భక్తవత్సలం నాయుడు.. అనగానే కొద్దిమందికే తెలుస్తుంది. అదే మోహన్‌బాబు అనగానే ప్రేక్షకులందరి కళ్లలో ఆయన బొమ్మ కనిపిస్తుంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు రీళ్లు రీళ్లుగా కదలాడి వారి పెదాలపై నవ్వుల పువ్వులు పూస్తాయి. ఎక్కడో... రాయలసీమ చిత్తూరు ప్రాంతంలోని మారుమూల పల్లెలో పుట్టి పెరిగినా... తెరపై తనని తాను ఆవిష్కరించుకోవాలనే సంకల్పమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ఆ దారిలో ఎదురైన ఎన్నో అవరోధాలను అధిగమించి, మరెన్నో మైలురాళ్లను దాటి విజేతగా నిలిచాడు. అందుకే ఆయన యువ సినీతారలకు స్ఫూర్తిగా చెప్తుంటారు.
సీమ బిడ్డ
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో 1952 మర్చి 19న భక్తవత్సలం నాయుడు జన్మించారు. తండ్రి మంచు నారాయణస్వామి, తల్లి లక్షమ్మ. తండ్రి ఉపాధ్యాయుడు. మోహనబాబుకి రంగనాధ్ చౌదరి, రామచంద్ర చౌదరి, కృష్ణ అనే ముగ్గురు తమ్ముళ్లున్నారు. సోదరి విజయ కూడా ఉంది. ఏర్పేడు, తిరుపతిలో విద్యాభ్యాసం చేసిన భక్తవత్సలం నాయుడు చెన్నై వైఎంసీఏ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత కొంతకాలం తన తండ్రిలాగానే ఉపాధ్యాయ వృత్తి భాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రంగుల ప్రపంచం మీద మక్కువ ఎక్కువ కావడం వల్ల ఆయన మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరి కొంతకాలం శిక్షణ పొందాడు. తరువాత సినీ అవకాశాల వేటలో పడ్డాడు. సినిమాల్లో పనిచేయాలనే అభిరుచి ఉన్నప్పటికీ ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ స్వాగతం పలకలేదు. ఆయన ఓర్పును పరీక్షించింది. స్టూడియోల చుట్టూ తిరుగుతూ అవకాశాల కోసం అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఆ ప్రయత్నాలు ఫలించి 1969లో దర్శకుడు లక్ష్మీ దీపక్ దగ్గర నుంచి అప్రెంటీస్‌గా పనిచేసే అవకాశాన్ని అందుకున్నాడు. అదీ ఆయనకు దక్కిన మొదటి అవకాశం. ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా వెనువెంటనే లక్ష్మీ దీపక్ దగ్గర అప్రెంటీస్‌గా చేరిపోయాడు. అలా కొంత కాలం తెర వెనుక దర్శకత్వశాఖలో పనిచేశాడు. 1974లో 'కన్నవారి కలలు', 'అల్లూరి సీతారామరాజు' చిత్రాల్లో కాసేపు కనిపించే అవకాశం ఆయన్ని వరించి వచ్చింది. ఆ సమయంలోనే టాలీవుడ్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేస్తున్న దాసరి నారాయణరావుతో పరిచయం ఏర్పడింది.
'స్వర్గం-నరకం'తో గుర్తింపు
దాసరి నారాయణరావు దర్శకుడిగా మారిన సందర్భంలో భక్తవత్సలం నాయుడికి కూడా ఆ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం వచ్చింది. అదే'స్వర్గం-నరకం' చిత్రం. సంసారం స్వర్గ సీమ కావాలన్నా, నరక కూపం అవ్వాలన్నా భార్యాభర్తల చేతుల్లోనే ఉందనే సందేశాత్మక చిత్రం అది. అప్పట్లో ఆ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దర్శకుడిగా దాసరి అభిరుచికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అదే సమయంలో ఆ చిత్రంలోని నటీనటులకు తగిన గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించిన భక్తవత్సలం నాయుడు మోహన్‌బాబు అనే తెర నామంతో తర్వాతర్వాత ప్రసిద్ధి పొందాడు. ఆ తరువాత కామెడీ విలన్‌గా కొన్ని చిత్రాల్లో మోహన్‌బాబు నటించాడు. అలనాటి మేటి నటుల సమక్షంలో విలన్‌గా నటించాడు. ఏఎన్నార్, ఎన్టీఆర్ చిత్రాల్లో కూడా చెప్పుకోదగ్గ పాత్రలు వేశాడు. 'ఖైదీ కాళిదాసు' చిత్రంలో కీలక భూమిక పోషించాడు. నెమ్మదిగా ప్రతినాయకుడి పాత్రల నుంచి కథానాయక పాత్రలకు మోహన్‌బాబు షిఫ్ట్ అయ్యాడు. 1980 దశకం మోహన్ బాబు ఎదుగుదలకు ఎంతో ఉపకరించింది. 1980లో 'త్రిలోక సుందరి', 'సీతారాములు', 1981లో 'టాక్సీ డ్రైవర్', 1982లో 'సవాల్', 1983లో 'ప్రళయ గర్జన', 1984లో 'సీతమ్మ పెళ్లి', 1985లో 'తిరుగుబోతు', 1987లో 'విశ్వనాథ నాయకుడు', 1988లో 'ఆత్మకథ' 1989లో 'బ్లాక్ టైగర్', 1990లో 'ప్రాణానికి ప్రాణం'లాంటి సినిమాలో గుర్తింపు పొందే పాత్రలు వేశాడు. 1992లో 'డిటెక్టీవ్ నారద', 1997లో 'వీడెవడండీ బాబు' లాంటి కామెడీ హీరో పాత్రల్లో నటించి మెప్పించాడు. అలాగే, 2002లో 'తప్పు చేసి పప్పు కూడు', 2013లో 'పాండవులు పాండవులు తుమ్మెద' లాంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్ని పోషించాడు.
సూపర్ హీరో స్టేటస్
1978లో దాసరి నారాయణరావు చిత్రం 'శివ రంజని' మోహన్‌బాబుకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. ఆ తరువాత ఎన్నో చిత్రాలు చేస్తూ వస్తున్నా... 1990 నుంచి మోహన్ బాబుకి సూపర్ స్టార్ స్టేటస్ వచ్చిందని విశ్లేషకులు చెబుతుంటారు. 1991లో 'అసెంబ్లీ రౌడీ' మోహన్‌బాబు కెరీర్లో బిగ్ హిట్. అంతకు ముందు 1990లో వచ్చిన 'అల్లుడుగారు' చిత్రం కూడా మెచ్చు తునక. 1991లో 'రౌడీగారి పెళ్ళాం', 1992లో 'అల్లరి మొగుడు', 1995లో 'పెద్ద రాయుడు' చిత్రాలు బాక్సాపీస్ దగ్గర సూపర్ సక్సెస్ కావడంతో...కలెక్షన్ కింగ్ అనే విశేషణంతో మోహన్‌బాబు విఖ్యాతి పొందారు. అదే సమయంలో క్లిష్టమైన డైలాగ్‌ని విలక్షణంగా పలకడంతో డైలాగ్ కింగ్ అనే మరో విశేషణం కూడా ఆయన పేరుకు ముందు చేరింది. ఇప్పటికీ ఆ రెండు విశేషణాలతోనే మోహన్‌బాబుని అయన అభిమానులు అభివర్ణిస్తుంటారు. హై ఎనర్జీ యాక్టింగ్‌తో తనకు తానేసాటి అని నిరూపించుకున్న మోహన్‌బాబు చిత్రాల్లో చాలా చిత్రాలు కలెక్షన్ వర్షాన్ని కురిపించాయి. 'కొదమ సింహం', 'బ్రహ్మ', 'చిట్టెమ్మ మొగుడు', 'ఎం ధర్మరాజు ఎం.ఏ', 'అడవిలో అన్న', 'లంకేశ్వరుడు', 'కలెక్టర్ గారు', 'మేజర్ చంద్రకాంత్', 'సోగ్గాడి పెళ్ళాం', 'అన్నమయ్య', 'రాయుడు', 'శ్రీ రాములయ్య', 'పోస్ట్ మాస్టర్ '...ఇలా ఎన్నో విలక్షణమైన పాత్రలతో మోహన్‌బాబు ప్రేక్షకులను అలరించాడు.