వీలైనంత త్వరగా 'మా' ఎన్నికలు జరపాలని నటుడు ప్రకాశ్‌రాజ్ కోరారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన 'మా' సర్వసభ్య సమావేశంలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమావేశంలో 'మా'లోని కీలకసభ్యులు అసోసియేషన్ ఎన్నికలపై , 'మా'లోని సమస్యలు, ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కాగా, ఈ సమావేశంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్ 'ఈ ఏడాది జరగాల్సిన 'మా' అసోసియేషన్ ఎన్నికలు త్వరితగతిన జరిగేలా చూడాలి. వీలైతే సెప్టెంబర్ 12 లేదా 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి' అని కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు.
MAA Elections: 'మా' ఎన్నికలపై ప్రకాశ్‌రాజ్ కీలక వ్యాఖ్యలు - మా ఎలక్షన్స్ ప్రకాశ్ రాజ్
'మా' ఎన్నికలు త్వరితగతిన జరిగేలా చూడాలని నటుడు ప్రకాశ్‌రాజ్ కోరారు. వీలైతే సెప్టెంబర్ 12 లేదా 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు.
'మా' ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. 'సినిమా బిడ్డలం' పేరుతో ప్యానల్ ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీకి ప్రకాశ్‌రాజ్ సర్వం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు మంచు విష్ణు సైతం అధ్యక్ష పదవి సాధించేందుకు కావాల్సిన వ్యుహాలు పన్నుతున్నారు. ఎన్నికల వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి సభ్యులందరూ ఒకరిపై ఒకరూ పరోక్ష వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి.. 'మా' ఎన్నికల విషయంలో త్వరితగతిన ఓ నిర్ణయానికి రావాలని క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు ఇటీవల ఓ లేఖ రాశారు. సభ్యుల పరోక్ష విమర్శల కారణంగా అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగే ప్రమాదముందన్నారు. దీంతో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఇదీ చూడండి: 'మా' బిల్డింగ్‌పై బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్