నిర్ణయమేంటో చెప్పాలని ప్రశ్నించారు. తాను సినీ పరిశ్రమవైపు ఉన్నానని, ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ వైపా, సినీ పరిశ్రమవైపా తేల్చుకోవాలన్నారు.