మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు(Maa elections 2021)) దగ్గరపడుతున్న వేళ ప్రచారం ఊపందుకుంది. 'మా' మాజీ అధ్యక్షుడు నరేశ్, అధ్యక్ష పదవి పోటీలో ఉన్న మంచు విష్ణుతో కలిసి బుధవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టారు. ఓ మంచి వారసుడిని ఇవ్వడం తన బాధ్యత అని నరేశ్ అన్నారు. అందుకే విష్ణుకు(Maa elections manchu vishnu panel) మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
గతంలో 'మా' మసకబారిందని అంటూ వచ్చిన ఆరోపణలుపై నరేశ్ మరోసారి స్పందించారు. తన హయాంలో 'మా' అభివృద్ధి చెందిందని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి పనులను వివరించారు. అత్యధిక ఓట్లతో తాను గెలిచినట్లు గుర్తుచేశారు.
" 'మా'లో నేను 20 ఏళ్లు కేవలం సాధారణ సభ్యుడిగానే ఉన్నా. జయసుధ పోటీ చేస్తున్నప్పుడు నన్ను వైస్ ప్రెసిడెంట్‌గా చేయమని దివంగత దాసరి నారాయణరావు అడిగితే సరేనన్నాను. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత 'జాయింట్ సెక్రటరీగా చేస్తావా' అన్నారు. ఇక్కడ 'స్థాయి అంటూ ఏం ఉండదండి. ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అయినా పోటీ చేసేందుకు సిద్ధం' అని నేను అన్నాను. 'మా'లో ప్రతి సభ్యుడూ సమానం అనే ఆలోచనతో వచ్చాం. మేం 22 మంది గెలిచాం. కానీ, జయసుధ ఓడిపోయింది. నేను జాయింట్ సెక్రటరీగా గెలిచాను. వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ అయ్యాను. నటులకు సినీ అవకాశాలు, కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేశాను. ఇవన్నీ చరిత్రలో ఓ భాగం. మసకబారుతున్న 'మా'ను వెలుగులోకి తీసుకురావాలని చేసిన ప్రయత్నం అది. 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశాం. కరోనా సమయంలో 900 ప్రాణాలు కాపాడం. 6,330 మందికి ఇన్సురెన్స్ ఇప్పించాం. కోటీ 20 లక్షలకు పైగా ఇన్సురెన్స్ చేశాం. మరణించిన వారి కుటుంబాలకు 3 లక్షలు ఇచ్చాం. మా' రాజకీయ వేదిక కాదు. పదవీ వ్యామోహాలు ఉండకూడదు. కొవిడ్ సమయంలో 'మా'లో రెండు గ్రూపులు మొదలయ్యాయి. వాటిల్లో ఓ బృందం మీడియా వద్దకు వెళ్లి నిందించే ప్రయత్నం చేసింది. కరోనా సమయంలో భవనం కంటే మనుషుల ప్రాణాలకు ప్రాధాన్యతిచ్చాం. మేం చేయాల్సిన మంచి పనులు ఇంకా ఉన్నాయి. 'మా' అధ్యక్షుడిగా సంక్షేమ పథకాలు తీసుకొస్తా అని చెప్పా. 'మా' భవనం కోసం ప్రయత్నం చేశా. దానికి సంబంధించిన ఆధారాలున్నాయి. నా తర్వాత 'మా'కు మంచి అధ్యక్షుడిని అందించడం నా బాధ్యత. పదవి చేపట్టినప్పుడే ఈ విషయం చెప్పాను. ఈ కుర్చీలోకి ఎవరు పడితే వారు వస్తే 'మా' వైభవం కోల్పోతుంది. ప్రకాశ్ రాజ్ నాకు మంచి స్నేహితుడు. మంచు విష్ణు ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటారు. 'మా' అధ్యక్షుడిగా విష్ణు సరైనవాడు. నాది కృష్ణుని పాత్ర. 'మా' కోసం మంచు విష్ణు రథం ఎక్కుతున్నాను. నేను ఇప్పట్లో మళ్లీ పోటీ చేయను."