కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. లాక్‌డౌన్ ఎత్తివేయడం వల్ల సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ పట్టాలెక్కుతున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి అడపాదడపా సినిమా చిత్రీకరణలు తిరిగి ప్రారంభమయ్యాయి. దాంతో చిత్రపరిశ్రమలో సెలబ్రేషన్స్ షురూ అవుతున్నాయని భావించినంతలోనే 'మా' ఎలక్షన్‌తో ఒక్కసారిగా పరిస్థితి మరింత రసవత్తరంగా మారింది. సాధారణ ఎన్నికలను తలపించేలా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఐదుగురు ప్రముఖ నటీనటులు అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. అసలు ఈ వారం ప్రారంభం నుంచి వచ్చిన సిని'మా' విశేషాలివే..
గత ఆదివారం ఆరంభం..
ఈ ఏడాది జరగనున్న 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు నటుడు ప్రకాశ్‌రాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా 'మా' ఎన్నికల వ్యవహారం తెరపైకి వచ్చింది. అసోసియేషన్‌లో ఎన్నో సమస్యలున్నాయని.. వాటిని చక్కదిద్దడానికి, కళాకారులకు అన్నివిధాలుగా సేవ చేయడానికి తన వద్ద పక్కా ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు.
సోమవారం ఇలా..
సెప్టెంబర్‌లో జరగనున్న 'మా' అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కు పోటీగా తాను కూడా బరిలోకి దిగుతున్నట్లు నటుడు మంచు విష్ణు ప్రకటించారు. ఈ క్రమంలోనే తన తండ్రితో కలిసి ఇండస్ట్రీలోని సీనియర్ నటులైన కృష్ణ ఇంటికి చేరుకుని మద్దతు కోరారు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టింది.
మంగళవారం.. ముచ్చటగా ముగ్గురు
ప్రస్తుతం 'మా' అసోసియేషన్‌లో జనరల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న నటి జీవితా రాజశేఖర్ సైతం ఈ ఏడాది ఎన్నికల సంగ్రామంలోకి అడుగుపెడుతున్నట్లు తెలియజేశారు. 'మా'లో అంతర్గతంగా ఉన్న సమస్యలన్నింటిపై తనకు పూర్తి అవగాహన ఉందని వాటి పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేశానని ఆమె అన్నారు.
బుధవారం.. తెరపైకి మరో పేరు
ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్ ఇలా ప్రముఖ నటీనటుల పేర్లు తెరపైకి రాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో 'మా' ఎలక్షన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే నటి హేమ సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈసారి ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని అనుకున్నప్పటికీ.. తనకు అండగా నిలిచిన వారందరి కోసం 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నానని ఆమె ప్రకటించారు.
గురువారం.. ప్యానల్ ప్రకటన
అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న తన ప్యానల్‌లోని 27 మంది సభ్యుల పేర్లను నటుడు ప్రకాశ్‌రాజ్ గురువారం మధ్యాహ్నం వెల్లడించారు. 'సిని'మా' బిడ్డలం' అని ప్యానల్‌కు పేరు పెట్టినట్లు తెలిపారు. నటుడు శ్రీకాంత్, జయసుధ, బండ్ల గణేష్, అనసూయ, ప్రగతి, నాగినీడు, సుధీర్, సనా, అనితా చౌదరి, బ్రహ్మాజీ.. తదితరులు తన ప్యానల్ సభ్యులని ఆయన అన్నారు.