'మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు(MAA Elections) గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియకముందే అధ్యక్ష పదవికి సిద్ధమంటూ పలువురు ప్రకటించారు. దీంతో 'మా' అసోసియేషన్‌లో వేడి రాజుకుంది. ఇటీవలే మా కార్యవర్గ పదవీకాలం ముగిసింది. దీంతో కార్యవర్గ సభ్యులు 'మా' క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు.
ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ముగిసిందని, ఎన్నికలు నిర్వహించాలని ఆ లేఖలో కోరారు. అయితే.. ఆ లేఖపై కృష్ణంరాజు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో రేపు ఆన్‌లైన్ ద్వారా కార్యవర్గ సమావేశం నిర్వహించాలని 'మా' అసోసియేషన్ నిర్ణయించింది.
ఇప్పటికే 'మా' అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగేందుకు ఐదుగురు సభ్యులు సిద్ధమయ్యారు. ప్రకాశ్‌రాజ్, మంచువిష్ణు, జీవితారాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఎవరికి వారు ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటూ.. సీనియర్ల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఈసారి ఎన్నికల్లో 'మా' అసోసియేషన్ భవన నిర్మాణం కీలకపాత్ర పోషించనుంది.
లోకల్, నాన్‌లోకల్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదిలా ఉండగా.. కొంతమంది మాజీ అధ్యక్షులు, సీనియర్ సభ్యులు మాత్రం ఎలాంటి పోటీ లేకుండానే అధ్యక్షపదవి ఏకగ్రీవం చేస్తే బాగుంటుందని ప్రయత్నిస్తున్నారు. గురువారం జరగబోయే సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి..పోర్నోగ్రఫీ కేసు: రాజ్‌కుంద్రా బెయిల్ పిటిషన్ తిరస్కరణ