తెలంగాణ

telangana

ETV Bharat / sitara

MAA elections 2021: 'మా' కొత్త అధ్యక్షుడు ఎవరు? - మా ఎలక్షన్ లైవ్

మరికొన్ని గంటల్లో 'మా' కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోనుంది. ఆదివారం ఉదయం ఎన్నికలు జరగనుండగా, రాత్రికి విజేతను ప్రకటించనున్నారు.

maa election 2021
మా ఎలక్షన్

By

Published : Oct 9, 2021, 4:34 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ఆదివారంతో తెరపడనుంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ అసోసియేషన్ ఎన్నికల్లో ఈసారి అధ్యక్ష బరిలో ప్రకాశ్​రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్నారు. సభ్యుల సంక్షేమం, భవన నిర్మాణమే లక్ష్యంగా 6 నెలల ముందే ప్రకాశ్ రాజ్ పోటీలోకి దిగగా.. సభ్యులకు అవకాశాలు కల్పించడం సహా తెలుగు నటీనటుల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని మంచు విష్ణు ఎదురొచ్చారు. ఇద్దరు కూడా విమర్శలు, ఆరోపణలతో మా ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. సాధారణ ఎన్నికలను తలపించేలా మాటల యుద్ధం సాగించారు. విష్ణు సీనియర్ నటీనటుల మద్దతు కూడగట్టుకోగా.. ప్రకాశ్​రాజ్ మెగా కుటుంబంపై ఆశలు పెట్టుకున్నారు. ఇలా హోరాహోరీగా జరుగుతున్న పోరులో మా అధ్యక్షుడు ఎవరనేది ఆదివారం రాత్రి 8 గంటల్లోపు తేలిపోనుంది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ ఎలక్షన్

ప్రతి రెండేళ్లకోసారి 26 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనే మాలో... 2021-23 సంవత్సరానికి ఆదివారం(అక్టోబరు 10) హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్​లో పోలింగ్ జరగనుంది. అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు ప్రకాశ్​రాజ్​తోపాటు మోహన్​బాబు తనయుడు మంచు విష్ణు పోటీపడుతున్నారు. ఈ రెండు ప్యానల్స్ నుంచి మొత్తం 54 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అసోసియేషన్ లో మొత్తం 925 మంది సభ్యులుండగా వారిలో కొందరు మరణించారు. వారి ఓట్లను తొలగిస్తే 883 మంది సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. అయితే అందులో సుమారు 500కుపైగా సభ్యులు ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కూడా కల్పించడం వల్ల 60 ఏళ్లకు పైబడిన సభ్యులు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సుమారు 60 మందికిపైగా సీనియర్ నటీనటులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 25 ఏళ్ల చరిత్రలో గత ఆరేళ్ల నుంచి అధ్యక్ష పదవికి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈసారి కూడా మా ఎన్నికలు మాటల యుద్ధాన్ని తలపించాయి. మంచు విష్ణు, ప్రకాశ్​రాజ్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నువ్వా నేనా అన్నట్లు బరిలోకి దిగారు. మా అసోసియేషన్​కు తెలుగు నటీనటులే అధ్యక్షుడిగా ఉండాలన్న వాదనతో కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ సహా పలువురు సీనియర్ల మద్దతును మంచు విష్ణు కూడకట్టుకున్నారు. తెలుగు నటీనటుల ఆత్మగౌరవ నినాదంతో చిత్రపురి కాలనీ, కృష్ణానగర్, మణికొండ సహా పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి సభ్యులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. విష్ణుకు తోడుగా సీనియర్ నటుడు నరేశ్ రంగంలోకి దిగి ప్రత్యర్థి ప్రకాశ్​రాజ్ పై విమర్శలు గుప్పిస్తూ విష్ణును గెలిపించాలని పిలుపునిచ్చారు. మోహన్​బాబు సైతం రంగంలోకి దిగి.. 'మా' కుటుంబంలో సభ్యుడైన తన కుమారుడ్ని గెలిపించాలని కోరారు. స్వయంగా సభ్యులకు ఫోన్ చేసి విష్ణును గెలిపించాలని అభ్యర్థించారు.

మా ఎన్నికలు

మరోవైపు ఎన్నికలకు 6 నెలల ముందే రంగంలోకి దిగిన ప్రకాశ్ రాజ్.. మెగా కుటుంబం మద్దతుతో అధ్యక్షుడిగా నిలబడ్డారు. జీవిత రాజశేఖర్, శ్రీకాంత్, బెనర్జీ లాంటి అనుభవం ఉన్న నటీనటులతో ప్యానెల్ సిద్ధం చేసుకున్నారు. మా ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణాలను నటీనటులను ఆహ్వానించి వివరించారు. అసోసియేషన్​కు నూతన భవనంతోపాటు సభ్యుల ఆరోగ్యం, విద్య, వైద్యంపై తనకున్న ఆలోచనలను పంచుకున్నారు. తెలుగువాళ్లే అధ్యక్షుడిగా ఉండాలన్న విమర్శలను ప్రకాశ్​రాజ్ తిప్పికొట్టారు. చిరంజీవి సోదరుడు నాగబాబు సహా మరికొంత మంది నటీనటులు ప్రకాశ్​రాజ్​కు మద్దతుగా నిలబడ్డారు.

ఇలా ఈ ఇద్దరి మధ్య సుమారు 3 నెలల నుంచి జరుగుతున్న మాటల యుద్ధం మరికొన్ని గంటల్లో తెరపడబోతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో పోలింగ్ జరగనుంది. 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​కు నూతన అధ్యక్షుడు ఎవరనేది తేల్చనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details