పదేళ్లకిందటి మాట. ఓ ఛానెల్‌లో జానపద పాటల పోటీ జరుగుతుంటే నేను న్యాయనిర్ణేతగా వెళ్లాను. అప్పుడు కోమల అనే గాయని 'దాని కుడిభుజం మీద కడవా..' అంటూ గొంతెత్తగానే నా మనసు నిండా అమ్మ జ్ఞాపకాలు ముసురుకున్నాయి. ఎందుకంటే, నా చిన్నప్పుడు అమ్మ నోట విన్న పాట అది. ఛానల్ షూటింగ్ తర్వాత ఆ అమ్మాయిని ఈ పాట గురించి అడిగితే 'మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా సార్!' అని చెప్పింది. అప్పుడే ఆమెకి మాటిచ్చాను 'నాకెప్పుడైనా అవకాశం చిక్కితే ఈ పాటని పెద్ద స్థాయికి తీసుకెళ్తానమ్మా!' అని. ఆ మాటని నిలుపుకోవడానికి నాకు పదేళ్లు పట్టింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 'సారంగ దరియా..' అనే ఈ తీర్థాన్ని శేఖర్ కమ్ముల అనే శంఖం వెతుక్కుంటూ వచ్చింది.
అలాగే వద్దు..
శేఖర్ కమ్ముల యూట్యూబ్‌లో ఎక్కడో సారంగదరియా పాట విన్నారట. తన కొత్త చిత్రం 'లవ్‌స్టోరీ' కోసం ఆ పాటే కావాలన్నారు నాతో. ఆ జానపదపాటను యథాతథంగా వాడుకోవచ్చు కానీ.. ఇందులో తన కథానాయిక గుణగణాలనీ చెప్పాలనుకున్నారు. ఏమిటా గుణాలూ అంటే.. నిర్భయం, ఆత్మగౌరవం, దానికి భంగం కలిగిస్తే ఉప్పొంగే అహం. ఈ మూడూ కలగలిసిన అమ్మాయిల్లో ఓ సౌందర్యం ఉంటుంది. లోలోన ఆత్మీయతా దాగి ఉంటుంది. తన పాటలో ఇవన్నీ కావాలన్నారు శేఖర్ కమ్ముల.
అందుకే ఈ జానపదంలో ఎక్కడా నా పాండిత్య ప్రకర్ష ఉండకూడదని గిరిగీసుకున్నాను. నాలోకి అమాయకపు తెలంగాణ పల్లెటూరివాళ్లను ఆవాహన చేసుకున్నాను. జానపద పాటకు పల్లవే ప్రాణం.. అది వేదంలాంటిదీ వాల్మీకి శ్లోకంలాంటిదీ కాబట్టి మార్చవద్దని అనుకున్నాను. ఓ పల్లెటూరి అక్షరశిల్పి అడవిలో కొమ్మని కొట్టి చెక్కిన బొమ్మలాంటి ఆ పాటను అమ్మవారిగా మార్చి గుడిలో ప్రతిష్ఠించాలనుకున్నాను!