దివంగత నటుడు సుశాంత్ మృతదేహాన్ని చూడటానికి నటి రియా చక్రవర్తి.. జూన్ 14న శవాగారానికి వచ్చిందన్న వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. దానికి సంబంధించిన వీడియోలనూ పలు వేదికలపై షేర్ చేశారు నెటిజన్లు. వీటిని సుమోటోగా తీసుకున్న మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) ముంబయి పోలీసులు, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్‌కు నోటీసులు పంపింది. దీనిపై సోమవారంలోగా వివరణ ఇవ్వాలని.. ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్హెచ్ఆర్సీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.
'సుశాంత్‌ను చూడటానికి రియాకు అనుమతిచ్చారా..?'
సుశాంత్ మృతదేహాన్ని చూడటానికి నటి రియా చక్రవర్తిని ఎలా అనుమతించారని ముంబయి పోలీసులు, నగర మున్సిపల్ కార్పోరేషన్‌ను ప్రశ్నించింది మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్. దీనిపై సోమవారంలోగా వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది.
సుశాంత్ మరణించిన జూన్ 14న విలే పార్లేలోని కూపర్ ఆస్పత్రికి నటి రియా వచ్చిందన్న వీడియోలను, వార్తా నివేదికలను ఎస్హెచ్ఆర్సీకి చెందిన అగ్రశ్రేణి అధికారి పరిశీలించినట్లు సమాచారం. మృతదేహం వద్దకు కుటుంబసభ్యులను తప్ప మరెవరిని అనుమతించకూడదనే నిబంధనలను పట్టించుకోకపోవడంపై ఉన్నతశ్రేణి అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు సుశాంత్ కుటుంబసభ్యులు కాని వారిని మార్చురీలోకి ఎలా అనుమతించారు? అనే విషయంపై ఆస్పత్రి డీన్‌ను వివరణ కోరినట్లు తెలుస్తోంది.
సుశాంత్ మృతదేహం మార్చురీలో ఉండగా.. నటి రియా చూడటానికి వచ్చిన వీడియోలు వైరల్‌గా మారిన తర్వాత.. ఎస్హెచ్ఆర్సీ గత నెలలోనే అందిన ఫిర్యాదులను సుమోటోగా తీసుకుని చర్యలు ప్రారంభించింది. మరణించిన వారికి సంబంధం లేని వ్యక్తులను శవాగారానికి అనుమతించరాదనే నిబంధనను ఉల్లంఘించిన వారంతా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.