తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఊహల నుంచి పాట.. ఊపిరి నుంచే మాట! - వనమాలి అరణ్య

ఇన్నాళ్లు గేయరచయితగా తెలుగు ప్రేక్షకులను అలరించిన వనమాలి.. 'అరణ్య' చిత్రంతో తొలిసారి మాటల రచయితగా మారారు. ఈ కొత్త బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత పాటల కంటే మాటలు రాయడమే కష్టమని అభిప్రాయపడ్డారు. రానా ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం (మార్చి 26)న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా వనమాలి 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

lyricist vanamali turned to writer for Aranya movie
ఊహల నుంచి పాట.. ఊపిరి నుంచే మాట!

By

Published : Mar 25, 2021, 8:23 AM IST

వనమాలి.. ఇన్నాళ్లూ ఓ గీత రచయిగానే పరిచయం. కానీ తొలిసారి ఆయన మాటల రచయితగా మారారు. వెయ్యికిపైగా గీతాలు రాసిన వనమాలి.. 'అరణ్య' కోసం కొత్త బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు. రానా హీరోగా నటించిన ఆ చిత్రం ఈ శుక్రవారం (మార్చి 26) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వనమాలి 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ..

'అరణ్య'తో మీ ప్రయాణం ఎలా మొదలైంది?

నేనింత వరకూ పాటలే రాశాను. ఏ చిత్రానికీ మాటలు రాయలేదు. ఆశ్చర్యంగా 'అరణ్య' మాటల కోసమే నన్ను సంప్రదించారు. దర్శకులు ప్రభు సాల్మన్‌ చెన్నై నుంచి వచ్చి నాతో మాట్లాడారు. నాకు తమిళం తెలియడం ఆయనకు బాగా నచ్చిన విషయం. ముందు నాకు రెండు సన్నివేశాలిచ్చారు. వాటికి సంభాషణలు రాసి పంపించాక అవి ఆయనకు నచ్చడం వల్ల మాటలు రాసే బాధ్యతను నాకు అప్పజెప్పారు. మాటలే కాదు.. ఈ చిత్రంలో అన్ని పాటలూ నేనే రాశాను. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి 'అరణ్య' పేరు కూడా నేను సూచించిందే!

తొలిసారి మాటలు రాశారు కదా. ఆ అనుభవాన్ని పంచుకుంటారా?

పాటలైతే బాణీ వింటూ రాస్తుంటా. సంగీతానికి సంబంధించిన కళ కాబట్టి అంత ఒత్తిడి ఉండదు. ఇన్నాళ్లూ సినిమాల్లో పాత్రలు మాటలు చెబుతుంటే.. ఇంతే కదా అనిపించేది. కానీ ఈ సినిమాకు రాస్తున్నప్పుడు మాటలు రాయడంలో ఉన్న కష్టం ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. కాకపోతే అంతకు ముందు పత్రికల్లో కథలు రాసిన అనుభవం ఉంది కాబట్టి ఆ కష్టాన్ని దాటగలిగాను. పాట రాయడంలో ఉన్న స్వేచ్ఛ మాటలు రాయడంలో ఉండదని గమనించా. పాట ఊహల్లోంచి రావచ్చు. కానీ మాట జనాల ఊపిరిలోంచి రావాలి. బతుకుల్లోంచి రావాలి. మాట రాసే వాడికి బాధ్యత ఎక్కువ.

ప్రస్తుతం ఏయే చిత్రాలకు పాటలు రాస్తున్నారు?

మణిరత్నం నిర్మాణంలో తెరకెక్కుతోన్న 'నవరస' అనే చిత్రానికి పాటలు రాస్తున్నాను. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య నటిస్తున్నారు. మరోవైపు ఓ కొత్త చిత్రానికి సంభాషణలు రాస్తున్నాను. కపిల్‌ అనే యువ సంగీత దర్శకుడి స్వరకల్పనలోని రెండు చిత్రాలకు పాటలు రాస్తున్నాను. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఓ చిత్రం, దిల్‌ రాజు నిర్మించే మరో చిత్రంలోనూ పాటలు రాయాల్సి ఉంది.

ఇదీ చూడండి:'ఆ హీరోల కథే.. 'వైల్డ్​ డాగ్​!"

ABOUT THE AUTHOR

...view details