తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Maa elections 2021: 'మా' ఎన్నికలు.. ఇంతకీ ఎలా జరుగుతాయంటే? - మా ఎలక్షన్ మంచు విష్ణు ప్యానెల్

తెలుగు చిత్రసీమ నటీనటుల సంఘం ఎన్నికలు(MAA Elections)అక్టోబరు 10న (maa elections 2021 date) జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ (maa elections process) ఎలా ఉంటుంది? అధ్యక్షుడిని, కార్యవర్గ సభ్యులను ఎలా ఎన్నుకుంటున్నారు? ఎన్నికైన కార్యవర్గ కర్తవ్యం ఏమిటి? అనే విషయాల గురించే ఈ స్టోరీ.

Maa elections 2021
'మా' ఎన్నికలు

By

Published : Oct 8, 2021, 6:55 PM IST

తెలుగు చిత్రసీమ నటీనటుల సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 10న(maa elections 2021 date) ఎలక్షన్ జరగనుంది. సాధారణ ఎన్నికలను తలపించే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA Elections) అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది? అధ్యక్షుడిని, కార్యవర్గ సభ్యులను ఓటర్లు ఎలా ఎన్నుకుంటారు? (maa elections process) అసోసియేషన్​లో ఉన్న ఒక్కో సభ్యుడు ఎన్ని ఓట్లు వేయాలి? అగ్రహీరోలు తప్ప మిగిలిన వారెందుకు మా ఎన్నికల్లో ఓటింగ్​కు దూరంగా ఉంటున్నారు. 'మా'లో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

'మా' కార్యవర్గం..

రెండేళ్లకు ఓసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​(Movie Artist Association)లో కార్యవర్గం మారుతూ ఉంటుంది. అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్​ ప్రెసిడెంట్​, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతో పాటు ట్రెజరర్, 18 మంది ఈసీ మెంబర్లతో కలిపి మొత్తం 26 మందితో అసోసియేషన్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంటుంది. వీరందరిని ఎన్నుకునేందుకు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

'మా'లో ఓటింగ్​ ఇలా!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​లో ఓటింగ్ విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఓటరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. పోటీ పడుతున్న ప్యానెల్ సభ్యుల్లో తమకు నచ్చిన అధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుడు, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ, ఈసీ సభ్యులకు ఓటు వేయాలి. ఒక్కో ఓటరు 26 ఓట్లు వేయాలి. ఓటింగ్ ప్రక్రియలో ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి ఏ ప్యానెల్​లో ఉన్నాడు, ఏ పదవికి పోటీ చేస్తున్నాడో చూసి ఓటు వేయాలి. ఈ క్రమంలో రెండు ప్యానెల్స్ మధ్య పోటీ జరిగితే ఓటరు ఎలాంటి గందరగోళం ఉండదు. రెండు కంటే ఎక్కువ ప్యానెల్స్ పోటీ చేస్తే ఓటరు గందరగోళంలో పడతారు. అయితే 2015లో అసోసియేషన్ ఎన్నికలను ప్రయోగాత్మకంగా ఈవీఎంల ద్వారా నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తున్నారు.

.

'మా' అధ్యక్షుడు గెలిచేదిలా..

'మా' అసోసియేషన్​లో 26 మంది కార్యవర్గ సభ్యుల కోసం జరిగే ఓటింగ్​లో ఒక్కో ఓటరు 26 ఓట్లు వేయాలి. మొత్తం పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అధ్యక్షుడైనా, ఈసీ సభ్యుడైనా ఇదే నిబంధన వర్తిస్తుంది. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంటుంది. ఎన్నికల్లో రెండు వేరు వేరు ప్యానెల్స్​​లో ఉండి పోటీ చేసిన అభ్యర్థులు గెలిచాక ఒకే ప్యానెల్​గా మారుతారు. అధ్యక్షుడిగా ఎవరైతే విజేతగా నిలుస్తారో తన ఆధ్వర్యంలో మిగతా 23 మంది పనిచేయాల్సి ఉంటుంది. పూర్తిగా ఒకే ప్యానెల్ విజయం సాధించడానికి ఈ ఎన్నికల్లో ఆస్కారం లేదు. ఈ క్రమంలోనే ప్యానెల్ సభ్యుల మధ్య విబేధాలు, ఈగోలు కారణంగా తరుచూ మా అసోసియేషన్ వివాదాస్పదంగా మారుతోంది.

2015లో ఇలా జరిగింది

2015లో సాధారణ ఎన్నికలను తలపించేలా నటకిరిటీ రాజేంద్రప్రసాద్, సహజ నటి జయసుధ మధ్య జరిగిన పోటీలో రాజేంద్రప్రసాద్ 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 702 మంది సభ్యుల్లో 394 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఫలితాల వెల్లడికి కోర్టు స్టే ఇచ్చింది. మూడు రోజుల తర్వాత వెలువడిన ఫలితాల్లో రాజేంద్రప్రసాద్ కు 237 ఓట్లు రాగా జయసుధ 152 ఓట్లు సాధించారు. 85 ఓట్ల మెజార్టీతో 2015లో 'మా' అధ్యక్ష పీఠాన్ని రాజేంద్రప్రసాద్ కైవసం చేసుకున్నారు.

2017లో ఏకగ్రీవం

2017-19 'మా' అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 783 మంది అసోసియేషన్ సభ్యులు శివాజీరాజాను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీగా నరేశ్​, జాయింట్ సెక్రటరీగా హేమ, ఏడిద శ్రీరామ్​లు కూడా ఏకగ్రీవంగానే పనిచేశారు.

2019లో మళ్లీ పోటీ

'మా' అసోసియేషన్ లో మళ్లీ ఎలాంటి విబేధాలుండవని భావించిన సినీ పరిశ్రమకు 2019-2021 ఎన్నికలు తారస్థాయికి చేరాయి. గతంలో ఒకే ప్యానెల్​లో పనిచేసిన శివాజీరాజా, నరేశ్​లు అధ్యక్ష పదవికి కోసం పోటీపడ్డారు. అసోసియేషన్ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకునే స్థాయికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 745 మంది సభ్యుల్లో 472 మంది సభ్యులు ఓటు హక్కు నియోగించుకున్నారు. శివాజీరాజా 199 ఓట్లు రాగా నరేశ్​కు 268 ఓట్లు వచ్చాయి. 69 ఓట్ల మెజార్టీతో నరేశ్​ 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

2021లో ఏం జరగబోతుంది

గతంలో మాదిరిగానే మళ్లీ ఈసారి 'మా' అసోసియేషన్​లో ఎన్నికల హడావుడిగా మారింది. ఆరేళ్లుగా మార్చిలోనే ఎన్నికలు నిర్వహించిన అసోసియేషన్.. ఆడిట్ సమస్యలు, కరోనా కారణంగా అక్టోబరుకు మార్చింది. ప్రస్తుతం అసోసియేషన్​లో అధికారిక లెక్కల ప్రకారం 914 మంది సభ్యులుండగా వారిలో కొంతమంది మరణించారు. మరణించిన వారి ఓట్లను తొలగిస్తే ఇంకా ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

కొత్తగా 87 మందికి సభ్యత్వం

దక్షిణాది నటీనటుల సంఘంలో పెద్ద సంఖ్యలో సభ్యులున్న 'మా' అసోసియేషన్ ఓటింగ్ విషయంలో మాత్రం వెనకబడిపోతుంది. అసోసియేషన్​కు ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటింగ్ సగం కూడా జరగడం లేదు. 2015లో కేవలం 394 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో ఓటర్లలో స్ఫూర్తి నింపడం సహా 'మా' అసోసియేషన్​పై గౌరవంతో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి అగ్రహీరోలు వచ్చి ఓటు వేయడం వల్ల ఓటింగ్ శాతం కొంత పెరిగింది. 472 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి కూడా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండటం వల్ల ఓటింగ్ శాతం పెంచాలని భావించారు.

నరేశ్​ కార్యవర్గం తన కాలపరిమితిలో 87 మంది నటీనటులకు కొత్తగా మెంబర్ షిప్ ఇచ్చారు. సభ్యుల సంఖ్యను పెంచేందుకు సభ్యత్వ రుసుములో రాయితీ కూడా ప్రకటించారు. లక్ష రూపాయలున్న సభ్యత్వ రుసుమును అప్పటికప్పుడు చెల్లిస్తే 10 వేల రూపాయల రాయితీ కూడా ఇవ్వడం విశేషం. అలాగే లక్ష రూపాయలను నాలుగు విడుతలుగా కట్టే సదుపాయాన్ని కూడా కల్పించారు. అయితే లక్ష రూపాయల సభ్యత్వ రుసుము కూడా అసోసియేషన్​లో వివాదాలకు దారి తీసింది. చిన్న నటీనటులు, పేద కళాకారులు అంత ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​కు దూరమవుతున్నారని గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన నాగబాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఈ సారి అసోసియేషన్​లో సభ్యుల సంఖ్య పెరగడం, సినీ పెద్దలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుండటం వల్ల యువ హీరోలూ ముందుకు వచ్చి ఓటు వేస్తారని పోటీ చేస్తున్న అభ్యర్థులు భావిస్తున్నారు.

'మా' ఎన్నికల్లో గెలిస్తే..

మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్ష కార్యదర్శులతోపాటు కార్యవర్గ సభ్యులంతా సభ్యుల సంక్షేమం, ఆరోగ్యం కోసం పనిచేయాల్సి ఉంటుంది. గత పాలకవర్గం చేపట్టి పనులను కొనసాగిస్తూనే వాటిని మరింత సమర్థవంతంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. సభ్యుల పింఛన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ లతోపాటు సభ్యుడు ఎవరైనా చనిపోతే అతని కుటుంబానికి రావల్సిన జీవిత బీమా సొమ్మును దగ్గరుండి ఇప్పించాలి. అలాగే ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు సభ్యులకు అందుతున్నాయో లేదో చూడాలి. సభ్యులకు సినిమాలో అవకాశాలు కల్పించడం కూడా కార్యవర్గం బాధ్యతల్లో ప్రధానమైనది.

మంచు విష్ణు- ప్రకాశ్​రాజ్

సభ్యుల సంక్షేమంతోపాటు సినీ పరిశ్రమలో నటీనటులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడం, నిర్మాత మండలి, దర్శకుల సంఘంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం, ఇతర భాష నటీనటుల సంఘాలతో అభిప్రాయబేధాలు లేకుండా చూసుకోవడం 'మా' అసోసియేషన్ కార్యవర్గం చేసే పనులు. అసోసియేషన్​కు నిధులు సమీకరించేందుకు వినోద కార్యక్రమాలు చేపట్టడం కూడా కార్యవర్గం బాధ్యతల్లో ఒకటి. వీటి కోసం అసోసియేషన్ కో-ఆర్డినేషన్ కమిటీ, వెల్ఫేర్ కమిటీ, యాక్టివిటీస్ కమిటీ, ఫండ్ రైజింగ్ కమిటీ, విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ఉండే సభ్యులంతా వారి వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎలాంటి వివాదాలకు తావులేకుండా అసోసియేషన్​ను రెండేళ్లపాటు విజయవంతంగా కొనసాగించాలి.

ABOUT THE AUTHOR

...view details