తెలంగాణ

telangana

ETV Bharat / sitara

MAA Elections: నాగబాబు మాటలు బాధించాయి

'మా' ఎలక్షన్స్(MAA Elections)​ పోరు రసవత్తరంగా మారింది. మాటల యుద్ధం కూడా మొదలైపోయింది. ఈ క్రమంలోనే 'మా' మసకబారిపోయింది' అంటూ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని అంటూనే తిరిగి కౌంటర్​ వేశారు నటుడు నరేశ్​. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 'మా' ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

MAA Elections
మా ఎలక్షన్స్​

By

Published : Jun 26, 2021, 12:17 PM IST

Updated : Jun 26, 2021, 1:53 PM IST

'మా' మసకబారిపోయింది' అంటూ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధించాయని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు. నాగబాబు తనకు మంచి మిత్రుడని.. 'మా' చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి సినీ పెద్దలందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందించామని నరేశ్‌ తెలిపారు. తన ప్యానల్‌ను పరిచయం చేస్తూ శుక్రవారం నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి కౌంటర్‌గా శనివారం ఉదయం నరేశ్‌ మీడియా ముందుకు వచ్చారు. తాను అధ్యక్షుడిగా 'మా' ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

"నాకు కథలు చెప్పడం అలవాటు లేదు. కాగితాలతో రావడం అలవాటు. ఎవర్నో ధూషించడానికో, ఎవరిపైనో కాలు దువ్వడానికో ఈ సమావేశం పెట్టలేదు. 'మా' అధ్యక్షుడిగా పోటీ చేయమని నన్ను ఎవ్వరూ అడగలేదు. నాకెంతో ఆప్తురాలైన సీనియర్‌ నటి జయసుధకు అండగా ఉండాలని.. 'మా'లో మార్పు తీసుకురావాలని ఎన్నికలకు వెళ్లాను. కానీ గడిచిన ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆ విషయం నన్ను ఎంతో బాధించింది. నువ్వు జీవితంలో అధ్యక్షుడివి కాలేవు అన్నారు. కానీ, ప్రెసిడెంట్‌ అయి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను."

"నరేశ్‌ అంటే ఏమిటో చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను సినిమా వాడిని. సినిమా బిడ్డను. సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుంది. ప్రకాశ్‌రాజ్‌ నాకు మంచి మిత్రుడు. ఎప్పుడో మూడు నెలల క్రితమే నాకు ఫోన్‌ చేసి ఈ ఏడాది ఎన్నికల్లో(MAA Elections) తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పాను. మంచు విష్ణు.. ఇండస్ట్రీ బిడ్డ.. కష్టనష్టాల చూడకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన కూడా ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. 'మా' రాజకీయ వ్యవస్థ కాదు. చిరంజీవి, కృష్ణంరాజు, కృష్ణ వంటి ఎంతోమంది సినీ పెద్దలు.. మెట్టు మెట్టు పేర్చి దీనిని స్థాపించారు. ఇప్పటివరకూ ఉన్న అధ్యక్షులందరూ 'మా' అభివృద్ధి కోసమే ఎంతో కష్టపడి పనిచేశారు"

"శుక్రవారం ప్రకాశ్‌రాజ్.. తన ప్యానల్‌ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మీటింగ్‌ పెట్టడాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ, ప్రస్తుతం జనరల్‌ బాడీలో ఉన్న సభ్యులే తమ పదవీ కాలం ముగియక ముందే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో చేరి.. నిన్న జరిగిన సమావేశంలో కనిపించడం చూసి మేమంతా షాకయ్యాం. అదే సమావేశంలో నటుడు నాగబాబు మాట్లాడుతూ.. 'మా' మసకబారిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఆయన నాకు ఆప్తమిత్రుడు. నేను అధ్యకుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ప్రతి విషయాన్ని సినీ పెద్దలందరికీ ఎప్పటికప్పుడు తెలియజేశాను. అలాంటిది నాగబాబు.. 'మా' మసకబారిపోయిందని వ్యాఖ్యానించడం తప్పు" అని నరేశ్‌ అన్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Jun 26, 2021, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details