థియేటర్ల మూసివేత కారణంగా భారీ చిత్రాలు కూడా ఓటీటీ బాట పడుతున్నాయి. ప్రేక్షకుల నుంచి అదే స్థాయి ఆదరణ ఉండటం వల్ల స్టార్ హీరోలు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్ వేదికల వైపు చూడక తప్పట్లేదు. ఈ శుక్రవారం ధనుష్ సినిమా నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదలైంది. దీంతో సినీ వర్గాల్లో సందడి మొదలైంది. 'జగమే తంత్రం'తో పాటు ఈ వారాంతంలో వచ్చే సినిమా జాబితా మీకోసం.
జగమే తందిరమ్( జగమే తంత్రం): నెట్‌ఫ్లిక్స్
గతకొద్ది రోజులుగా ప్రేక్షకులను, ధనుష్ అభిమానులను ఊరిస్తున్న చిత్రం జగమే తందిరమ్(తెలుగులో జగమే తంత్రం). ఎట్టకేలకు శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న భారీ చిత్రాల్లో ఇదొకటి. ధనుష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. 'పేట'లో రజనీకాంత్‌ను స్టైలిష్‌గా చూపించిన కార్తిక్ సుబ్బరాజ్ దీన్ని తెరకెక్కించారు. 'పుదుపెట్టై', 'వడచెన్నై', 'మారి' లాంటి సినిమాల్లో లోకల్ డాన్‌గా నటించి మెప్పించిన ధనుష్. ఇందులో ఇంటర్నేషనల్ డాన్‌గా నటించారు. లండన్ వీధుల్లో చెలరేగిపోయే తమిళ డాన్‌గా ధనుష్ అలరించనున్నారు. ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. సంతోష్ నారాయణ్ అందించిన మాస్‌బీట్లు అభిమానులను విశేషంగా అలరించాయి. సినిమా ఏకంగా 17 భాషల్లో 190 దేశాలకు పైగా దేశాల్లో విడుదల అవుతుండటం విశేషం.
షేర్ని : అమెజాన్ ప్రైమ్
'కహాని', 'బేగం జాన్', 'శకుంతల దేవి' లాంటి వైవిధ్యమిన చిత్రాలతో మెప్పించిన నటి విద్యాబాలన్. మరోసారి అలాంటి ప్రయత్నమే 'షేర్ని'తో చేసింది. మనిషి రక్తాన్ని మరిగిన ఓ పులిని పట్టుకునే ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో ఆమె నటించింది. 'షేర్ని' కూడా ఈ శుక్రవారమే విడుదలైంది. 'న్యూటన్' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అమిత్ మసుర్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మనిషి- జంతువుల మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంతో ఈ సినిమా తీశారు. ఈ రెండింటి ఘర్షణలో విద్యాబాలన్ పులిని పట్టుకుందా? లేదా? తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న 'షేర్ని' చూసేయాల్సిందే.
ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ : ఆహా
'బాషా' లాంటి బ్లాక్‌బస్టర్‌ను తీసిన దర్శకుడు సురేష్ కృష్ణ. ఆయన నిర్మాతగా మారి తెలుగులో 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌ను అందిస్తున్నారు. ఆహాలో శుక్రవారం విడుదలైంది. ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్నాడు. బిగ్‌బాస్ ఫేమ్ నందిత రాయ్ హీరోయిన్. ట్రైలర్‌తోనే ఆ వెబ్ సిరీస్ సరికొత్తగా కనిపించనుందని తెలిసిపోతుంది. స్వేచ్ఛ, ప్రేమ, దురాశ, కామం, అందం చుట్టూ అల్లుకున్న ఈ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను రక్తికట్టించేందుకు సిద్ధమైంది.
లూకా : డిస్నీ హాట్‌స్టార్
'కోకో', 'ఇన్‌సైడ్ ఔట్', 'టాయ్‌స్టోరీ', 'సోల్' లాంటి అత్యద్భుత యానిమేషన్ చిత్రాలను అందించింది పిక్సర్. ఇప్పుడు మరో అందమైన చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. పిక్సర్ నిర్మించిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా మన దేశంలో విడుదలవుతోంది. సముద్రంలో పుట్టి పెరిగిన జీవి లూకా. నీటిలో చేపగా, భూమ్మీదకు రాగానే మనిషిగా మారిపోయే లూకా అనే బాలుడి కథ ఇది. ఇటలీలోని ఓ తీర ప్రాంతంలో జరిగే ఫాంటసీ చిత్రంగా దీన్ని రూపొందించారు. భూమ్మీదకు వచ్చాక లూకా ఎలాంటి అనుభవాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో సరదాగా సాగిపోతుంది. శుక్రవారమే ఈ సినిమా విడుదలైంది.
ఫాదర్‌హుడ్ : నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతున్న హాలీవుడ్ చిత్రం 'ఫాదర్‌హుడ్'. కూతురును ఒంటరిగా పెంచే తండ్రి కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఆ పసిపాపను పెంచే క్రమంలో ఆ తండ్రి ఎదుర్కొనే కష్టాలు ఎలాంటివి? అతడి ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్న 'ఫాదర్‌హుడ్'ను తీరాల్సిందే. 'జుమాంజి', 'ది అప్‌సైడ్' లాంటి చిత్రాల్లో నటించిన హాస్యనటుడు కెవిన్ హార్ట్ ఇందులో తండ్రిగా నటిస్తున్నాడు.
ఈ వారాంతంలో విడుదల అవుతున్న మరికొన్ని చిత్రాలు
- ఖ్వాబోంకే పరిందే(వూట్)
- మనిషి( స్పార్క్ ఓటీటీ)
- బ్లాక్ సమ్మర్ సీజన్ 2( నెట్‌ఫ్లిక్స్)
- ఏ ఫ్యామిలీ( నెట్‌ఫ్లిక్స్)
- ఫిజికల్ (ఆపిల్ టీవీ ప్లస్)
- ది అడ్వంచర్స్ ఆఫ్ వూల్ఫ్‌బాయ్(బుక్ మై షో స్ర్టీమ్)
- అఫిషియల్ సీక్రెట్స్(బుక్ మై షో స్ర్టీమ్)
- ది రేషనల్ లైఫ్(నెట్‌ఫ్లిక్స్)
- ఎలైట్ సీజన్ 4 (నెట్‌ఫ్లిక్స్)
- ఇన్ ది హైట్స్ (హెబీవో మ్యాక్స్)
- కాయంకులం కొచ్చున్ని(మలయాళం) జియో సినిమా
- కమ్మర సంభవం (జియో సినిమా)
ఇదీ చదవండి :హద్దులు చెరిపేస్తూ.. దేశమంతా విస్తరిస్తూ..