మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్- దర్శకుడు శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. చెర్రీ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అయితే తాజా పరిణామాలతో ఆ సినిమా ప్రారంభం అవ్వడం అనుమానంగానే కనిపిస్తోంది. శంకర్ మొదలుపెట్టిన 'భారతీయుడు 2' షూటింగ్ పూర్తి చేయకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది.
కరోనా సంక్షోభానికి ముందు కమల్ హాసన్ ప్రధానపాత్రలో 'భారతీయుడు 2' షూటింగ్ ప్రారంభించారు. అయితే చిత్రీకరణ సమయంలో లైటింగ్ క్రేన్ కూలిపోయి ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతి చెందారు. ఈ ఘటనతో 'భారతీయుడు 2' షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా సంక్షోభం.. కమల్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల చిత్రీకరణ తిరిగి ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌తో సినిమా చేసేందుకు దర్శకుడు శంకర్ ముందుకొచ్చారు. దీంతో శంకర్‌పై సదరు నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసింది. ఆగిపోయిన షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రాజెక్టులు చేసుకోవాలని డిమాండ్ చేసిందట.