మలయాళ సినిమాకు కొత్త నడకను నేర్పినవాడు..
మలబారు చిత్రాల రేంజ్ పెంచిన నాయకుడు..
మూసధోరణులను బద్ధలు కొట్టిన మేరునగధీరుడు..
విలక్షణ పాత్రలతో సూపర్‌స్టార్‌గా నిలిచిన నటుడు..
కేరళ తీరం నుంచి దక్షిణాది దళపతిగా ఎదిగినవాడు..
పట్టుదలే పెట్టుబడి, ఆత్మవిశ్వాసమే కట్టుబడిగా నిలిచినవాడు..
ఆయనే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.
అది 1989. ఆ ఏడాదికి జాతీయ ఉత్తమ నటుడి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. జైలుశిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి సంబంధించిన ప్రేమకథ. ఆకాశం అంత ఎత్తున్న జైలు గోడకు అవతల వైపు.. జైలు శిక్ష అనుభవిస్తున్న అమ్మాయిని ప్రేమించే పాత్ర. హీరో పాత్రధారి అద్భుతంగా నటించాడు. కచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిన స్థాయి నటన. అతనిదే మరో సినిమా పోటీలో ఉంది. మలయాళీల ఘనమైన చరిత్రను, సాహితీ సంపదను చాటి చెప్పే సినిమా. అదీ అదరగొట్టేశాడు చేసేది లేక జ్యూరీ ఆ రెండు సినిమాలు కలిపి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించింది.
సీన్ కట్ చేస్తే.. మరో మూడేళ్ల తర్వాత మళ్లీ పోటీలో ఆయనే. ఈసారీ రెండు సినిమాలు.. ఒక దాంట్లో అంటరానివాడి పాత్ర, మరో సినిమాలో కరుడు కట్టిన విలన్ పాత్ర. రెండింటికీ అసలు పొంతనే లేదు. ఈ సారీ రెండు సినిమాలకు కలిపి నేషనల్ అవార్డు ఇవ్వక తప్పింది కాదు. అలా భారతీయ సినీ చరిత్రలో రెండేసి సినిమాలకు రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న నటుడు మరొకరు లేరనే చెప్పాలి. అంతలా జ్యూరీనే ఆశ్చర్యపోయేలా చేసిన గొప్ప నటుడే మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి.
పాత్ర ఏదైనా సరే.. తనలోని నటుడికి సవాల్ విసరాలనుకుంటాడు. నటనపై అంతటి కసి ఉంది కనుకే.. ఐదు దశాబ్దాలకుపైగా మలబారు చిత్ర పరిశ్రమను మకుటం లేని మహారాజులా ఏలుతున్నాడు. అద్భుతమైన తన నటనా చాతుర్యంతో.. భారతీయ సినీ పరిశ్రమ అందించిన గొప్పనటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు మమ్ముట్టి.
వ్యక్తిగతం
మచ్చలేని తన నటనతో మమ్ముక్కా అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పనపరంబిల్. 1951 సెప్టెంబర్ 7న కేరళలోని చండీరూర్‌లో ఓ మధ్యతరగతి మహమ్మదీయ కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు ఇస్మాయిల్, తల్లి పేరు ఫాతిమా. మొత్తం ఆరుగురు సంతానంలో మమ్ముట్టి పెద్దవాడు.. ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు. మమ్ముట్టి బాల్యమంతా కొట్టాయం జిల్లాలోని వైకోమ్ సమీపంలో గల చెంపు అనే గ్రామంలో గడిచింది. మమ్ముట్టి తండ్రి వ్యవసాయం చేసేవారు. ధాన్యం క్రయవిక్రయాలతో పాటు ఉన్న కొద్దిపాటి వ్యవసాయభూమిలో పొలం పనులు చేసేవారు. అదే ఈరోజుకూ మమ్ముట్టికి వ్యవసాయంపై ప్రేమను కలిగిలా చేసింది.
కొట్టాయంలోని కులశేఖరమంగళం ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు మమ్ముట్టి. అనంతరం వారి కుటుంబం ఎర్నాకుళంకు మారిపోయింది. ఎర్నాకుళం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతవిద్య, మహారాజా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం న్యాయవిద్య వైపు ఆకర్షితులైన మమ్ముట్టి.. ఎర్నాకుళం ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్ఎల్ బీ విద్యను అభ్యసించారు. మంజేరీ అనే చిన్నపట్టణంలో రెండేళ్ల పాటు న్యాయవాదిగానూ ప్రాక్టీస్ చేశారు.
హీరోయిజంపై ఇష్టం
కాలేజీలో ఫ్యాషన్‌గా తిరిగే రోజుల్లోనే ముమ్మట్టికి హీరోయిజంపై ఇష్టం ఏర్పడింది. స్నేహితులతో సినిమాలు తెగ చూసేవారు. అన్ని భాషా చిత్రాలూ చూసినా మలయాళం సిన్మాలంటే ఎందుకో క్రేజ్ ఏర్పడింది ఆయనలో. తన లక్ ఎలా ఉందో చెక్ చేద్దామని కాలేజీలో ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. కసి, కృషి ఈ రెండు కలిసి వచ్చి దర్శకుడు కేఎస్ సేతుమాధవన్ 1971లో తీసిన 'అనుభవంగల్ పాలిచకల్' అనే సినిమాతో తొలిసారి వెండితెరపై దర్శనమిచ్చారు మమ్ముట్టి. అలా క్షణకాలం పాటు తనను తెరపై చూసుకుని మురిసిపోయారో ఇప్పటికీ అంతటి అనుభూతిని పంచిన చిత్రం మరొకటి రాలేదంటారట మమ్ముట్టి.
తన తొలి చిత్రంలో నటించిన తర్వాత.. రెండేళ్ల వరకూ మమ్ముట్టికి ఎలాంటి అవకాశాలు రాలేదు. 1973లో దర్శకుడు కే నారాయణన్ దర్శకత్వంలో వచ్చిన 'కాలచక్రం' అనే సినిమాలోనూ చిన్న జూనియర్ ఆర్టిస్ట్ వేషం దొరికింది. అవకాశాల కోసం తిరిగే కొద్దీ నటన అంటే గౌరవమూ, నటించాలనే పట్టుదల పెరిగింది మమ్ముట్టికి. చేసే ప్రయత్నాల్లో వందశాతం నిజాయితీ ఉండాలనే ఉద్దేశంతో.. 1975లో సబర్మతి నాటక సంఘంలో సభ్యుడిగా చేరారు.
వాళ్లతో కలిసి చాలా నాటకాల్లో పాల్గొన్నాడు. పాత్ర అంటే ఎలా ఉండాలి. పాత్రధారి హావభావాలు ఎలా ప్రదర్శించాలి.. నటన అంటే ఏంటో తెలుసుకున్నారు. తను చేసే పాత్రల్లో ప్రాణం పెట్టేవారు. ఆ ప్రతిభను ప్రఖ్యాత దర్శకులు, రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ కనిపెట్టారు. మమ్ముట్టినే ప్రధాన పాత్రధారిగా పెట్టి.. 1979లో 'దేవలోకం' అనే సినిమాను ప్రారంభించారు. కానీ అనుకోని కారణాలతో అది షూటింగ్ దశలోనే ఆగిపోయింది. నటుడిగా తన కోరిక నెరవేరనుందన్న ఆనందం అంతలోనే ఆవిరైపోయింది మమ్ముట్టికి.
నటనతో 'తిష్ట' వేశారు..
తను ఇవ్వలేకపోయిన అవకాశాన్ని మమ్ముట్టికి ఎలా అయినా దక్కేలా చేయాలని ఎంటీ వాసుదేవన్ నాయర్ భీష్మించుకున్నారు. ఆజాద్ దర్శకత్వంలో.. తను రచయితగా చేస్తున్న 'విక్కనుండు స్వప్నగళ్' చిత్రం కోసం మమ్ముట్టిని తీసుకునేలా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తొలిసారిగా ఓ ప్రాధాన్యం ఉన్న పాత్రలో తళుక్కున మెరిశారు మమ్ముట్టి. కానీ మమ్ముట్టిని పూర్తి స్థాయి నటుడిని చేసింది మాత్రం దర్శకుడు కేజీ జార్జ్. 1980లో తను తీసిన 'మేళా'తో మమ్ముట్టికి ఓ గుర్తింపు ఇచ్చారు.
ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1980వ దశకం తొలి భాగంలో వచ్చిన చాలా సినిమాల్లో మమ్ముట్టి.. సాజిన్ అనే పేరుతో నటించేవారు. పీజీ విశ్వంభరన్ తీసిన స్పోదనం, శ్రీకుమారన్ థంపీ దర్శకత్వం వహించిన మునెట్టం, ఐవీ శశి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా 'త్రిష్ణ'లోనూ మమ్ముట్టి సాజిన్ గానే చిత్రసీమకు పరిచయం. మమ్ముట్టి అనే పేరు నటుడికి బాగోదు అనేవారంట దర్శకులు విశ్వంభరన్. సాజిన్ అని పేరు వాడినా..బ్రాకెట్లో మమ్ముట్టి అనే పేరు కూడా వేయటం వల్ల త్వరగానే ఆ పేరు మలయాళీలకు అలవాటైపోయింది. ఐవీ శశి దర్శకత్వంలో వచ్చిన 'త్రిష్ణ' సినిమానే హీరోగా మమ్ముట్టికి మొదటిది.
మమ్మట్టి సినీ ప్రయాణం మెల్లగా ప్రారంభమై ఉండచ్చు.. కానీ భవిష్యత్తులో ఓ గొప్పనటుడిని మలయాళ చిత్ర సీమ చూడనుందని బహుశా అప్పటికి ఎవరూ ఊహించి ఉండరు. నటన అంటే సందర్భానికి తగినట్లుగా హావభావాలు ఉండాలి. డైలాగ్ డెలివరీ ఆకట్టుకోవాలి లాంటి నియమాలు కచ్చితమైన రోజుల్లో.. మౌనంతో సన్నివేశాలను నడపొచ్చని నిరూపించారు మమ్ముట్టి. చేసే నటుడు ఆ పాత్రను ఎంతలా ఆవాహన చేసుకున్నాడనే విషయంపైనే నటన ఆధారపడి ఉంటుందని తన చిత్రాలతో నిరూపించారు మమ్ముట్టి.
తొలి 70ఎంఎం చిత్రం..
మలయాళీ వెండితెరపై మెల్లగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మమ్ముట్టికి.. గుర్తింపు మాత్రం చాలా త్వరగానే వచ్చింది. 1981లో వచ్చిన 'అహింస' చిత్రానికి గానూ మమ్ముట్టి ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు. 1982లో కేజీ జార్జ్ దర్శకత్వంలో వచ్చిన 'యవనిక'.. మమ్ముట్టిలోని స్టార్ డమ్‌ను తొలిసారిగా పరిచయం చేసింది. పోలీసాఫీసర్‌గా ఆ చిత్రంలోనే తొలిసారి నటించిన మమ్ముట్టి.. ఆ తర్వాత ఆ తరహా పాత్రలకు కేరళలో కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు.
'యవనిక' అటు విమర్శకుల ప్రశంసలు అందుకోవటం సహా కమర్షియల్ గానూ విజయవంతమైంది. 1982లోనే వచ్చిన 'పథయోట్టం', 'ఈనాడు' అప్పట్లో సౌతిండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. 'పథయోట్టం' పూర్తిగా భారత్ లోనే రూపుదిద్దుకున్న మొదటి 70ఎంఎం చిత్రం కాగా.. కోటి రూపాయలకు పైగా బడ్జెట్‌తో రూపొందిన తొలి మలయాళీ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
ఒకే ఏడాదిలో 35 చిత్రాలు
ఆ సినిమాలతో మమ్ముట్టికి అంతులేని ప్రజాదరణ సొంతమైంది. కెరీర్లో మళ్లీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా నిలదొక్కుకున్నాడు. 1982 నుంచి 87 వరకూ నటుడిగా మమ్ముట్టి కెరీర్లోనే స్వర్ణయుగం. అంతే కాదు ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబడడానికి ఆ ఐదేళ్ల కాలమే మమ్ముట్టికి దోహదపడింది. విరామం లేకుండా కష్టపడ్డాడు. ఎంతెలా అంటే.. ఆ ఐదేళ్లలో మమ్ముట్టి నటించి విడుదల చేసిన చిత్రాలు అక్షరాలా 150.
ఏడాదికి 30 సినిమాలు తక్కువ కాకుండా విడుదల చేశాడు. ఇప్పటికీ ఇండియాలో ఇదే రికార్డు. అసలు నేటి తరం నటుల ఊహకు సైతం అంతు చిక్కని కష్టమది. తెలుగులో అంతటి వేగం సూపర్‌స్టార్ కృష్ణలో కనిపించినా ఐదేళ్లపాటు ఆ ఒరవడి సాగలేదు. 1986లో ఆ ఒక్క ఏడాదిలోనే మమ్ముట్టి నటించిన 35 సినిమాలు విడుదలయ్యాయి. కేరళలోని ప్రతి ఇంటికీ పరిచయమయ్యారు మమ్ముట్టి.. అంతేకాదు అతడిని ఆప్యాయంగా, కుటుంబ సభ్యుడిగా 'మమ్ముక్కా' అని పిలుచుకోవటం ప్రారంభించారు మలయాళీలు.
సినిమాల్లో వేగమే చిక్కుల్ని తెచ్చిపెట్టింది!
హీరోగా గుర్తింపుతోపాటు మమ్ముట్టికీ ఈ ఐదేళ్ల కాలమే కొన్ని చిక్కులను తీసుకువచ్చి పెట్టింది. సినిమాల మీద సినిమాలకు ఒప్పుకొన్నాడు కానీ కథలు మూసధోరణిలోకి వెళ్లిపోయాయి. కాల్షీట్లు అసలు ఖాళీ లేకపోవటం.. రోజుకు ఇరవై గంటలు పనిచేయటం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు మమ్ముక్కా. ఆర్థికంగా స్థిరపడినా.. నటుడిగా ఆయన నటనపై కారుమేఘాలు కమ్ముకోసాగాయి.
మలయాళీలు ఆయన సినిమాలకు ఎంతెలా అలవాటుపడిపోయారంటే.. ప్రతి సినిమాలోనూ మమ్ముట్టి హీరోగా ఉంటారు. ఆయనకు ఓ భార్య.. మూడు నాలుగేళ్ల కుమార్తె, ఆయనో వ్యాపారమో, లేదా పెద్ద ఆఫీస్‌లోనో పని చేస్తుంటారు. ఇదే స్క్రిప్ట్. అందుకే అప్పట్లో మమ్ముట్టి సినిమాలను మమ్ముట్టి-కుట్టీ-పెట్టీ అని వెటకారమాడేవారు. ఈ మూసధోరణి నుంచి బయటపడాలి.. ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు.. తనలోని నటుడు సవాల్ విసురుకోమని మళ్లీ చెప్పాడంటారు మమ్ముట్టి.
ఈ స్టీరియోటైప్ సినిమాల నుంచి బయటపడటానికి తనలోని సీరియస్ నటుడికి పని చెప్పారు మమ్ముట్టి. 1987లో వచ్చిన న్యూదిల్లీ, తనియావర్తనం సినిమాలో మమ్ముట్టిలో తనలోని పెర్ఫార్మర్‌ను మళ్లీ ప్రేక్షకులకు చూపించాడు. రాజకీయ నాయకుల చేతిలో దగాపడిన ఓ జర్నలిస్ట్ గా మమ్ముట్టి నటన, జోషి దర్శకత్వ ప్రతిభ వెరసి.. మమ్ముట్టికి మెగాస్టార్ స్టేటస్‌ను కట్టబెట్టాయి. అప్పటివరకూ వరుస పరాజయాలతో ఉన్న మమ్ముట్టి జూలు విదిల్చిన సింహంలా.. బాక్సాఫీస్ మీద వసూళ్ల సునామీ గురించి ఇప్పటికీ మలయాళీలు చెప్పుకొంటారు.
ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు రెండున్నర కోట్ల రూపాయలు కాగా అప్పటివరకూ రికార్డులన్నింటినీ దాదాపుగా తుడిచి పెట్టేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీల్లోనూ ఈ చిత్రాన్ని వేర్వేరు హీరోలతో జోషినే రీమేక్ చేశారు. తెలుగులో కృష్ణంరాజు హీరోగా 'అంతిమతీర్పు' పేరుతో వచ్చిన ఈ చిత్రం ఇక్కడా హిట్ టాక్‌ను కైవసం చేసుకుంది. శిబి తీసిన 'తనియావర్తనం'లోనూ తనెంత సీరియస్ నటుడినో మమ్ముట్టి నిరూపించుకున్నారు.
మమ్మట్టి బెంచ్‌మార్క్
1988 నుంచి యాక్టర్‌గా మమ్ముట్టి కొత్త జర్నీ ప్రారంభమైందనే చెప్పుకోవాలి. న్యూదిల్లీ, తనియా వర్తనం సక్సెస్‌లతో స్క్రిప్ట్‌ను జాగ్రత్తగా ఎంచుకోవటం మొదలు పెట్టారు మమ్ముట్టి. 1988లో కె.మధు దర్శకత్వంలో వచ్చిన 'ఒరు సీబీఐ డైరీ కురిప్పు' క్రైం జోన్లో పాథ్ బ్రేకింగ్ మూవీగా నిలిచింది. ఆ సినిమానే మలయాళీలకు సీక్వెల్ సంస్కృతిని అలవాటు చేసింది. సీబీఐ డైరీ కురిప్పు సాధించిన విజయంతో మమ్ముట్టి.. అదే బృందంతో ఆ తర్వాత 1989లో 'జాగ్రత్త', 2004లో 'సేతురామ అయ్యర్ సీబీఐ', 2005లో 'నెరారియన్ సీబీఐ' లాంటి క్రైం థ్రిల్లర్లను అందించారు. వీటన్నింటికీ కె.మధునే దర్శకత్వం వహించారు. ఈ సినిమాల్లో 'సేతురామ అయ్యర్' అనే సీబీఐ అధికారిగా మమ్ముట్టి నటన.. ఆ తరహా సినిమాలకు ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది.
1989లోనే మమ్ముట్టి నటన.. జాతీయ స్థాయి గుర్తింపు అందుకుంది. అడూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన మథిలుకల్ చిత్రం.. మమ్ముట్టిలోని నటతృష్ణను మరోసారి ప్రేక్షకలోకానికి పరిచయం చేసింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి జైలులోని ఓ గోడకు అటు వైపు నుంచి మాటలు మాత్రమే వినిపించే ఓ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథే మథిలుకల్. సినిమా మొత్తం హీరోయిన్ వినిపిస్తుందే కానీ కనిపించదు. మరి అలాంటి ఓ సంక్లిష్టమైన పాత్రను.. రెండు పాత్రల సంఘర్షణను తనొక్కడే పండిస్తూ.. అదరగొట్టేశాడు మమ్ముట్టి. అడూర్ గోపాల కృష్ణన్ టేకింగ్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏం ఉంది. తన యాభై ఏళ్ల కెరీర్లో 12 సినిమాలు మాత్రమే తీసిన గోపాల కృష్ణన్.. 16 జాతీయ ఉత్తమ పురస్కారాలు అందుకోగా.. అందులో ఎక్కువ మమ్ముట్టితోనే చేయటం విశేషం.
ఒక నటుడు రెండు సినిమాలకు కలిపి ఒకే ఏడాదిలో జాతీయ అవార్డు తీసుకోవటం ఓ చర్చనీయాంశం. అలాంటిది మూడేళ్లలో మళ్లీ అదే సీన్ రిపీట్ చేశారు మన మమ్ముక్కా. 1994లో రెండు సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో జ్యూరీని నివ్వెరపోయేలా చేయటమే కాదు.. రెండు సార్లు రెండేసి చిత్రాలకు కలిపి జాతీయ అవార్డులు అందుకున్న నటుడిగా భారతీయ చలనచిత్రసీమలో చెక్కుచెదరని రికార్డు నెలకొల్పారు మమ్ముట్టి.
మెగాస్టార్ స్టేటస్‌తో విలన్ క్యారెక్టర్
1994లో అడూర్ గోపాల కృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన 'విధేయన్'లో.. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో మమ్ముట్టి నటించటం ఓ సెన్సేషన్. మెగాస్టార్ స్టేటస్ ఉన్న వ్యక్తి.. కరుడు కట్టిన విలన్‌గా నటించటంపై చిత్రీకరణ సమయంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేసినా.. సినిమా విడుదలయ్యాక తన నటనతో ఎవరినోటా మాట లేకుండా చేశారు మమ్ముట్టి. ఆడూర్ గోపాల కృష్ణన్ టేకింగ్‌లో.. తనలోని నటుడికి పూర్తిస్థాయి న్యాయం చేశారు మమ్ముక్కా.
అదే ఏడాదిలో టీవీ చంద్రన్ దర్శకత్వంలో వచ్చిన 'పొంతన్ మడా'లో.. అంటరాని వాడి పాత్రను పోషించారు. ఆ చిత్రంలో పొంతన్ మడా పాత్రలో మమ్ముట్టి.. ఆంగ్లో ఇండియన్ పాత్రలో నసీరుద్దీన్ షా.. వారిద్దరూ పోటాపోటీ నటించిన విధానం.. రెండు కళ్లు చాలలేదని ఇప్పటికీ చెప్పుకుంటారు మమ్ముక్కా అభిమానులు. ఆ సినిమా కథలో భాగంగా.. చిత్రీకరణ సమయం అంతా చెట్టు ఎక్కి తన కాళ్లను బ్యాలెన్స్ చేసుకుని నటించారట మమ్ముట్టి. నసీరుద్దీన్ షా ఇప్పటివరకూ నటించిన ఏకైక మలయాళ చిత్రమూ ఇదే. ఓ పాత్ర కోసం మమ్ముట్టి పడే తపనకు ముగ్ధులైన జ్యూరీ.. పొంతన్ మడా, విధేయన్ల సినిమాలకు కలిపి మరోసారి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందించింది.
1999లో ఆంగ్లం, హిందీలో విడుదలైన 'డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్' చిత్రంలో అంబేడ్కర్దా నటించిన మమ్ముట్టి తన నటనతో ముచ్చటగా మూడోసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కైవసం చేసుకున్నారు.
మోహన్‌లాల్‌తో కలిసి..
1990ల్లో తన స్నేహితుడు.. ఒకేసారి కెరీర్ ప్రారంభించిన మోహన్‌లాల్‌తో కలిసి ఎక్కువగా సినిమాల్లో కనిపించటం ప్రారంభించారు మమ్ముట్టి. అలా ఈ ఇద్దరు సూపర్స్టార్లు కలిసి మొత్తం 55 సినిమాల్లో నటించారు. మల్టీస్టారర్ సినిమాల్లోనే ఇదో పెద్ద రికార్డు. 'పెరంబూ', 'ఉండా' లాంటి కొన్ని రీసెంట్ చిత్రాలు ఆయనలోని అద్భుతమైన నటుడిని అన్ని భాషలకు చూపెట్టాయి.
జీవన ప్రకృతిని పన్నెండు అధ్యాయాలుగా విభజించి పన్నెండు రకాల ఉద్వేగాలను గుదిగుచ్చి ప్రేక్షకుడిని సంభ్రమాశ్చర్య చకితుడిని చేస్తాడు మమ్ముట్టి 'పెరంబు' సినిమాలో. 'పెరంబు' అంటే దయ. తమిళ నాట విశేష ప్రజాదరణ పొందిన ఈ సినిమాలో నటుడిగా మమ్ముట్టి శిఖరాగ్రాన్ని చేరుకున్నాడని చెప్పాలి.
మమ్ముట్టి కోసం 'దళపతి' క్లైమాక్స్ మార్పు
మలయాల సూపర్‌స్టార్ మమ్ముట్టి తమిళ సూపర్‌స్టార్ రజనీతో కలిసిన నటించిన 'దళపతి' చిత్రం 1991లో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మణిరత్నం తీసిన ఈ చిత్రం ఆసాంతం మహాభారత కథను తలపిస్తుంది. ఇందులోని ముఖ్యపాత్రలన్నీ స్వార్థ, నిస్వార్థాల మధ్య కొట్టుమిట్టాడుతాయి, అంతిమంగా స్వార్థం వీడి, అభిమానించే వ్యక్తుల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తాయి. ఈ సినిమా కథను మహాభారతం నుంచి స్ఫూర్తిపొందాడు మణి. భారతంలో దుర్యోధన- కర్ణుల స్నేహాన్ని బేస్ చేసుకొని ఈ కథను తయారు చేసుకొన్నాడు. మమ్ముట్టీది ఊర్లో దుర్యోధనుడి లాంటి పాత్ర అయితే, అతడికి సాయంగా వచ్చే కర్ణుడి పాత్రలో రజనీ కనిపిస్తారు. వీళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించే పాండవులందరినీ కలిపినట్టుగా అరవింద్ స్వామి రోల్‌ను డిజైన్ చేశాడు. అయితే ప్రాధాన్యం మాత్రం దుర్యోధన కర్ణ పాత్రలకే ఇచ్చాడు!
ఒరిజినల్‌గా మణిరత్నం రాసుకొన్న కథ ప్రకారం క్లైమాక్స్‌లో దుర్యోధనుడి పాత్ర నుంచి స్పూర్తి పొంది తయారు చేసిన మమ్ముట్టి రోల్ చనిపోవడం వల్ల సినిమా ఎండ్ అవుతుంది. షూటింగ్ వరకూ ఇలాగే పూర్తి చేశారు. అయితే మమ్ముట్టీకి మలయాలంలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి సూపర్ స్టార్ క్యారెక్టర్‌ను సినిమాలో చంపేస్తే వాళ్లు తట్టుకోలేరు. ధర్నాలు, బంద్‌లు కూడా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే మలయాలం కోసం క్లైమాక్స్ మార్చారు. ఆ వెర్షన్‌లో రజనీకాంత్ క్యారెక్టర్‌ను చంపేయడం ద్వారా సినిమాను ముగించారు. దీంతో అటు తమిళంలో రజనీ అభిమానులు హ్యాపీ, ఇటు మలయాళంలో మమ్ముట్టి అభిమానులు హ్యాపీ! మణిరత్నం వంటి టాప్ డైరెక్టర్ మమ్ముట్టి కోసం రెండు రకాల క్లైమాక్స్‌లు తీయడం భారతీయ చిత్రపరిశ్రమలోనే అరుదనే ఘట్టంగా నిలిచింది.
అవిటి వాడిగా మెప్పించి..
'మౌనం సమ్మదం' అనే తమిళ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మమ్ముక్కా.. సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో 'దళపతి' లాంటి క్లాసికల్ హిట్స్‌లో నటించారు. కే బాలచందర్ దర్శకత్వంలో 'అళగన్', రాజీవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'కండుకొండైన్-కండుకొండైన్' చిత్రంలో నటించారు. తెలుగులో 'ప్రియురాలు పిలిచింది' పేరుతో డబ్ అయ్యింది. ఏఆర్ రహమాన్ స్వరాలు అందించిన ఈ చిత్రంలో అజిత్, టబు, ఐశ్వర్య రాయ్, అబ్బాస్ లాంటి యువ నటుల మధ్య అవిటి వాడిగా నటించి తనలోని నటుడిని సంతృప్తి పరిచారు మమ్ముట్టి.
తెలుగు సినిమాల్లోనూ..
1993లో త్రియాత్రీ, ధర్తీపుత్ర లాంటి సినిమాలతో బాలీవుడ్‌ను మెప్పించారు. 'ధర్తీపుత్ర' అప్పట్లోనే పదికోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసి మమ్ముట్టి స్టామినాను హిందీ చిత్రసీమకు తెలిపింది. తెలుగులో కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'స్వాతి కిరణం'లో అనంతరామ శర్మగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలో లీనమయ్యారు మమ్ముట్టి.
తన శిష్యుడు తనకంటే గొప్ప పేరు తెచ్చుకుంటుంటే ఈర్ష్యతో రగిలిపోయే సంగీత విద్వాంసుడి పాత్రలో మమ్ముట్టి చూపించిన నటన ఓ అద్భుతం. 1996లో సుమన్‌తో కలిసి 'సూర్య పుత్రులు' సినిమాలో నటించిన మమ్ముట్టి.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'రైల్వే కూలీ'లో నటించినా అది రిలీజ్‌కు నోచుకోలేదు. ఆపై రెండు దశాబ్దాల తర్వాత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ 'యాత్ర'లో నటించి.. మెప్పించారు. 2021లో మలయాళ డబ్బింగ్ సినిమా 'వన్' ఓటీటీలో రిలీజ్ అయి అన్ని భాషల్లోకి అనువాదమైంది. మనసున్న ముఖ్యమంత్రిగా, ప్రజల హృదయాల్లో నిలిచిపోయే సీఎంగా 'వన్' సినిమాలో మమ్ముట్టీ నెటిజన్ల మనస్సు దోచుకున్నారు.
పురస్కారాలు
50 ఏళ్ల కెరీర్లో తన అద్భుతమైన నటనతో.. ఏడు సార్లు కేరళ స్టేట్ అవార్డులు అందుకున్న మమ్ముట్టీ.. 10 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు. మూడు సార్లు జాతీయ స్థాయి ఉత్తమ నటుడి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. 2010లో యూనివర్శిటీ ఆఫ్ కేరళ, యూనివర్సిటీ ఆఫ్ కాలికట్‌లు ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి. సినీరంగానికి మమ్ముట్టీ అందించిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1998లో 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది. ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్.. యువ నటుడిగా మమ్ముట్టి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. మమ్ముట్టీలానే పలు భాషల్లో ఏకకాలంలో నటిస్తూ తండ్రికి తనయుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఇదీ చూడండి..ఆ పుస్తకం మహేశ్‌బాబును సిగరెట్ మాన్పించిందట!