కరోనా కారణంగా దేశమంతటా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. నిద్రాహారాలు మాని మండుటెండలో విధులు నిర్వహిస్తూ, ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు శ్రమిస్తున్నారు. జనం కోసం పోలీసులు పడుతున్న కష్టాన్ని పాటగా మలిచారు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్.
"ఈ కరోనా కష్ట కాలంలో పోలీసుల విధి నిర్వహణ విధానం చాలా గొప్పగా ఉంది. చాలా మంది ప్రజలు వారికి సహకరిస్తున్నారు. కొంతమంది అడ్డు తగులుతున్నారు. ఈ అంశంపై పాట రాయమని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌గారు నన్ను అడిగారు. బాధ్యతతో రాసిన ఆ పాట.." అంటూ ట్విట్టర్ వేదికగా ఆ పాటను స్వయంగా ఆలపించి అభిమానులతో పంచుకున్నారు.
"ఆలోచించండి అన్నలారా.. ఆవేశం మానుకోండి తమ్ముళ్లారా.." అంటూ సాగిన గీతం ప్రజల కోసం పోలీసులు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తోంది. దీనిపై అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు. "కరోనా నుంచి మనల్ని కాపాడేందుకు పోలీసులు వారి జీవితాలను పణంగా పెట్టి ముందుండి పోరాటం చేస్తున్నారు. దయచేసి వారికి సహకరిద్దాం. చంద్రబోస్ రాసి, ఆలపించిన పాట ఆలోచింపజేసేలా ఉంది" అంటూ ట్వీట్ చేశారు.
"ఆలోచించండి అన్నలారా
ఆవేశం మానుకోండి తమ్ముళ్లారా
రక్షించే పోలీసుని రాళ్లతో కొడతారా
ప్రాణాలర్పించే పోలీసుని పగవాడిగ చూస్తారా..
మంచి చేయబోతే ఆ చెయ్యిని నరికేస్తారా
అమ్మలాగ ఆదరిస్తే మొహాన ఉమ్మేస్తారా
ఆలోచించండి అన్నలారా