తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పోకిరి' గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - పోకిరి సినిమాకు 14 ఏళ్లు పూర్తి

సూపర్​స్టార్ మహేశ్​బాబు నటించిన 'పోకిరి'కి నేటితో 14 ఏళ్లు పూర్తయింది. ఈ సంద్భంగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు మీకోసం.

'పోకిరి' గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
పోకిరిలో మహేశ్

By

Published : Apr 28, 2020, 4:59 PM IST

'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్​బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు'.. ఈ ఒక్క డైలాగ్​ చాలు 'పోకిరి' స్టామినా ఏంటో చెప్పడానికి. సినిమా వచ్చి నేటికి 14 ఏళ్లయినా, ఇప్పటికీ ఎక్కడో ఓ చోట దీని గురించో, ఇందులోని సంభాషణలు గురించో మాట్లాడుతూ ఉంటారు.

పోకిరి సినిమాకు 14 ఏళ్లు పూర్తి

మాస్‌ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మహేశ్ సినిమా అనగానే అందరిలో సందేహం. పూరీకి మహేశ్​ లాంటి క్లాస్‌ హీరో సెట్‌ అవుతాడా? పూరీ మార్క్‌ డైలాగులు చెప్పగలడా? అయినా ఇదేం టైటిల్‌? వీటన్నింటికి సమాధానమే దిమ్మతిరిగే రికార్డుల 'పోకిరి'. ఎవరూ ఊహించని రీతిలో సంచలనం రేకెత్తించింది. టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసింది.

2006 ఏప్రిల్‌ 28న విడుదలై ప్రభంజనం సృష్టించింది 'పోకిరి'. చిత్ర ప్రారంభానికి రెండేళ్ల ముందు మహేశ్​కు కథ వినిపించారు పూరీ జగన్నాథ్‌. అయితే 'పోకిరి' అని టైటిల్‌ చెప్పగానే మహేశ్ కొంచెం ఆలోచించారు. కానీ, ఓ సవాలుగా తీసుకుని కొత్తగా కనిపించేందుకు సిద్ధమయ్యారు. కథ చెప్పినపుడే పాత్రకు తగ్గట్టు జుత్తు బాగా పెంచాలని పూరీ సూచించడంతో సరేనన్నారు మహేశ్. 'అతడు' వచ్చిన నాలుగు నెలల విరామ సమయంలో జుత్తు పెంచడంపై శ్రద్ధ పెట్టారు. తన కెరీర్‌లో తొలిసారి జుత్తు కత్తిరించుకోకుండా సరికొత్త లుక్‌లో కనిపించి అదరగొట్టారు. ముందుగా ‘పోకిరి’ కోసం మహేష్‌ కేశాలంకారణ మీదే దృష్టి పెట్టారు. అన్ని చిత్రాలకు సంబంధించి అప్పటికప్పుడు నటించే మహేశ్.. 'పోకిరి'లా ఒదిగిపోయేందుకు చాలా హోమ్ వర్క్‌ చేశారు. మాట్లాడే విధానం, నడవడం... అన్ని పక్కాగా నేర్చుకున్న తర్వాత షూటింగ్​లో పాల్గొన్నారు.

పండు అలియాస్‌ కృష్ణమనోహర్‌గా మహేశ్ నటనకు ఫిదా అవ్వాల్సిందే. 'శ్రుతి'గా కనిపించి కుర్రకారు మతి పోగొట్టింది ఇలియానా. ప్రకాశ్‌ రాజ్, నాజర్, ఆశిష్‌ విద్యార్థి, సాయాజీ షిండే, అజయ్, బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, సుబ్బరాజు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకు పూరీ సంభాషణలు ఒకెత్తయితే.. మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం మరో ఎత్తు. ఆయన స్వరపరిచిన ఆరు పాటలు అద్భుతంగా నిలిచాయి. ప్రతి పాట ఇప్పటికీ మారుమాగుతూనే ఉంది. భాస్కరభట్ల రవికుమార్, విశ్వ, కందికొండ అందించిన సాహిత్యం మైమరపించింది.

పోకిరి గురించి మీకు తెలియని విషయాలు

  • 'పోకిరి'కి ఫ‌స్ట్ అనుకున్న టైటిల్ 'ఉత్త‌మ్ సింగ్ స‌న్నాఫ్ సూర్య‌నారాయ‌ణ‌'. ర‌వితేజ హీరోగా నాగ‌బాబు నిర్మించాలని అనుకున్నారు. చివరకు మహేశ్ దగ్గరకు చేరిందీ స్క్రిప్ట్.
  • 'పోకిరి'లో హీరోయిన్‌గా మొద‌ట బాలీవుడ్ భామ ఆయేషా టాకియాను అనుకున్నారు. దీపికా ప‌దుకునే ఫొటోలు ప‌రిశీలించారు. 'వెన్నెల‌' ఫేమ్ పార్వ‌తీ మెల్ట‌న్​ను తీసుకుందామని భావించారు. ఫైన‌ల్​గా ఇలియానాను ఓకే చేశారు.
  • 'పోకిరి' షూటింగ్ 70 రోజుల్లో శ‌ర‌వేగంతో పూర్త‌ి చేశారు. 75 సంవత్స‌రాల తెలుగు సినిమా చరిత్ర‌లో ఒక సెన్సేష‌న్‌గా నిలిచిపోయిందీ చిత్రం.
  • 'పోకిరి'లో మ‌హేశ్​బాబు ముద్దుపేరు 'పండు'. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ భార్య లావ‌ణ్య ముద్దు పేరు అది.
  • 'లిజ‌న్ టు ది ఫాలింగ్ రెయిన్‌' అనే ఇంగ్లీష్ పాట ఆధారంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ 'గౌరి'(1974) సినిమాలో 'గ‌ల‌గ‌ల పారుతున్న గోదారిలా...' పాట రూపొందించారు. దాన్నే 'పోకిరి' కోసం రీమిక్స్ చేశారు.
    500 రోజులు ప్రదర్శితమైన పోకిరి

ABOUT THE AUTHOR

...view details