తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తొలి చిత్రంతోనే 'నంది' గెలుచుకున్న నటి ఈమె - మంచు లక్ష్మీ ప్రసన్న న్యూస్

నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మీప్రసన్న.. తొలిచిత్రంతోనే తన నటనకు నంది పురస్కారం దక్కించుకుంది. నేడు (అక్టోబరు 8) ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలను మీకోసం.

manchu lakshmi birthday special story
తొలి చిత్రంతోనే 'నంది' గెలుచుకున్న పెదరాయుడి కుమార్తె

By

Published : Oct 8, 2020, 5:36 AM IST

'ఆడది కాబట్టి హీరోయిన్‌ అయ్యింది. అదే మగాడు అయ్యుంటే మోహన్‌బాబు అయ్యేది'... 'దొంగాట' సినిమాలో మంచు లక్ష్మీప్రసన్నను ఉద్దేశించిన ఓ డైలాగ్‌. ఈమెకు తగిన డైలాగ్‌ ఇది. తండ్రి మోహన్‌బాబు ప్రతినాయకుడిగా వందలాది చిత్రాల్లో నటించి విశేషంగా పేరు తెచ్చుకొన్నారు. లక్ష్మీ ప్రసన్న ప్రతినాయికగా తొలి చిత్రంతోనే నంది పురస్కారాన్ని సొంతం చేసుకుని, తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది.

వ్యక్తిగతం

1977 అక్టోబరు 8న చెన్నైలో జన్మించిన మంచు లక్ష్మీ ప్రసన్నకు.. కథానాయకులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ సోదరులు. ఆండీ శ్రీనివాసన్‌ను ఈమె పెళ్లి చేసుకుంది. కుమార్తె విద్యా నిర్వాణ.

మంచు లక్ష్మి

సినీప్రయాణం

నటిగా, నిర్మాతగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా రాణిస్తూ ఇంటింటికీ చేరువైంది లక్ష్మీప్రసన్న. ఒక్లహామా సిటీ విశ్వవిద్యాలయం నుంచి థియేటర్‌ ఆర్ట్స్​లో బ్యాచిలర్‌ డిగ్రీ చేసింది. అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ 'లాస్‌ వెగాస్‌'తో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ఆంగ్లంలో పలు టెలివిజన్‌ షోలు, ధారావాహికలతో ప్రేక్షకుల్ని అలరించింది.

హాలీవుడ్​ చిత్రాల్లో

హాలీవుడ్‌ చిత్రాలు 'ది ఓడ్‌', 'డెడ్‌ ఎయిర్‌', 'థ్యాంక్యూ ఫర్‌ వాషింగ్‌'ల్లో నటించిన లక్ష్మీప్రసన్న.. 'అనగనగా ఓ ధీరుడు'తో ప్రతినాయికగా టాలీవుడ్​కు పరిచయమైంది. అందులో చేసిన ఐరేంద్రి పాత్రకుగానూ ఉత్తమ ప్రతినాయికగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'దొంగలముఠా', 'డిపార్ట్‌మెంట్‌', 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' సినిమాలతో మెప్పించింది. మణిరత్నం 'కడలి‌'లోనూ కీలకపాత్ర పోషించింది.

మంచు లక్ష్మి

నిర్మాతగా

'గుండెల్లో గోదారి' చిత్రాన్ని స్వయంగా నిర్మించడం సహా, అందులో నటనకుగానూ లక్ష్మీప్రసన్న ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. 'చందమామ కథలు', 'దొంగాట', 'వైఫ్‌ ఆఫ్‌ రామ్‌' సినిమాల్లో ఈమె నటన ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. తమిళంలో 'కాట్రిన్‌ మొళి'లో నటించింది. 'నేను మీకు తెలుసా?', 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా', 'ఝుమ్మంది నాదం', 'గుండెల్లో గోదారి', 'దొంగాట' చిత్రాల్ని నిర్మించి తన అభిరుచిని చాటుకుంది.

బుల్లితెరపై సందడి

తెలుగులో 'లక్ష్మీ టాక్‌ షో', 'ప్రేమతో మీ లక్ష్మి', 'లక్కుంటే లక్ష్మి', 'సూపర్‌ జోడీ', 'దూసుకెళ్తా', 'మీ కోసం', 'మేము సైతం' తదితర టెలివిజన్‌ షోలతో ఇంటింటికీ చేరువైంది.

ABOUT THE AUTHOR

...view details