ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన బెనర్జీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 'మా' ఎన్నికల్లో జరిగిన పరిణామాలను వెల్లడిస్తూ కంటతడి పెట్టుకున్నారు. సీనియర్ నటుడు మోహన్‌బాబు.. తనతో పాటు హీరో తనీశ్‌ను దూషించినట్లు వెల్లడించారు.
"నేను గెలిచిన తర్వాత అభినందనలు చెబుతున్నా, నాకు సంతోషంగా లేదు. ఎన్నికల్లో దూరంగా నిలబడ్డాను. ఒకవైపు మోహన్‌బాబుగారు తనీశ్‌ను తిడుతున్నారు. నేను విష్ణు దగ్గరకు వెళ్లి 'గొడవలు వద్దు నాన్నా' అని అన్నాను. అది విన్న మోహన్‌బాబుగారు కొట్టడానికి వచ్చేశారు. విష్ణుబాబు ఆయన్ను అడ్డుకుని నన్ను పక్కకు లాగేశారు. అసభ్య పదజాలంతో మోహన్‌బాబు తిట్టిపోశారు. ఆయన అన్న మాటలకు షాక్‌లోకి వెళ్లిపోయా. మోహన్‌బాబుగారికి వివాహం కాకముందు నుంచి ఒక ఇంటి సభ్యుల్లా ఉండేవాళ్లం. వాళ్ల ఇంటికి వెళ్తే, మంచు లక్ష్మీను, విష్ణును ఎత్తుకుని తిరిగేవాడిని. అలాంటి నన్ను పట్టుకుని మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు, మనోజ్‌లు వచ్చి 'సారీ అంకుల్ ఏమీ అనుకోవద్దు. మీరు కూడా ఏమీ అనొద్దు' అని సముదాయించే ప్రయత్నం చేశారు. నాకు నా తల్లే సర్వస్వం, ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది. రేపు కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు వారికి భయపడి మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్లకి భయపడుతూ ఉండటం కంటే రాజీనామా చేయటం మంచిది."