ఒక కుటుంబంలో జరిగే ఎన్నికల్లో ప్రతి విషయాన్ని తీసుకొచ్చి.. ప్రకాశ్‌రాజ్ మీడియా ముందు పెడుతున్నారని, ప్రతి దానికీ తీవ్రంగా స్పందిస్తున్నారని మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు ఆరోపించారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం ప్రకాశ్ చెప్పిన ప్రతి అంశానికీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
"మా'లో 60 ఏళ్లు పైబడిన వారు 180 మందికి పైగా ఉన్నారు. చాలామంది పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేస్తామని అన్నారు. కొందరు పెద్దలు పోస్టల్ బ్యాలెట్ కావాలని అడిగారు. పెద్దా, చిన్నా చూడకుండా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతున్నారు. రియల్ లైఫ్‌లోనూ ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ వద్దని 'మా'కు లేఖ రాశా. 'మా' ప్యానెల్ సభ్యులు పేపర్ బ్యాలెట్‌కు వెళ్దామన్నారు. పేపర్ బ్యాలెట్‌ను పలుసార్లు లెక్కించేందుకు అవకాశం ఉంది. 'మా' లో 160 కిపైగా 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. వారిలో 100 మంది నేరుగా వచ్చి ఓటు వేస్తామన్నారు. పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్లు పోస్టల్ బ్యాలెట్ వైపే ఆసక్తి చూపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం నేనే ఒక లెటర్ తయారుచేశా. పోస్టల్ బ్యాలెట్ కోసం రూ.500 కట్టమని ఎన్నికల అధికారి మెసేజ్ చేశారు. నేను 400 ఓట్ల మెజార్టీతో లేదా ఒక్క ఓటు మెజార్టీతో గెలవచ్చు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో అన్ని లీగల్ గానే జరిగాయి. చెన్నైలో ఉన్న శరత్ బాబుకు నేనూ ఫోన్ చేశా. చెన్నైలో ఉండగా మా నాన్నగారు శరత్ బాబు రూమ్ మేట్స్. కృష్ణగారిని అవమానిస్తారా? పెద్దలను గౌరవించకపోతే సర్వనాశనం అవుతారు. పరిచూరి బ్రదర్స్ వాళ్ల డబ్బు వాళ్లే కట్టుకున్నారు."