'బిల్లా రంగా' పాత్రల్లో మంచు మనోజ్, సాయి తేజ్ కనిపిస్తే? సినీ ప్రియులకు పండగే. ఒకే స్క్రీన్‌పై ఈ ఇద్దరు స్టార్లను చూడటం అద్భుతమే. ఈ కాంబినేషన్‌కు మనోజ్ సిద్ధంగానే ఉన్నారు. సాయి తేజ్ సమాధానం తెలియాల్సి ఉంది.
నేడు సాయి తేజ్ పుట్టిన రోజు. అంతేకాదు 38 ఏళ్ల క్రితం ఇదేరోజున (అక్టోబర్ 15) తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన 'బిల్లా రంగా' చిత్రం విడుదలైంది. మోహన్ బాబు, చిరంజీవి కథానాయకులుగా కె.ఎస్.ఆర్ దాస్ తెరకెక్కించారు. యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
విష్ చేస్తూ.. ఆహ్వానిస్తూ!
తేజ్‌కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆ సినిమా గురించి పంచుకున్నాడు మనోజ్. "పుట్టిన రోజు శుభాకాంక్షలు తేజ్ బాబాయ్. మల్టీస్టారర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'బిల్లా రంగా' నేటితో 38ఏళ్లు పూర్తి చేసుకుంది. మన ఇద్దరికి ఇదేదో చెప్తుందని భావిస్తున్నా. నేను సిద్ధం. నువ్వు సిద్ధమేనా?" అని సూటిగా అడిగారు మనోజ్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఆనందంలో అభిమానులు
"ఈ కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు మేమూ రెడీ, వేచి చూస్తున్నాం, త్వరగా సెట్ చేయండి" అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు, నెటిజన్లు. 'బిల్లా రంగా'నే రీమేక్ చేస్తారా? సరికొత్త కథలో కలిసి నటిస్తారా? అంటే కొంతకాలం ఆగాల్సిందే. ప్రస్తుతం మనోజ్ 'అహం బ్రహ్మాస్మి' చిత్రంలో నటిస్తున్నారు. సాయి తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇదీ చదవండి:వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సీసీబీ సోదాలు