కొత్త అసోసియేషన్ మొదలు పెట్టే ఆలోచన ఏదీ లేదని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ప్యానెల్ నుంచి గెలిచిన 11మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 'ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఆత్మ)' పేరుతో కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.
కొత్త అసోసియేషన్ 'ఆత్మ' ఏర్పాటుపై ప్రకాశ్ రాజ్ స్పష్టత - MAA Elections
'మా' ఎన్నికల్లో గెలుపొందిన తమ ప్యానల్ సభ్యుల రాజీనామా ప్రకటించిన వేళ కొత్త అసోసియేషన్ ఏర్పాటు వార్తలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. 'ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఆత్మ)' పేరుతో అసోసియేషన్‌ను ఏర్పాటు చేయనున్నారనే వార్తలను ఆయన కొట్టిపారేశారు. 'ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ వంటి అసోసియేషన్లను ఏర్పాటు చేసే ఆలోచనే లేద'ని తేల్చిచెప్పారు.
"ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ అని ఏదో మొదలు పెడతామని వార్తలు వచ్చాయి. అలాంటి ఆలోచన లేదు. 'మా' అసోసియేషన్ సమస్యలపై స్పందించటానికే నేను వచ్చాను. అవసరమైతే 'మా'లో ఉన్న వాళ్లతో కలిసి పనిచేస్తాం కానీ, మేమేదో 10మందిని తీసుకుని కొత్త అసోసియేషన్ పెట్టే ఆలోచన లేదు. రెండు వేర్వేరు ప్యానెల్స్‌లో గెలిచిన వాళ్లు పనిచేసే వాతావరణం లేదనే ఉద్దేశంతోనే 'మా' ప్యానెల్ సభ్యులు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అది వాళ్ల నిర్ణయమే. ఓడినా, గెలిచినా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ప్రతినెలా విష్ణు ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతా. మీరు చేసే పనిలో మేం అడ్డుపడం. కానీ, పనిచేయకపోతే తప్పకుండా ప్రశ్నిస్తాం" అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.
ఇదీ చూడండి..'మోహన్‌బాబు మమ్మల్ని బూతులు తిట్టారు'.. బెనర్జీ, తనీశ్ ఆవేదన