సంక్రాంతి అనగానే పెద్ద సినిమాల హడావుడి మామూలే. ఈసారి అది ఇంకాస్త ఎక్కువ కనిపించబోతోంది. బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఎదురుకానుంది. ఎందుకంటే మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జనవరి 12న విడుదల కాబోతున్నాయి.
రెండు పెద్ద సినిమాలూ ఒకే రోజు ఢీ కొట్టడం చూసేందుకు బాగానే ఉన్నా, ఆర్థికంగా నష్టదాయకం. ఓపెనింగ్స్‌ను రెండు చిత్రాలు పంచుకోవాల్సి వస్తుంది. ఇద్దరు నిర్మాతలూ నష్టపోతారు.
అయితే మధ్యేమార్గంగా ఓ సినిమా వెనక్కి వెళ్తుందని.. 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది. అలా జరిగితే రెండు సినిమాలకూ మధ్య ఓ రోజు విరామం వస్తుంది. అది చాలు రెండు సినిమాలకూ ప్లస్ అవ్వడానికి.
అయితే తన సినిమాను ఓ రోజు ముందు విడుదల చేయడానికి మహేశ్‌బాబు ఏమాత్రం ఒప్పుకోవడం లేదట. ముందు అనుకున్నట్టు 12నే విడుదల చేద్దాం, కావాలంటే 'అల వైకుంఠపురములో'ను 11న రమ్మనండి అంటున్నాడట. నిర్మాతలు ఎంత చెప్పినా మహేశ్ తగ్గడం లేదని, విడుదల తేదీ మార్చడం కుదరదంటున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అల్లు అర్జున్.. 12నే తన సినిమా విడుదల చేయాలని గట్టిగా చెబుతున్నాడట. ఇద్దరు హీరోలు తగ్గకపోతే.. 12న క్లాష్ ఖాయం.
ఇది చదవండి: రాబోయే పండగ సందడి పోలీస్‌లు.. మేజర్లదే