తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పార్థు-పూరీల కాంబినేషన్​కు 15 ఏళ్లు పూర్తి - మహేశ్​ బాబు

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు హీరోగా తెరకెక్కిన 'అతడు' చిత్రం విడుదలై నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Maheh Babu's Athadu movie completed for 15 years #15YearsForAthadu
'అతడు' తెరపైకి వచ్చి 15 ఏళ్లు పూర్తయింది

By

Published : Aug 10, 2020, 4:30 PM IST

సూపర్​స్టార్​ మహేశ్​బాబు హీరోగా నటించిన 'అతడు' చిత్రం విడుదలై నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. మహేశ్‌.. మరో 75 సినిమాల్లో నటించినా అతడి కెరీర్​లో ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పార్థు పాత్రలో జీవించడం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలతో మాయ చేయడమే ఇందుకు కారణం. సినిమా ప్రారంభం నుంచి శుభం వరకు వచ్చే ప్రతి సంభాషణ ఆకట్టుకుంటుంది.

15 ఏళ్లు పూర్తి చేసుకున్న 'అతడు' చిత్రం

ముఖ్యంగా నందు(మహేశ్‌), బాజిరెడ్డి(కోట శ్రీనివాసరావు), మహేశ్, తనికెళ్ల భరణి(నాయుడు) మధ్య వినిపించే మాటలు అద్భుతం. బ్రహ్మానందం కామెడీ చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. మణిశర్మ సంగీతం మరువలేనిది. అటు నందూగా, ఇటు పార్థుగా రెండు విభిన్న పాత్రల్లో ఒదిగిపోయారు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు.

అతడు చిత్రంలో మహేశ్​బాబు

డైలాగ్స్ ప్రత్యేకం

"హలో నేను బాజిరెడ్డిని చెప్పమ్మా.. ఫోన్‌ శివారెడ్డికి ఇవ్వండి.. నాతో మాట్లాడితే శివారెడ్డితో మాట్లాడినట్టే.. నిన్ను కాలిస్తే శివారెడ్డిని కాల్చినట్టేనా?" ఈ డైలాగ్‌ ఇప్పటికీ కొంతమంది ప్రేక్షకుల నోటిలో నానుతూ ఉంది. కథానాయిక త్రిష నటన చూపుతిప్పుకోనివ్వదు. బావ మరదళ్ల మధ్య ఉండే చిలిపితనం ఈ సినిమాలో ఉట్టిపడుతుంది. నందు.. పార్థు కాదని నాజర్‌ కుటుంబానికి తెలిసిన తర్వాత.. 'నేనూ వస్తాను' అని త్రిష అనగానే 'నేనే వస్తా' అని మహేశ్‌ చెప్పడం హీరోయిజాన్ని ప్రతిబింబిస్తుంది.

సీబీఐ అధికారిగా ప్రకాశ్‌రాజ్‌ నటన వర్ణించలేనిది."నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు.. నేను నమ్మాను కాబట్టి చెప్పా" డైలాగు విజిల్‌ కొట్టించదు కానీ విజ్ఞతను కలిగిస్తుంది. "అప్పాలా.. మీరంతా మోమాటంగా చెప్పాలా" లాంటి సునీల్‌ కామెడీ టైమింగ్‌కి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు.

దేవీశ్రీ అందుకే చేయలేదు

త్రివిక్రమ్‌ మాటలు, మహేశ్​, త్రిష నటన ఎంతగా ఆకట్టుకున్నాయో, మణిశర్మ సంగీతం సినీ ప్రియుల్ని అదే స్థాయిలో అలరించింది. మహేశ్​- మణిశర్మ కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అంచనాలు అందుకుంటూ చిరస్థాయిగా నిలిచే స్వరాలు సమకూర్చారు మణి. నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుంది. మరి మణి స్థానంలో దేవీశ్రీ ప్రసాద్‌ ఉంటే? ఎందుకంటారా.. ముందుగా 'అతడు' చిత్ర బృందం సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకోగా కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేని పరిస్థితి వచ్చింది. దాంతో దేవీశ్రీ ప్రసాద్‌ను సంప్రదించారు. అయితే, దేవీకి మణిశర్మ అంటే గౌరవం. ఆయనతో ప్రారంభించిన ప్రాజెక్టుకు నేను సంగీతం ఇవ్వలేనని చెప్పారట దేవీ.

అతడు చిత్రానికి సంగీతాన్ని అందించనని తిరస్కరించిన దేవీశ్రీప్రసాద్​

"మహేశ్​తో అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. విలువలు పాటించడం వల్లే నేను ఇలా ఉన్నా. ఇప్పటికీ అదే అనుసరిస్తున్నా" అని ఓ సందర్భంలో తెలిపారు డీఎస్పీ. అలా మహేశ్​తో వచ్చిన తొలి అవకాశం వదులుకున్నారు దేవీ. దాంతో మళ్లీ మణిశర్మనే తీసుకున్నారు.

ఆ భాషలోకి డబ్​

2005లో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. టెలివిజన్‌లో ప్రచురితమైన సినిమాల జాబితాలో అత్యధిక రేటింగ్‌ పొందిన చిత్రంగానూ పేరొందింది. ఈ సినిమాలో మహేశ్‌ చెప్పిన ప్రతి డైలాగు ఇప్పటికీ ప్రత్యేకమే. ఇలాంటి చిత్రాలు చాలా ఉన్నాయి అనుకోవచ్చు. ఈ సినిమా విశేషం ఏంటంటే.. పోలాండ్‌లోకి డబ్‌ అయిన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం.

నాజర్​, శోభన్​బాబు

చెక్కు వెనక్కి పంపారు

'అతడు' చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం శోభన్‌బాబుని సంప్రదించిదట చిత్రబృందం. కానీ అప్పటికే ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఖాళీ చెక్కు పంపినా.. తిరస్కరించి తిప్పి పంపించారని సీనియర్​ నటుడు మురళీమోహన్‌ ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details