బాలీవుడ్ నటి మలైకా అరోరా(Malaika Arora).. 47 ఏళ్ల వయస్సులోనూ వ్యాయమాలు చేస్తూ చక్కటి శరీరాకృతితో ఆకట్టుకుంటున్నారు. గతేడాది సెప్టెంబరులో కరోనా బారిన పడి కోలుకున్న అనంతరం తన వర్కౌట్ల అనుభవాల గురించి ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. సామర్థ్యం అంటే ఏమిటనే ప్రశ్నకు ఈ విధంగా జవాబిచ్చారు మలైకా.
"గతేడాది సెప్టెంబరు 5న నాకు కొవిడ్ సోకింది. ఎవరైనా కొవిడ్ నుంచి కోలుకోవడం తేలికేనని చెప్పినటైతే, వారికి కచ్చితంగా వైరస్‌ను ఎదుర్కొనేందుకు శరీరంలో తగినంత ఇమ్యూనిటీ ఉండాలి లేదా వారికి కొవిడ్‌తో పోరాటం గురించి అవగాహన రాహిత్యమైనా ఉండాలి. నా విషయంలో వైరస్ సోకడం తేలికపాటి విషయం కాదు. ఎందుకంటే శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కనీసం రెండడుగులు కూడా వెయ్యాలన్నా భారంగా అనిపించేది. కేవలం కూర్చొని ఉండటం, మంచం నుంచి కిందకి దిగి అడుగులు వేయడం, కిటికీ వద్ద నిలబడటం..ఇవే చేసేదాన్ని".
- మలైకా అరోరా, బాలీవుడ్ నటి
అయితే కరోనా నుంచి కోలుకున్నా.. తన శరీరం ఇప్పటికీ నీరసంగా అనిపిస్తున్నట్లు మలైకా అరోరా వెల్లడించారు. "వైరస్ సోకి 10 నెలలు గడిచినా నా శరీరంలో ఇప్పటికీ నీరసమనేది ఉంది. మొదట్లో నా మనసులోని ఆలోచనలకు నా శరీరం సహకరించేది కాదు. శారీరకంగా మళ్లీ దృఢం కానేమోనని భయం వేసేది. కనీసం ఒక్కరోజైనా ఏ పనైనా చేయగలనా అనిపించేంది. ఇక నా వర్కౌట్ మొదటి రోజు అయితే ఏదీ చేయలేకపోయా. ఈ విషయంలో మానసికంగా కాస్త ఇబ్బంది పడ్డా. కానీ రెండోరోజు కచ్చితంగా వ్యాయామం చేయాలని నాకు నేనుగా బలంగా అనుకున్నా. అదే సంకల్పంతో మూడు, నాలుగు రోజులు కొనసాగించాను. నెగెటివ్ వచ్చిన కొన్నాళ్లకు మళ్లీ ఆరోగ్యంగా ఉన్నాననే భావన నాలో ఏర్పడింది. కరోనా రావడానికి ముందు ఎలా కసరత్తులు చేసేదాన్నో, ఇప్పుడు అలానే చేయగలుగుతున్నా. శ్వాస కూడా సరిగ్గా అందుతుంది. శారీరకంగా, మానసికంగానూ మళ్లీ బలంగా మారాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనల్ని ముందుకు నడిపించేది ఆశ మాత్రమే. కాబట్టి జీవితంలో దాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు" అని ఆమె అన్నారు.
ఇదీ చూడండి:Arjun Kapoor: ప్రేయసి కోసం రూ.23 కోట్లతో విల్లా