మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. బిహార్‌లో ఉపాధ్యాయురాలు కావడమేంటి? ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి.. టీచర్‌గా అవతారమెత్తనుందా? అని ఆశ్చర్యపోకండి. అయినా కేరళ బ్యూటీ.. బిహార్‌లో టెట్ ఎలా రాస్తుంది? ఇదంతా అధికారులు చేసిన తప్పిదం వల్ల జరిగిందే.
అసలు ఏమైందంటే..?
బిహార్‌లోని జహానాబాద్‌కు చెందిన రిషికేశ్ కుమార్ అనే యువకుడు ఇటీవల స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (STET) రాశాడు. దానికి సంబంధించి.. మంగళవారం విడుదలైన ఫలితాల్లో అతడికి మంచి మార్కులే(77 శాతం మార్కులు) వచ్చాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మార్క్ షీట్లో రిషికేశ్ ఫొటో లేదు. తన ఫొటోకు బదులు అనుపమ పరమేశ్వరన్ ఫొటో ఉంది. ఇది చూసి అతను ఒక్కసారి షాకయ్యాడు. దీంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు.
అప్పుడే చెప్పినా..
"ఇదే తొలిసారి కాదు. అడ్మిట్కార్డులోనే ఆమె ఫొటో వచ్చింది. ఆ విషయాన్ని అప్పుడే అధికారులకు తెలియజేశాను. ఆ పొరపాటును సరిచేస్తామని చెప్పారు. దాంతో అదే అడ్మిట్‌కార్డుతో పరీక్ష రాశాను. ఫలితాలు వచ్చినప్పటికీ ఆ ఫొటో అలానే ఉంది. ఎలాంటి మార్పులు చేయకుండా అధికారులు ఫలితాలను విడుదల చేశారు."
- రిషికేశ్ కుమార్, బాధితుడు