తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Mohan babu: చిత్ర పరిశ్రమకు మోహన్‌బాబు బహిరంగ లేఖ

Mohan babu: చిత్ర పరిశ్రమ అంటే నలుగురు హీరోలు.. నలుగురు ప్రొడ్యూసర్లు మాత్రమే కాదని అన్నారు సీనియర్ నటుడు మోహన్ బాబు. పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని.. సమస్య పరిష్కారం కోసం అందరూ కలసిరావాలని చెప్పారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు.

మోహన్‌బాబు
Mohan babu letter

By

Published : Jan 2, 2022, 10:10 PM IST

Mohan babu: ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై సీనియర్‌ నటుడు మోహన్‌బాబు స్పందించారు. చిత్ర పరిశ్రమలోనూ వారందరూ ఒక్కటిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలని పిలుపునిచ్చారు. సినిమా పరిశ్రమ అంటే నలుగురు హీరోలు.. నలుగురు ప్రొడ్యూసర్లు కాదని హితవు పలికారు. ఈ మేరకు సుదీర్ఘ లేఖను తన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

  • "మనకెందుకు మనకెందుకు అని మౌనంగా ఉండాలా.. నా మౌనం చేతకానితనం కాదు.. చేవలేనితనం కాదు.. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. 'నీ మాటలు నిక్కచ్చిగా ఉంటాయి.. కఠినంగా ఉంటాయి.. కానీ, నిజాలే ఉంటాయి. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా' అన్నారు. అంటే వాళ్ళు చెప్పినట్టు బతకాలా? నాకు నచ్చినట్టు బతకాలా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమే ఇది"
  • "సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్టిబ్యూటర్స్ కాదు.. కొన్ని వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు... కొన్ని వేల జీవితాలు. 47 సంవత్సరాల అనుభవంతో చెబుతున్న మాట. అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనకు ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమవ్వాలి. సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి.. ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ ఉంటుందనేది చర్చించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా కలవాలి. అలా కాకుండా నలుగుర్నే రమ్మన్నారు. ప్రొడ్యూసర్స్ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఓ ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు, ఏంటిది? మళ్లీమళ్లీ చెబుతున్నా, సినిమా పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరూ సమానం.. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరకి వెళ్ళి సమస్యల్ని వివరిస్తే మనకీ రోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవి కావు"
  • "సినీ పరిశ్రమలో ఒక పార్టీ వాళ్ళు ఉండొచ్చు, లేదా వేరు వేరు పార్టీల వాళ్ళు ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం, కాదనను. కానీ, ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రుల్ని ముందుగా మనం కలవాలి. వాళ్ళని మనం గౌరవించుకోవాలి. మన కష్టసుఖాలు చెప్పుకోవాలి! అలా జరిగిందా? జరగలేదు. నేను 'మా' అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖలందర్ని కలుపుకొని ఒక్కటిగా వెళ్ళి అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డిగారిని కలిసి 'పైరసీ కోరల్లో సినిమా నలిగిపోతుంది, మా మీద దయచూపి భిక్ష పెట్టండి' అనగానే, ఆ మాట చాలా మందికి నచ్చలేదు. కానీ ఆయన్ని కదిలించింది. చాలావరకు పైరసీని కట్టడి చేసింది.. సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు చాలావరకు చేసిపెట్టింది అప్పటి ప్రభుత్వం"
  • "రూ.300, రూ.350 టికెట్ల రేట్లతో చిన్న సినిమాలు నిలబడ్డం కష్టం. రూ.50, రూ.30లతో టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలకు నష్టం. చిన్న సినిమాలు ఆడాలి.. పెద్ద సినిమాలు ఆడాలి.. దానికి సరైన ధరలుండాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి 'అయ్యా.. మా సినీ రంగం పరిస్థితి ఇది..' చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్ ఉన్నాయి.. మా అందరికీ దేవుళ్ళు నిర్మాతలు. కానీ, ఈ రోజున ఆ నిర్మాతలు ఏమయ్యారు? అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్ధం కావట్లేదు. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది.. రండి అందరం కలిసి సినిమాని బతికిద్దాం" అని సినిమా పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని పిలుపునిస్తూ లేఖ విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details