మాధవన్ - సిమ్రన్‌లు 17 ఏళ్ల తర్వాత తిరిగి భార్యాభర్తలుగా మారారు. ఇది నిజ జీవితంలో జరిగింది కాదు.. రీల్ లైఫ్ కోసం చేసిన పని. ప్రస్తుతం మ్యాడీ ప్రముఖ మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితాధారంగా 'రాకెట్రీ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆయనే దర్శకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇప్పుడీ చిత్రంలో ఆయనకు భార్యగా సిమ్రన్ కనిపించబోతుందట. తాజాగా సెట్స్‌లోని వీరిద్దరికీ సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
మరోసారి జంటగా మాధవన్- సిమ్రన్ - simran
17 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు మాధవన్- సిమ్రన్ జోడీ. 'రాకెట్రీ' అనే సినిమాలో భార్యాభర్తలుగా కనిపించనున్నారు.
ఈ రొమాంటిక్ జోడీ 'పరవశం' చిత్రంలో తొలిసారి కలిసి నటించారు. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ఇదే జోడీతో మణిరత్నం కూడా ఓ సినిమాను తెరకెక్కించారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ జంట తెరపై సందడి చేస్తుండటం.. సినీప్రియుల్లోనూ 'రాకెట్రీ'పై అంచనాలు పెంచాయి.
భారత అంతరిక్ష పరిశోధన రంగ అభివృద్ధిలో నారాయణన్ చేసిన కృషి అసామాన్యం. గొప్ప అంతరిక్ష పరిశోధకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. ఒకానొక సమయంలో దేశ ద్రోహం కేసును ఎదుర్కొన్నారు. పాకిస్థాన్‌కు దేశ రహస్యాలను అమ్మేశారని ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నంబిపై వచ్చిన ఈ ఆరోపణలపై సుప్రీం కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణ అనంతరం ఆయనపై వచ్చిన దేశ ద్రోహం కేసును కొట్టి వేశారు. వారిపైన ఆరోపణలు చేసినందుకు గాను ప్రభుత్వాన్ని రూ.50 లక్షలు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది కోర్టు.