తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆరడుగుల అందగాడు.. అమ్మాయిల రాకుమారుడు - మహేశ్​బాబు పుట్టినరోజు

టాలీవుడ్​ హీరో మహేష్​ ​బాబు.. నేడు(సోమవారం) 46వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా మహేష్​ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాటకు సంబంధించి కీలక ప్రకటన వెలువడనుంది. సోమవారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ముహూర్తం ఖరారు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్​ స్పష్టం చేసింది. తన గ్లామర్​, నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ కథానాయకుడిపై స్పెషల్ స్టోరీ మీకోసం.

mahesh babu
మహేశ్​బాబు

By

Published : Aug 9, 2021, 5:36 AM IST

'మహేష్​.. ఆ పేరులో మత్తుంది, ఆ పేరులో వైబ్రేషన్స్​ ఉన్నాయి'.. ఇది ఒక తెలుగు సినిమాలోని డైలాగ్​ కావొచ్చు, కానీ ఇదొక్కటి చాలు మహేష్ ​​బాబు క్రేజ్​ ఏంటో చెప్పడానికి. తనదైన మేనరిజం, నటన, డ్యాన్స్​తో ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రిన్స్.. ప్రస్తుతం టాలీవుడ్​ అగ్రహీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు మహేష్​. ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు మొక్క నాటి తనపై ఉన్న ప్రేమను చాటాలని సూపర్​స్టార్ పిలుపునిచ్చారు. నేడు 46వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సూపర్​స్టార్​పై ప్రత్యేక కథనం.

సర్కారు వారి పాట పోస్టర్

కుటుంబ నేపథ్యం

సూపర్‌ స్టార్‌ కృష్ణ నాలుగో సంతానం మహేష్​ బాబు. ప్రిన్స్‌కు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. మహేష్​​కు ప్రియదర్శని అనే చెల్లెలు ఉంది. ఈమె భర్తే నటుడు సుధీర్‌బాబు. అమ్మమ్మ దుర్గమ్మ దగ్గర పెరిగిన ప్రిన్స్​ చదువంతా మద్రాస్​లో సాగింది. అక్కడి లయోలా కాలేజ్‌లో కామర్స్‌ విభాగంలో డిగ్రీ పట్టా పొందారు.

బాలనటుడిగా సినిమాల్లోకి అరంగేట్రం చేశారు మహేష్​​. ఆ వయసులోనే తనదైన శైలి నటనతో మెప్పించారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మొదటి సినిమా 'నీడ'. ఓ పక్క చదువుకుంటూనే సినిమాల్లో నటించారు. 'పోరాటం', 'శంఖారావం', 'బజారు రౌడీ', 'గూఢచారి 117', 'కొడుకు దిద్దిన కాపురం', 'బాలచంద్రుడు' చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు.

సినీ ప్రస్థానం

1999లో 'రాజకుమారుడు'తో హీరోగా తెరంగేట్రం చేశారు మహేష్​​. ఆ తర్వాత 'యువరాజు', 'వంశీ', 'మురారి', 'టక్కరి దొంగ', 'బాబీ', 'ఒక్కడు', 'నిజం', 'నాని', 'అర్జున్‌', 'అతడు', 'పోకిరి', 'సైనికుడు', 'అతిథి', 'ఖలేజా', 'దూకుడు' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. 2020 సంక్రాతి కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో సూపర్​ హిట్​ అందుకున్నారు.

విభిన్న పాత్రల్లో మెరిసిన ప్రిన్స్ 'శ్రీమంతుడు'గా ఊరిని దత్తత తీసుకోమని సందేశమిచ్చినా, 'టక్కరి దొంగ'గా అలరించినా, సోదరిని అమితంగా ప్రేమించే 'అర్జున్‌'గా.. ఇలా ప్రతి పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడీ ఘట్టమనేని అందగాడు. సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించేలా 'భరత్‌ అనే నేను' చిత్రంలో భరత్‌ పాత్రలో మహేష్​ అలవోకగా ఒదిగిపోయారు. ఇక దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి కాపుకాస్తున్న సైనికుల త్యాగాలను 'సరిలేరు నీకెవ్వరు'తో కళ్లకు కట్టినట్లు చూపించారు.

తాజాగా 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు ప్రిన్స్. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

వాణిజ్య ప్రకటనలు

సినిమాలతోనే కాదు వాణిజ్య ప్రకటనలతోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు మహేష్​​. వాటికి తోడు ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించారు, వ్యవహరిస్తున్నారు. సొంతంగా బ్రాండెడ్​ దుస్తుల వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు.

అవార్డులు

తొలి సినిమా 'రాజకుమారుడు'కు ఉత్తమ నూతన నటుడు కేటగిరీలో నంది పురస్కారం.

'మురారి', 'టక్కరి దొంగ', 'అర్జున్‌' చిత్రాలకు నంది స్పెషల్‌ జ్యూరీ పురస్కారం.

'నిజం', 'అతడు', 'దూకుడు', 'శ్రీమంతుడు' చిత్రాలకు నంది ఉత్తమ నటుడు పురస్కారాలు.

నమ్రతతో వివాహం

'వంశీ' సినిమాలో తనతో నటించిన హీరోయిన్‌ నమ్రతనే పెళ్లి చేసుకున్నారు మహేష్​ బాబు. ఇప్పటికీ టాలీవుడ్‌ స్వీట్‌ కపుల్స్‌ అంటే గుర్తొచ్చేది మహేష్​-నమ్రతా శిరోద్కర్‌ జోడీనే. 2000 సంవత్సరంలో ప్రేమలో పడిన వీరిద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, 2005లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

'సర్కారు వారి పాట' ఫస్ట్​లుక్ ఆగయా.. సంక్రాంతికి రిలీజ్

'నువ్వులేక నేను లేను' హీరోగా మహేష్​​ బాబు!

మహేష్​​బాబు కోసం.. రాజమౌళి తొలిసారి అలా!

ABOUT THE AUTHOR

...view details