ఒక అందమైన అమ్మాయి కరచాలనం కోసం చెయ్యిస్తే.. ఆ చేతికి ఎన్ని క్రిములున్నాయో ఏంటో అని అనుమానంగా చూస్తాడు ఆ అబ్బాయి. తినే బ్రెడ్ ముక్కపై కూడా అటూ ఇటూ ఊదికానీ నోట్లో పెట్టుకోడు. అంత నీటుగాడు అతను. ఎవరు తుమ్మినా, దగ్గినా ఆమడ దూరం పారిపోతాడు. అందుకే అందరూ అతణ్ని 'మహానుభావుడు' అన్నారు.
మారుతి తెరకెక్కించిన 'మహానుభావుడు' సినిమా ముచ్చట్లే ఇవన్నీ. అందులో కథానాయకుడు శర్వానంద్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతతో అతిశుభ్రతని పాటిస్తుంటాడు. తెరపై అతని హంగామా ప్రేక్షకుల్ని బాగా నవ్వించింది. థియేటర్ నుంచి బయటికొచ్చాక ఇంత నీటుగాళ్లని భరించడం కష్టమే అనుకున్నారంతా. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఒక్కరూ మహానుభావుడు కావల్సిందే అనిపిస్తోంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనూ ఆ సినిమానే గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మారుతిని 'ఈనాడు సినిమా' పలకరించింది.
కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇప్పుడంతా మీ 'మహానుభావుడు'ని గుర్తు చేసుకుంటున్నారు. గమనించారా?
నాక్కూడా చాలామంది సందేశాలు పంపించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా 'మహానుభావుడు' సినిమా గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ సినిమా తీసినప్పుడు మరీ ఇలాంటోళ్లు ఉంటారా? అతి శుభ్రత అంటే మరీ ఇంత దారుణంగా ఉంటుందా? అని మాట్లాడుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్లూ విధిగా అలా మారాల్సిన పరిస్థితి. ఈ కొన్నాళ్లు మనమందరం మహానుభావులమే అన్నమాట. కరోనావల్ల ఇప్పుడంతా ఆ చిత్రాన్ని గుర్తు చేస్తుంటే అదో భిన్నమైన అనుభవం.
'మహానుభావుడు' కథ రాసేటప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉండేవి?
ఆ సినిమాలో కథానాయకుడి పాత్ర పేరు ఆనంద్. ఆ పాత్ర గురించి ఆలోచిస్తూ సన్నివేశాలు రాసుకుంటున్నప్పుడు, నిజంగా అతి చేసినట్టుందేమో కదా అనిపించేది. కానీ నవ్వించడం కోసం ఆ పాత్రని అప్పట్లో అలా డిజైన్ చేశా. ఎవరైనా తుమ్ముతున్నారంటే చాలు.. పారిపోతుంటాడు. హాస్పిటల్‌కి వెళితే మాస్క్ తగిలించుకుని అందరి ముక్కులకి శానిటైజర్ స్ప్రే కొట్టుకుంటూ వెళ్లిపోతుంటాడు. కానీ ఇలాంటి పరిస్థితులు నిజ జీవితంలో మనక్కూడా ఎదురవుతాయని, ప్రపంచం మొత్తం ఇలాగే చేస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. నిజంగా ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలుసుంటే, ఇంకా బాగా తీసుండేవాణ్నేమో.
ప్రస్తుతం మీ ఇంట్లో, కార్యాలయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?