సినీ ఇండస్ట్రీలో సూపర్‌హిట్‌గా నిలిచే సినిమాలు కొన్నిసార్లు వివాదాల్లో నిలుస్తుంటాయి. తమ జాతిని, వర్గాన్ని, ప్రాంతాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని కొందరు కోర్టులను ఆశ్రయిస్తుంటారు. రూ.కోట్లలో పరిహారం డిమాండ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. రామ్‌లీలా, పద్మావత్ వంటి హిందీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొన్ని వర్గాల ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. నటీనటులను చంపుతామని బెదిరింపులూ వచ్చాయి. టాలీవుడ్‌లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి. అరవింద సమేత సినిమా రిలీజ్ అయినప్పుడు తమ ప్రాంతాన్ని తప్పుగా చూపారని కొందరు నిరసన వ్యక్తం చేశారు.
తాజాగా ఓటీటీలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలవడమే గాక, విమర్శకుల ప్రశంసలు అందుకున్న జై భీమ్ సినిమాను ఓ వివాదం చుట్టుముట్టింది(jai bhim controversy). ఏ తప్పూ చేయని ఓ బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు కస్టడీలో హత్య చేస్తే, అతని భార్య చేసిన న్యాయపోరాటం ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. 1990ల నాటి వాస్తవ ఘటన ఆధారంగా తీసిన ఈ చిత్రంలో విలక్షణ నటుడు సూర్య.. చంద్రు అనే లాయర్ పాత్రలో నటించి మెప్పించారు. ఆయనే నిర్మాతగా వ్యవహరించిన ఈ సందేశాత్మక సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
అయితే ఈ సినిమాలో సన్నివేశాలు తమ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని తమిళనాడులో వన్నియార్ సంఘం ఆరోపించింది(jai bhim controversy vanniyar). చిత్ర నిర్మాతలు సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌తో పాటు అమెజాన్ ప్రతినిధికి లీగల్ నోటీసులు పంపింది. వారం రోజుల్లోగా రూ.5కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
సినిమాలో బలహీన వర్గానికి చెందిన రాజకన్నును హింసించిన పోలీస్ అధికారి పాత్రను తమ వర్గానికి చెందిన వ్యక్తిగా చూపారని వన్నియార్ సంఘం అధ్యక్షుడు ఆరోపించారు(jai bhim news ). చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరెకిక్కించామని చెబుతున్నప్పటికీ.. పాత్రల పేర్లు అందుకు భిన్నంగా ఉన్నాయని నోటీస్‌లో పేర్కొన్నారు. నిజ జీవితంలో జరిగిన ఘటనలో పోలీస్ అధికారి పేరు ఆంథోనిసామి అని, అతను క్రైస్తవుడు అని వివరించారు. జై భీమ్ సినిమాలో మాత్రం సబ్ ఇన్స్పెక్టర్ పాత్రను వన్నియార్ వర్గానికి చెందిన వ్యక్తిగా చూపించారన్నారు. ఓ సీన్లో క్యాలెండర్లో తమ సంఘం గుర్తయిన అగ్ని కుంభాన్ని కూడా ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని తొలగించాలని డిమాండ్ చేశారు.
'సూర్యపై దాడి చేస్తే రూ.లక్ష'
ఈ సినిమాలో విలన్ పాత్ర దివంగత పీఎంకే(పట్టాలి మక్కల్ కట్చి)నేత కాదువెట్టి గురును ప్రతిబింబించేలా ఉందని ఆ పార్టీ మయిలదుథురై జిల్లా కార్యదర్శి పజాని సామి ఆరోపించారు(jai bhim controversy news). వన్నియార్ వర్గాన్ని నెగెటివ్ షేడ్‌లో చూపించారని, దానివల్ల సమాజంలో తమపై చెడు ముద్ర పడుతుందన్నారు. ఈ చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మయిలదుథురైలో జై భీమ్ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌ను పీఎంకే కార్యకర్తలు మూసివేశారు. సూర్య పోస్టర్లను చింపివేశారు. ఆ తర్వాత పోలీసులు వెళ్లి సినిమాను ప్రదర్శించాలని చెప్పినా నిర్వాహకులు ఒప్పుకోలేదు. జై భీమ్‌ను తీసేసి వేరే సినిమా వేశారు.