సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటారు సినీ హీరో మంచు మనోజ్. గతంలో సోషల్ మీడియా వేదికగా చాలామందికి సాయం చేసిన ఆయన మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడికి భరోసాగా నిలిచారు. దీనికి ట్విట్టర్ వేదికైంది. అభిమానులు చేసిన ఓ పోస్టుపై మనోజ్ స్పందించి.. వాళ్లను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
"మా బాబుకి బోన్ కేన్సర్ ఉందని వైద్యులు చెప్పారు. వెంటనే వైద్యం చేయాలని అంటున్నారు. నేను ఆటో ఒక డ్రైవర్‌ని. గత మూడు నెలలుగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఎలాంటి సహకారం లేదు. మీరు మాత్రమే మా కుమారుడిని కాపాడగలరు. దయచేసి మా కొడుకుని కాపాడండి" అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్న ఓ వీడియో పోస్టు చేశారు. దాన్ని అభిమానులు ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. "అందరం కలిసి ఈ కుటుంబాన్ని ఆదుకుందాం" అని సోనూసూద్‌ను ట్యాగ్ చేశారు. అయితే.. ఈ పోస్టును చూసిన మనోజ్ క్షణాల్లోనే స్పందించారు. "మీ వివరాలు మొత్తం నాకు పంపించండి. ఆసుపత్రి, వైద్యుడి పేరు అన్నీ నాకు పంపండి. ధైర్యంగా ఉండండి. బాలుడు కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను" అని మనోజ్ రీట్వీట్ చేశారు.