'మా' అసోసియేషన్ భవన వివాదం(maa association building) రోజురోజుకు ముదురుతోంది. ఈ విషయమై నటుడు మోహన్‌బాబుకు చురకలంటించారు మరో నటుడు నాగబాబు. ఎన్నికలు ఉన్నాయనే మోహన్‌బాబు 'మా' భవన నిర్మాణ విషయాన్ని లేవనెత్తారని విమర్శించారు.
"మా అసోసియేషన్‌కు 2006-08లో భవనం కొన్నాం. ఎన్నికలు ఉన్నాయనే ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. అంతకు ముందు నుంచే బిల్డింగ్ సమస్య ఉంది. చాంబర్ వాళ్లు మమ్మల్ని ఖాళీ చేయమని ఒత్తిడి తెచ్చేవారు. అలా అప్పుడు కొత్త బిల్డింగ్ కొనాల్సి వచ్చింది. కానీ ప్రతి సారి ఎన్నికల్లో మా బిల్డింగ్ కొన్నారు.. అమ్మారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయమై మోహన్‌బాబు ఆలస్యంగా స్పందించారు. ఆయన అడిగారనే వివరణ ఇస్తున్నా. చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లు బిల్డింగ్ ఖాళీ చేయమని తీవ్రంగా ఒత్తిడి చేశారు. అయితే ఆ సమయంలో మా వద్ద అన్నీ కలుపుకుని దాదాపు కోటీ ఇరవై, ముప్పై లక్షలు ఉన్నాయి. అయితే పరుచూరి గోపాలకృష్ణ సలహా, సూచనలతో శ్రీనగర్ కాలనీలో డైరెక్టర్స్ అండ్ రైటర్స్ అసోసియేషన్ బిల్డింగ్‌కు దగ్గర్లో ఓ భవనాన్ని కొన్నాం. చిన్న వాళ్లకు అందరికీ అందుబాటులో ఉంటుంది.. అందరం అక్కడే ఉంటాం అని పరుచూరి చెప్పడం వల్ల అక్కడ ఓ బిల్డింగ్ కొన్నాం. 140స్క్వేర్ యార్డ్స్ స్థలంలో ఉన్న భవనాన్ని రూ. 71 లక్షలకు కొన్నాం. ఇంకో మూడు లక్షలతో రిపేర్ చేయించాం. మరో రూ.15 లక్షలతో రెన్యువేట్ చేయించాం. మొత్తం 96 లక్షలు ఖర్చు అయింది. అయితే ఆ తరువాత 2017లో ఆ బిల్డింగ్‌ను శివాజీ రాజా అధ్యక్షుడిగా, నరేష్ జనరల్ సెక్రటరీగా ఉన్న సమయంలో అమ్మేశారు. అది కూడా చాలా తక్కువ రేటుకే అమ్మేశారు. దాన్ని నడపడం భారమైందనే కారణం చెప్పారు. ఎందుకు ఎలా భారమైందో చెప్పాలి. పైగా 95లక్షలు అంచనా చేసి.. 35 లక్షలకు బేరం పెట్టారు. 30 లక్షల తొంబై వేలకు అమ్మేశారు. దాని విలువ ఎక్కువ ఉంటుదని మా చార్టెడ్ అకౌంట్ చెప్పినా వినలేదు. అయితే ఆ భూమి విలువే.. దాదాపు కోటి నలబై లక్షలు ఇప్పుడు. ఆ 30లక్షలు కూడా ఏం చేశారో తెలియదు. అంత తక్కువకు బిల్డింగ్ అమ్మింది కూడా నరేష్(maa elections naresh). అంటే మీకు మద్దతుగా తిరుగుతున్న వారే. 'మా' ఎన్నికలకు సంబంధించి నేను ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇస్తున్నా. ప్రకాశ్ రాజ్‌పై సినీ పరిశ్రమలో నిశ్శబ్దంగా వ్యతిరేకత తీసుకొస్తున్నారు. ఎంత కాలం ప్రాంతీయతపై ఏడుస్తాం. మంచి వ్యక్తి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండాలని మద్దతు ఇస్తున్నాం. 'మా' అసోసియేషన్ లో భవనం ఒక్కటే సమస్య కాదు వంద సమస్యలున్నాయి. ప్రకాశ్ రాజ్‌ను గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తాం."