తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్-నమ్రతల ప్రేమ ప్రయాణానికి 20 ఏళ్లు - mahesh babu news

సూపర్​స్టార్ మహేశ్​బాబు, నమ్రత నటించిన 'వంశీ' చిత్రానికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడే ప్రేమలో పడిన వీరిద్దరూ.. ఐదేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు.

mahesh babu namratha vamsi movie completes 20 years
మహేశ్-నమ్రతల ప్రేమ ప్రయాణానికి 20 ఏళ్లు

By

Published : Oct 4, 2020, 11:53 AM IST

వెండితెరపై నటీనటులుగా సందడి చేసి, ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటైన వారిలో మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్‌ జోడీ ఒకటి. వీరిద్దరూ తొలిసారి ‘వంశీ’ చిత్రం కోసం కలిసి పనిచేశారు. బి.గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై (అక్టోబరు 4, 2000) ఆదివారానికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే మహేశ్‌-నమ్రత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత దాదాపు ఐదేళ్లకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

మహేశ్​ నమ్రతల పెళ్లి ఫొటో

కథేంటి: వంశీ (మహేష్ బాబు) ఓ ఫ్యాషన్‌ డిజైనర్‌. ఓ కాంపిటేషన్‌లో భాగంగా తన సహోద్యోగి స్నేహ (మయూరి కాంగో)తో కలిసి ఆస్ట్రేలియా వెళ్తాడు. అక్కడ వంశీ డిజైన్లకు మోడలింగ్‌ చేసేందుకు స్నేహ ఎంపికవుతుంది. పారిశ్రామికవేత్త అయిన అంకినీడు ప్రసాద్‌ (నాజర్‌) కుమార్తె శిల్ప(నమ్రత). పరీక్షలు అయిపోవడంతో ఆస్ట్రేలియా పర్యటనకు వస్తుంది. అదే సమయంలో అనుకోకుండా వంశీని కలుస్తుంది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. సరిగ్గా అదే సమయంలో స్నేహ గాయపడటంతో వంశీ డిజైన్‌ చేసిన దుస్తులు ధరించి ప్రదర్శన ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఈ విషయం తెలిసిన శిల్ప ఆ దుస్తులను ధరించి పోటీల్లో పాల్గొని వంశీ దుస్తులకు ప్రథమ బహుమతి వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ భారత్‌కు తిరిగి వస్తారు. తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో శిల్ప తండ్రి వంశీని హెచ్చరిస్తాడు. అయితే, శిల్ప-వంశీలు పారిపోయి గుడిలో వివాహం చేసుకుందామనే సమయానికి అర్జున్ ‌(కృష్ణ) శిల్పను కిడ్నాప్‌ చేస్తాడు. అసలు అర్జున్‌ ఎందుకు ఈ కిడ్నాప్‌ చేశాడు? శిల్పను వంశీ కాపాడాడా? చివరికి వివాహం చేసుకున్నాడా? అన్నది కథ.

వంశీ సినిమాలో మహేశ్ నమ్రత

మణిశర్మ పాటలు అలరించినా, ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. అయితే, ఈ చిత్ర షూటింగ్‌లోనే మహేశ్‌-నమ్రత ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఫిబ్రవరి 10, 2005లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి గౌతమ్‌, సితార జన్మించారు.

అలా మొదలైంది!

‘వంశీ’ చిత్రీకరణ కోసం న్యూజిలాండ్‌ వెళ్లింది చిత్ర బృందం. అక్కడ సుమారు 25 రోజులు షూటింగ్‌ చేశారు. అప్పటివరకూ నమ్రత అన్ని రోజులు అవుట్‌డోర్ ‌(విదేశాల్లో) షూటింగ్‌ చేయలేదట. ఇక మహేశ్‌కు కాస్త సిగ్గు ఎక్కువ. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అయితే, నమ్రతతో మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత వారి మధ్య స్నేహం చిగురించింది. సెట్‌లో ఎక్కువసేపు కలిసి కబుర్లు చెప్పుకొనేవారు. న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన తర్వాత వారి మధ్య ఉన్నది స్నేహం కాదని, ప్రేమని తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఒకరోజు సడెన్‌గా మహేశ్‌కు నమ్రత ఫోన్‌ చేసిన తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే ఆమె అంటే ఇష్టమున్న మహేశ్‌కు కూడా ఓకే చెప్పేశారు.

మహేశ్ నమ్రత

అందుకే పెళ్లికి నాలుగేళ్లు

‘వంశీ’ సినిమా సమయంలోనే నమ్రత మరికొన్ని చిత్రాలను కూడా ఒప్పుకొన్నారు. దీంతో పెళ్లికి ముందే తన సినిమాలన్నీ పూర్తి చేయాలనుకున్నారు. అదే సమయంలో మహేశ్‌కు ‘వంశీ’ మూడో సినిమా కావడంతో కెరీర్‌లో ఇంకాస్త కుదురుకునే వరకూ వేచి చూడాలని ఇద్దరూ భావించారు. ఈలోగా నమ్రత అంగీకరించిన సినిమాలను పూర్తి చేసి, పెళ్లి పీటలెక్కారు. పెళ్లి తర్వాత నటించాలా? వద్దా? అన్న దానిపై కూడా అప్పుడే నమ్రత ఒక నిర్ణయానికి వచ్చారు. తాను కూడా సినిమాలు చేస్తే, కుటుంబానికి ఎక్కడ దూరం కావాల్సి ఉంటుందోనని పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు.

అందుకే మహేశ్‌ అంటే అంత ప్రేమ

‘‘కుటుంబం కోసం మహేశ్‌ ఏదైనా చేస్తారు. తల్లిదండ్రుల్ని అమితంగా ప్రేమిస్తారు. అదే విధంగా పిల్లల్ని ప్రేమించే గొప్ప తండ్రి కూడా. జీవిత భాగస్వామికి ఎప్పుడూ తోడుగా నిలుస్తారు. మా అమ్మానాన్నలు చనిపోతే ‘ఖలేజా’ షూటింగ్‌కు కొన్నాళ్లు విరామం తీసుకొని మరీ నాకు అండగా నిలిచారు. వీటన్నింటికీ మించి గొప్ప మానవతా వాది. అందుకే మహేశ్‌ అంటే నాకు అంత ప్రేమ, ఆరాధన. మహేశ్‌ను కలవడం జీవితంలో నాకు దక్కిన పెద్ద అదృష్టం. నా పెళ్లే నాకు దక్కిన బహుమతుల్లో అత్యంత ప్రత్యేకమైంది’’ - ఓ సందర్భంలో మహేశ్‌ గురించి నమ్రత

వంశీ సిినిమాలో మహేశ్​బాబు

ABOUT THE AUTHOR

...view details