మెగాస్టార్ చిరంజీవి డ్యాన్సు గురించి ఎవరైనా మీ అభిప్రాయం అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఆయన డ్యాన్సుకేంటి.. అదుర్స్.. సూపర్ అంటారు కదా! స్వయంగా చిరంజీవే తన డ్యాన్సు గురించి అడిగితే? మీరే కాదు ఎవరైనా చాలా బాగా చేశారని కితాబిస్తారు. కానీ, ఒక వ్యక్తి మాత్రం అలా అనలేదు. ఆయన అలా అనకపోవడం వల్లే చిరు.. డ్యాన్సులో కొత్త ఒరవడి సృష్టించారు. ఎంతోమందికి ఆరాధ్యుడిగా మారారు. మరి చిరంజీవి డ్యాన్సుని విమర్శించిందెవరు? ఎందుకలా అన్నారు? తెలుసుకుందామా..
అవి చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభించిన రోజులు. ఆయన కథానాయకుడిగా నటించిన 5వ సినిమానో 6వ సినిమానో చిత్రీకరణ జరుగుతుంది. ఓ పాటకి తనదైన స్టైల్లో స్టెప్పులేశారు చిరు. ఆ డ్యాన్సుని చూసి, అక్కడున్న వారంతా క్లాప్స్ కొట్టారు. అదే సమయంలో ఆ చిత్రానికి మేనేజరుగా పనిచేసిన వెంకన్న బాబు చిరంజీవిని తదేకంగా చూస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్లి "ఎలా ఉంది?" అని చిరంజీవి అడగ్గా.. "ఆ.. ఏముంది? నీ వెనక ఉన్న డ్యాన్సర్లు ఏం చేశారో, నువ్వూ అదే చేశావు. నీ ప్రత్యేకత లేకపోతే ఎందుకట?" అని సమాధానం ఇచ్చారాయన.