'ఫన్‌టాస్టిక్ తార' టీజర్ వేడుకలో సితార, నమ్రతా సందడి సూపర్‌స్టార్ మహేష్‌బాబు కుమార్తె సితార, సినీ నటి నమ్రతా శిరోద్కర్, బాలీవుడ్ సినీ నటి నేహా ధూపియా నగరంలో సందడి చేశారు. మ్యాజిక్ మ్యాట్రిక్స్ స్టూడియోస్ సంస్థ చిన్నారుల కోసం 'ఫన్‌టాస్టిక్ తార' పేరిట రూపొందించిన త్రీడి యానిమేషన్ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్, టీజర్‌ను ట్రెడెంట్ హోటల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ తారలతోపాటు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, మ్యాజిక్ మ్యాట్రిక్స్ స్టూడియోస్ నిర్వహకులు పాల్గొన్నారు.
యానిమేషన్ చిత్రాల్లో భావవ్యక్తీకరణ బాగుంటుందని సినీ తారలు నమ్రతా శిరోద్కర్, నేహా దూఫియా అన్నారు. పిల్లలకు మార్గనిర్దేశకంగా యానిమేషన్ చిత్రాలు ఉంటే వారి మెదడు వృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుందన్నారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింభించే విధంగా పిల్లలకు యానిమేషన్ చిత్రాలు అందించాలన్నారు.
వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ గేమింగ్ రంగానికి హైదరాబాద్ హాబ్‌గా మారుతుందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ అన్నారు. ఆరేళ్ల క్రితం ఈ రంగానికి సంబంధించిన జాతీయ స్థాయిలో హైదరాబాద్ మూడో స్థానంలో ఉండగా ప్రస్తుతం రెండో స్థానానికి చేరుకుందన్నారు. గేమింగ్, యానిమేషన్ పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంగా ప్రభుత్వం ఐటీ కారిడార్‌ను గేమింగ్ టవర్‌ను నిర్మిస్తుందన్నారు. రానున్న ఏడాదిన్నరలో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు.
పిల్లల కోసం ప్రత్యేకంగా యానిమేషన్ సిరీస్ రూపొందించాలని మూడేళ్లగా చేస్తున్న ప్రయత్నం ఫలించిందని మ్యాజిక్ మ్యాట్రిక్స్ స్టూడియోస్ నిర్వహకులు మనీష్ తెలిపారు. కె వి రాజేంద్ర దర్శకత్వంలో 'ఫన్‌టాస్టిక్ తార' పేరిట యానిమేషన్ వెబ్‌సిరీస్‌ను త్వరలోనే ఓటీటీ ప్లామ్ మీద విడుదల చేస్తామని చెప్పారు.